padyam-hrudyam

kavitvam

Sunday, March 25, 2018

సీతాకల్యాణం



" ఎప్పుడు వచ్చునో యిటకు నెప్పుడు శంభుని వింటిఁ జూచునో
యెప్పుడు దాని నెక్కిడునొ యెప్పుడు నా కరమున్ గ్రహించునో
చప్పున సాగు కాలమ! దశాస్యుని పీడ బ్రచండ మాయెెఁెెె పె
న్ముప్పున నున్న సాధువుల బ్రోవ వలెన్ రఘురాముడే వెసన్.

ఇప్పుడు లంక కేగ వలె నేనిక నా రఘురామమూర్తి యా
గొప్ప సముద్రమున్ గడచి క్రూర దశానను ద్రుంచనౌ వెసన్
తప్పదు కొంత బాధ మరి దండన సేయగ రాక్షసేశ్వరు
న్నెప్పటి కైన "  నీ గతి దపించిన జానకి! నీకు మా నతుల్.

ఇంత దయాంబురాశి జగ మెల్ల సృజించెడి తల్లి సీతయే
సంతస మొప్ప  జీవ తతి జల్లగ జూచుచు జేయు పాలనన్
చింతల బాపి సర్వులకు శ్రేయము గూర్చు నిరంతరమ్ము తా
నంతము జేయు సర్వము ననంత తుదిన్  సెలవిచ్చి సృష్టికిన్.

***

తెల్లని ముత్యముల్ మెరయ దివ్య కరాబ్జములందు కెంపులై
యల్లన వోసె రామవిభు నౌదల జానకి,  రాలుచుండగా 
మల్లెల రీతి నొప్పె నవి, మా రఘు రాముని మేని శోభ రా
ణిల్లి సునీలకమ్ములుగ నెంతయు దీప్తుల మించె సేసలే.

***

మైథిలీ రామచంద్రుల మనువు వేళ
నిట్లు మురిపించు సేసలు హితవు గూర్చి
ధర్మపరులను గాచును ధరణి లోన
మంగళములను  గూర్చును మానవులకు.


Sunday, March 18, 2018

విళంబికి స్వాగతం.



కూయని గండుకోయిలలు కూయగ వేడ్కను గున్నమావిళుల్
వేయు జివుళ్ళు గాలియును వీచు సుగంధ పరీమళమ్ముతో
పూయును మల్లె మొల్లలును పొంకముగా కుసుమించు వేములున్
హాయిగ నాడి పాడ ధర కయ్యెడ వచ్చు వసంతు డర్మిలిన్.

క్రొత్త చివుళ్ళు మెక్కి సరి క్రొత్త గళమ్మున పాడ కోయిలల్
క్రొత్త వెలుంగు లీను సరి క్రొత్త యుగాదిని ధాత్రి నల్దిశల్
క్రొత్తకు తావు నిచ్చి తన గూటికి జేరగ ప్రాత మెల్లగా
క్రొత్త చివుళ్ళ సాగు పలు కోర్కెలు డెందము లందు తీవలై.

కాలమను దివ్య చక్రాన కదలె జూడు
మరొక ఆకు మున్ముందుకు మహిత గతిని
కాల రూపేశ్వరుని భక్తి కేలు మోడ్చి 
సలుప వలయు విళంబికి స్వాగతమ్ము.

***

కాయము మావి, మానవుని కర్మఫలాలు చివుళ్ళు, జీవుడే
కోయిల, లోని వాణి కుహు కూయను పాట, సుగంధ వీచియౌ
వాయువు శ్వాస, లోవెలుగు వంకల ద్యోతము, జీవభూమికన్
నేయము జూచువారలకు నిత్యవసంతము సత్యమే కదా. 

Wednesday, March 14, 2018

వల్లభేశుడు




వల్లభదేవి నంకమున వాటముగా నుపవిష్ట జేసి తా
నల్లన వామహస్తమున నర్మిలి దగ్గర జేర్చ స్వామి మో
మెల్ల ప్రసన్నతల్ విరియు నెల్ల జగమ్ముల నేలు జూడు డీ
చల్లని విఘ్ననాయకుడు సాగిలి మ్రొక్కి నుతింపరే జనుల్.


Friday, March 2, 2018

హోళికా పూర్ణిమ.



రమ్య బృందావనీ సీమ రమణు లలర
నారి నారికి నడుమ మురారి మెఱసె
జలజలా పారు యమునలో జలము లాగి
చూచి పులకించి తరియించెఁ జోద్యముగను.

నిండు పున్నమి రేయెండ వెండి వోలె
నిసుక తిన్నెల మెఱయింప మిసమిస నవి
గోపికల గూడి యాడెడు గోపబాలుఁ
గనుచు పులకించి తరియించెఁ దనివి దీర.

దట్టముగ నిల్చి యమున లోతట్టు పైన
జట్లు గట్టిన చీకటిచెట్లు గూడ
నింతులను గూడి క్రీడించు నిందు వదను
నరసి పులకించి తరియించె నప్పు డెలమి.

తరుణులఁ గూడి మాధవుఁడు తారలతో శశి వోలె రంగులన్
మురియుచు మానినీ హృదయముల్ విరులై వికసింప యామునీ
శరముల నిండు పున్నమిని సారసపత్రపు నీటిబిందువై
తిరిగిన వేళ లోకములు దీయని వేదన నొందె నెల్లెడన్.

Thursday, March 1, 2018

గోవర్ధనం.



గుణాతీతం పరం బ్రహ్మవ్యాపకం భూధరేశ్వరమ్
గోకులానంద దాతారం వందే గోవర్ధనం గిరిమ్.

గోలోకాధిపతిం కృష్ణ విగ్రహం పరమేశ్వరమ్
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్.

నానాజన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః
కృష్ణభక్తి ప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్.

సదానందం సదావంద్యం సదా సర్వార్థ సాధనమ్
సాక్షిణo సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్.

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్ 
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్.

విశ్వరూపం ప్రజాధీశం వల్లవీ వల్లవప్రియమ్
విహ్వలప్రియ మాత్మానం వందే గోవర్ధనం గిరిమ్.

ఆనందకృత్సురాధీశకృత సంభార భోజనమ్
మహేంద్ర మదహన్తారం వందే గోవర్ధనం గిరిమ్.

కృష్ణలీలా రసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్ 
కృష్ణానందప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిమ్.

గోవర్ధనాష్టక మిదం యఃపఠే ద్భక్తి సంయుతః 
తన్నేత్ర గోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః .

ఇదం శ్రీమద్ఘనశ్యామ నందనస్య మహాత్మనః 
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతి ర్విజయతేతరామ్.