padyam-hrudyam

kavitvam

Monday, February 28, 2011

రామ తారక శతకము 8

36 . ఈషణ త్రయంబు లీక్షించి మదిలోన - మేలు మేలని విడచు మేటి యొకడు
సద్గుణంబులు తనకు సామాన్యమని తలచి - స్వస్థుడై యుండు నా సాధుడొకడు
అష్ట భోగంబుల నాభాసమని యెంచి - తుచ్ఛ ముగా జూచు ధుర్యు డొకడు
విషయంబులను బట్టి విహరింప జాలక - సూటి దప్పక జూచు సుముఖు డొకడు

వనము పురమని కోరక వాన యనక - ఎండ మంచుల టంచును యెరుక లేక
నుండు నీ రీతి నవధూత యుర్వి లోన - రామ! తారక! దశరథ రాజ తనయ!

37 . జన్మ మెత్తిన ఫలము జగదీశ్వరుని యొక్క - పలుమారు గుణ కథల్ పలుకనైతి
బుద్ధి కలిగిన ఫలము బుధుల చెంతను జేరి - హరి జేరు మార్గంబు నడుగ నైతి
కాయంబు గల ఫలము కర్మ సంసారినై - నీయందు చిత్తంబు నిలుప నైతి
బహు వత్సరంబులు బ్రతికిన బ్రతుకుకు - సకల తీర్థా చరణ సలుప నైతి

బాల్య కౌమార యవ్వన భ్రాంతి జేత - వ్యర్థ మాయెను కాలంబు వేదవేద్య!
ద్రోహి, శరణంటి నను గావ దొడ్డ ఘనత - రామ! తారక! దశరథ రాజ తనయ!

38 . సంభ్ర మించిన ఫలము సంసార రహితుడై - భజియించి నిశ్చల భక్తుడగుచు
భక్తి వాత్సల్యంబు భావంబులో నెరిగి - యటు మీద సంధాన మమర జేయు
సంధాన మార్గంబు సతమని నెర నమ్మి - యమృత రూపుండవై యలరు చుండు
....................................................................................................................

నడ చదువు వల్ల ఫలమిది నరుల కెల్ల - కోటి విద్యలు నవి యెల్ల కూటి కొరకు
కొండ భేదించి ఎలుకను గొనగ వలెనె - రామ! తారక! దశరథ రాజ తనయ!

39 . మధు శర్క రాయుత దధి ఘృతంబుల కంటె - రామ నామామృత రసము తీపు
పనస జంబూ ద్రాక్ష ఫల రసంబుల కంటె - రామ నామామృత రసము తీపు
కదళికా మకరంద ఖర్జూరముల కంటె - రామ నామామృత రసము తీపు
నవ సుధా పరమాన్న నవనీతముల కంటె - రామ నామామృత రసము తీపు

రామ నామంబునకు నేమి సాటి రాదు - రామ నామంబు సేవించి నారదుండు
బ్రహ్మ ఋషి యయ్యె నిహమందు ఫలము నొందె - రామ! తారక! దశరథ రాజ తనయ!

40 . శ్రీ మంతుడగు రామ చంద్రుని దలచితే - నరచేత మోక్షంబు నందినట్లు
జయ రామ నామంబు జపము గావించితే - జీవాత్మకుడు ముక్తి జెంది నట్లు
కాకుథ్స తిలకుని కన్నుల జూచితే - బహు పేదలకు ధనం బిచ్చినట్లు
శ్రీ రామ చంద్రుని సేవింప గల్గిన - నష్ట భోగంబులు నమరినట్లు

కరుణ గలిగిన సద్గురువు గలిగి నట్లు - జీవ నదులందు స్నానంబు జేసినట్లు
కుటిలములు లేక జ్ఞానంబు కుదిరినట్లు - రామ! తారక! దశరథ రాజ తనయ!

2 comments:

ఎందుకో ? ఏమో ! said...

evarichethe mee vani prasaadinchabadinado varike addanini upayoginchuta naku adbhuthamugaa ananda daayakamugaa gocharichu chnnadi naaku ilaanti buddi alavadavale nani aasisthoo
meeku namaskaaraadulu teliyajesthoo
?!

http://paramapadasopanam.blogspot.com

మిస్సన్న said...

'ఎందుకో ? ఏమో !' గారూ స్వాగతం. శ్రీ రామచంద్రుని కృపాకటాక్షము లున్నవారికి సద్బుద్ధి ఎప్పుడూ కల్గుతుంది. మీకా సద్బుద్ధి కలదు కనుకనే శ్రీ రామ తారక శతకం నచ్చింది. ధన్యవాదాలు.