padyam-hrudyam

kavitvam

Sunday, November 27, 2011

చిన్మయ రూపిణీ !


నీ లలితాధరమ్మునను నిండుగ పూచిన నవ్వు పువ్వునే
నీల గళుoడు చంద్రునిగ నిత్యము దాల్చు శిరమ్ము నందునన్
రాలకునైన జీవమిడు రాజిలు నీ దరహాస చంద్రికల్
మాలిమి పొంగుటల్ కతన మానుగ చిన్మయ రూపిణీ ! శివా!

Thursday, November 17, 2011

చిన్మయ రూపిణీ !


ఎంత యగాధమో తలుప నెంతటి దుష్కరమౌనొ దాటగా
నంతము లేనిదీ భవమహా నను ముంచుచు నున్న దాయె నీ
చింతన నావతో దరికి జేర్చి తరింపగ నీవె సత్కృపన్
పంతము చూపగన్ జనని! భావ్యమె? చిన్మయ రూపిణీ! కటా!

Friday, November 4, 2011

చిన్మయ రూపిణీ !


క్షుద్రు లనిత్య సౌఖ్యముల గోరి, నిరంతర భాగ్య సర్వతో-
భద్రదమౌ భవాంఘ్రి యుగ భావన సేయరు, మూఢ చిత్తులై
రుద్ర మనోహరీ! యముని రోగ జరా మరణాది కింకరుల్
ఛిద్రము సేయరే బ్రతుకు చిన్మయ రూపిణి ! నేర రేలొకో!

Thursday, November 3, 2011

శివశివా !


గంగమ్మ తలపైన గంతులేయుచు నుండ
.......................కలత లేదా నీల కంఠ నీకు ?

పార్వతి సగమేను పంచుకొన్నను గాని
......................వెలితి లేదా నీకు విశ్వనాథ ?

పాములు మేనిపై ప్రాకుచున్నను నీకు
.....................వెలపరమ్మే లేద వేదవేద్య ?

చితిబూది పూసుక చిందు లేసెడి నీకు
....................చింతలే లేవేమి చిచ్చుకంటి ?

మంచు కొండ గూడు! మంచినీరు విషమ్ము!
భూత ప్రేత తతులు భూరి జనము !
చేత భిక్ష పాత్ర ! చిరునగ వెట్లౌను
శివము లిచ్చు టెట్లు శివశివయన ?

నెత్తిపైన గొప్ప నీటి యూటను బెట్టి
మంచు కొండలందు మసలు చుండి
నీటి ధారలందు నిత్యము నానినన్
జలుబు లేద నీకు చకిత మౌను !

కార్తిక ప్రభాత కాలమందున మాకు
స్నాన మాచరింప జంకు చలికి
మంచు కొండ పైన మసలుదు వీవెట్లు ?
చలిని గెల్చు నట్టి సులువు చెప్పు.

రెండు కనుల మాకు రేయంత కలలౌను
పగటి కలల గల్గు పరవశమ్ము
మూడు కన్నులున్న ముక్కంటివే నీవు!
కలలు రావె చిచ్చు కంటి నీకు ?

ఎండ వేడి మాకు, నిప్పు వేడిచ్చును
కోప తాపములను గొప్ప వేడి
చిచ్చు కంటి వీవు చితిభూమి ప్రియమేమి
వేడి లేద నీకు విశ్వమూర్తి !

శివ శివా యనంగ శివముల నిత్తువే
యిట్టి పాటు లేల నిందు ధారి!
శివ శివా ! ఎరుంగ శక్యమే ధాత్రినీ
తత్త్వ మెవరి కైన తలచు కొలది.

Tuesday, November 1, 2011

తెలుగు వెలుగు.


పాప నవ్వువోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుగు పలుకు.

వేమనార్యుడన్న విలువైన మాటలు
సుమతి శతక కర్త సూక్తి సుధలు
భవిత తీర్చి దిద్దు బంగరు బాటలై
తెలుగు జాతి రీతి తెలియ జెప్పు.

తేటగీతి సీస మాట వెలందియు
నందమైన కంద చందములును
కృష్ణ రాయ విభుడు కీర్తించె హర్షించి
దేశ భాషలందు తెలుగు లెస్స.

అమ్ములేసి నిలిపె నల్లూరి దొరలను
సింగమట్లు దూకె టంగుటూరి
అమరజీవి యాయె నా పొట్టి రాములు
తెలుగు కీర్తి దిశల తేజరిల్ల.

భోజనమ్ము నందు బొబ్బట్లు పులిహార
పనసపొట్టు కూర పచ్చిపులుసు
ఆవకాయ ఘాటు లాపైన గోంగూర
తినిన జిహ్వ లేచు తెలుగు రుచుల.

అట్లతద్ది భోగి యాపైన సంక్రాంతి
కనుమ బొమ్మనోము ఘన యుగాది
చవితి దశమి దివిలి శివరాత్రి బతుకమ్మ
తెలుగు పండుగలకు తీరు మిన్న,

అతిథి నాదరించు నయ్యల పూజించు
నమ్మ నాన్నలన్న నమిత భక్తి
అన్నదమ్ములందు నైకమత్యమ్మును
తెలుగు నేల నంత వెలుగు చుండు.

ఆంధ్రమందునైన అమెరి కా లోనైన
వెలుగులీను చుండు తెలుగు పలుకు
మనిషి దూరమైన మమతలు మాయునా
మైత్రి మహిమ మిన్న ధాత్రి లోన.