padyam-hrudyam

kavitvam

Saturday, March 5, 2011

రామ తారక శతకము 13

61 . రావణు జంపిన రామ భూపాలుని - సేవిన్చుడీ మీరు జనములార
సేతు బంధను రాము నేల మెచ్చరు మీరు - తలపర దేటికో ధన్యులార
ఘన జటాయువు కిచ్చె గాంభీర్య పదమని - విని ఎరుంగ రదేమి విమతులార
ఒక్క బాణంబున వాలిని బడవేసి - సుగ్రీవు బ్రోచెను సుజనులార

ఇట్టి త్రైలోక్య ధాముని యింక నైన - తలచ రది యేమి పాపమో ధన్యులార
భూమిజా నాధు డొసగును పుణ్య ఫలము - రామ! తారక! దశరథ రాజ తనయ!

62 . పద్మ నాభుని మీద పాటలు పాడుడీ - భవ బంధములు బాయు భద్రమగును
కమలా మనో నాథు కన్నుల జూడుడీ - నేత్రముల్ గల్గు ఫల మెగడి యుండు
శ్రీ గదా ధరు సేవ జేయు డెల్లప్పుడు - రోగముల్ దొలగి యారోగ్య మగును
కోదండ రాముని కోరి భజిoచుడీ - శత్రు నాశనమగు సమ్మతముగ

నిట్టి లీలావ తారునీ యీశు హరుని - బలుని తమ్ముని గోపాల బాల విభుని
పరగ నుతియించి సంపూర్ణ పదవి గోనుడి - రామ! తారక! దశరథ రాజ తనయ!

63 . పారెడి పారెడి భావ మరదికి బండి - ద్రోలి నన్నను వెన్న దొంగ వాని
గొల్ల ముద్దుల చిన్న గుబ్బెతలను గూడి - విహరించు గోపికా వినుత కృష్ణు
అడవి ఎంగిలి మేత యేమంత బోకుండ - ఎత్తి మ్రింగిన యట్టి యేపుకాని
తన సాటి వారల తగు బాలురను గూడి - పామును మర్దించు భవ్య చరితు

దేవు నాశ్రిత ధేనువు దేవ దేవు - జగములన్నియు బుట్టించు సంహరించు
పొసగ రక్షించు వాని నా బుద్ధి దలతు - రామ! తారక! దశరథ రాజ తనయ!

64 . కౌసల్య సుత రాము కరుణా సముద్రుని - గంగాది నది పాద కమల యుగళు
ఖండేందు ధర చాప ఖండను - జగదేక మండను బ్రహ్మాది మౌని వంద్యు
తాట కాంతకు రాము దైత్య సంహారకు - ముని యాగ రక్షకు మోహనాంగు
పరశు రాముని గర్వ భంజను లోకైక - రంజను రఘు రాము రాజ మౌళు

నెపుడు సేవింతు కీర్తింతు నేర్పుతోడ - బుద్ధి గలిగిన నీదగు పుణ్య పదము
గని ప్రమోదింప వలయును కష్ట పడక - రామ! తారక! దశరథ రాజ తనయ!

65 . ఏల సేవింపరో యేల భావిమ్పరో - శ్రీ రామ నామంబు చిత్తమందు
మాటలాడుచునైన మరచియైననుగాని - యెప్పుడు నైనను యెరుక నైన
దివము లందైనను తివిరి రాత్రులనైన - సంధ్య వేళల నైన సందడైన
భ్రమత చే నైనను భయము నొం దైనను - నోపక నైనను నొప్పి నైన

సకల లోకాధి నాథుని సర్వ సాక్షి - నాది దేవుని చిన్మయా నంద మూర్తి
బుద్ధి దలచిన దురితముల్ పోవు టరుదె - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: