padyam-hrudyam

kavitvam

Thursday, May 24, 2018

వృద్ధ విలాపం.

కండ్లు మసకలాయె పండ్లూడి పోయెను
తోలు ముడుతలాయె కాలు చెయ్యి
పట్టు దప్పిపోయి పనికి రానైతిని
కన్న వారికైన కర్మ మేమొ.

వయసున కన్న బిడ్డలకు వంతలు సుంతయు సోకకుండ నే
రయమున నన్ని కూర్చుచును రాబడి నెన్నక వారి భావి న
వ్యయ మగు రీతి దిద్దగ నహర్నిశలున్ శ్రమియించి నాడనే
వయసు డుగంగ భారమని వారలె తల్ప నిదేమి కర్మమో.

కాలకృత్యములురా తాళలే రమ్మన్న
..........కస్సున కొడు కొంటి కాల లేచు
మందివ్వరా కన్న మంచివాడ వటన్న
..........వినబోక మనుమడు వేడ్క జూచు
అపరాహ్ణ మాయె నే నాగలే కోడలా
..........అన్నము బెట్టన్న నాగ్రహించు
శీతోష్ణవాతముల్ చెడ్డ బాధాయెను
..........రక్షించు డని పిల్వ రా రొకరును

నేటి కొకసారి కూతురే యేగుదెంచి
నాదు దుస్థితి గని కడు బాధ నొంది
నేను కొరగాని దాన నైనాను నాన్న
యోర్చు కొనమని కన్నీరు గార్చి పోవు.

కాననివాని నూత గొని కానని వాడు చరించు భంగి నా
దానను వృద్ధ నూత  గొని దాపున కాలము వెళ్ళ దీయుటే
ప్రాణము లుండు దాక నిక, బాలలు ప్రోడలు పెద్ద గారొకో
హీనుని  కన్న హీనునిగ  నీ ముదిమిన్ నను జూడ మేలొకో.

శ్రవణుని రీతి పెద్దలను సాకగ గోరము వైనతేయులై
ప్రవిమల భక్తి జన్మ నిడు వారి ఋణమ్మును తీర్చ వేడ మే
యవమతులం  బొనర్చకను నాదరణమ్మున జూడ జాలు మీ
కవగత మౌను మా వ్యధలు కాలవశమ్మున కొంచె మోర్వరే.







Tuesday, May 8, 2018

praja padyam vizag

ప్రజ-పద్యం 

***************

దండమయా విఘ్నేశ్వర!
దండమయా శంభుపుత్ర! దండము వరదా!
దండమయా గౌరీసుత!
దండమయా నీకు నెపుడు దండము గణపా!

విద్యల నిమ్మా దయతో
పద్యంబుల జెప్పగల్గు పటుతర శక్తిన్
సద్యః స్ఫూర్తిని యిమ్మా
హృద్యంబయి బుధులు మెచ్చ నిమ్ముగ వాణీ!

పద్యమె మనదౌ లోకము
పద్యమె శ్వాసయును ధ్యాస పద్యమె స్వరమౌ
పద్యమె భావము రాగము
పద్యమె సర్వమును మనకు బంధువులారా.                                                                      1

ప్రజ-పద్య కవివరుల్ ప్రభవించు తరగలై
.....సమధికోత్సాహాన సందడించ
పఠియించు కవితల ప్రమద నాదమ్ములు
.....జలధిఘోషను మించి చెలగి రేగ
కవియశశ్చంద్రికల్ కమనీయ కాంతులై
.....ఫేనరాజిగ తళ్కు లీనుచుండ
పక్షపద్యావళు లక్షయానర్ఘంపు
.....రత్నాల ముత్యాల రాశులవగ

నేటి ప్రజ-పద్య వైశాఖ మేటి ఘటన
పొంగ పద్యాభిమానుల పురణమగుచు
చిన్నవోయెను సంద్రమ్ము తన్ను మించు
క్రొత్త  సింధువు జాడతో తత్తరమున.                                                                           2

పద్యము లేని తెన్గు వసి వాడు నటంచు తలంచి యీ ప్రజా
పద్య సదస్సు పూనికను పద్యము లల్లెడి వారి నందరన్
సద్యశ పాత్రులై పరగ సంఘటిత మ్మొనరించి యిచ్చట న్
హృద్య కవిత్వ రీతులను నింపుగ చాటె తెలుంగు నేలపై.                                       3

పదికాలమ్ములు పచ్చగా బ్రతికి పద్య మ్మీ ధరిత్రిన్ ప్రజా
హృదయాబ్జమ్ముల కాంతులీను రవియై యింపారగన్ సత్కవుల్
మదులన్  పూనుక జేరి మాధ్యమమునన్ మాన్యత్వ మేపారగా
పదులున్ వందలు వేలు పద్యములతో భాషాంగనన్ గొల్వగా.

ప్రజపద్యంపు మనోహరాంగణమునన్ భవ్యాత్ములౌ సత్కవుల్
స్వజయోత్సా హము మించ స్పర్థ బరిలో సామాజికాభ్యున్నతిన్
నిజభావమ్ముల నుంచి వ్రాసిరి కదా నిండైన పద్యావళుల్
ప్రజ లోహో యని మెచ్చురీతి విబుధుల్ బాగంచు కీర్తించగన్.                             4


పద్యామృతము ద్రావి వైనతేయుడు ధృతి
.....తోడను సుధ దెచ్చె తొల్లి వినవొ
పద్యోపదేశమై బాలధ్రువుడు దివ్య
.....పదమును పొందెను మొదలు వినవొ
పద్యస్మరణ చేత బాలప్రహ్లాదుండు
.....నాన్నను  కాదనె మున్ను వినవొ
పద్యమ్ముపాసించి పవనసూనుడు సంద్ర
.....మును దాటె లీలగా మునుపు వినవొ
బ్రహ్మ రుద్రాదు లందిరి పద్యమహిమ
శాశ్వత మ్మగు పదవుల సంతసమున
పద్య మహిమను వర్ణింప బ్రహ్మ కైన
నాదిశేషుని కైనను కాదు తరము.                                                                                 5

పద్య గంధము లలదుక