padyam-hrudyam

kavitvam

Saturday, January 30, 2021

సుందరవిజయం 7

 

రావణ భవన, పుష్పక విమానముల వర్ణనము

సీ.
మెఱపుల శోభిల్లు మేఘ పంక్తుల వోలె
.........వజ్రవైడూర్యాది భాసితములుఁ
జిత్తము ల్దోచెడి చిత్రమౌ రీతినిఁ
.........జంద్రశాలల నొప్పు శైలములును
రావణ స్వార్జిత రమ్యసంపదలతో
.........దేవాసురులు మెచ్చు దివ్యములును
భూతల మందున భూరి గుణాఢ్యమై
.........మయ నిర్మితంబైన మహితకరము
తే.గీ.
లతుల శస్త్రాస్త్రములు గల యంపశాల,
లంబుజాత సంపన్న జలాశయములుఁ
జిత్ర భూరుహ పంక్తులఁ జెలగు వనము
లమల శ్వేతసౌధమ్ములు నచట దనరె. 7- 1
సీ.
మెఱపు తీగల వంటి మించు బోడులఁ గూడి
..........మేఘమో యన నొప్పు మేటిదనము
రాజహంసల చేత లాగఁబడెడు రీతి
..........దేవ విమానంపు దిట్టఁదనము
గైరికా ద్యుత్క్రుష్ట ఘన ధాతువుల తోడఁ
..........బ్రభల నీనెడు కొండ పచ్చదనము
గ్రహరాశి గమకాల గ్రహనేమి* వెల్గుల
..........నిగ్గారు గగనంపు నిండుదనము
తే.గీ.
రంగు రంగుల మబ్భులు హంగు మీర
నొక్కెడను జేరి మెఱసెడి చక్కఁదనము
రత్న నిర్మిత శిఖరంపు రాజసమ్ము
ప్రస్ఫురిల్లెడి రావణావాస మదియె. 7- 2
*చంద్రుడు

తే.గీ.
ధరణి పర్వత మయము భూధరము లచట
వృక్ష సంభార హితములు , వృక్ష తతులు
పుష్పగుచ్ఛ శోభితములు, పుష్పచయము
కేసరాయుతములు నట వాసిగాను. 7- 3
ఆ.వె.
వివిధ రత్న కాంతు లవిరళ గతి నొప్ప
నున్నత భవనముల నున్నత మయి
పుష్పకాఖ్య మైన భూరి విమానమున్
బవన సుతుఁడు సూచి ప్రమద మందె. 7- 4
కం.
పగడాల తాపడముతో
ధగధగ నపరంజి నిర్మితంబై చిలుకల్
దగ మదనోద్దీపక గతి
నగుపించెను బుష్పకమున నయ్యెడ గపికిన్. 7- 5
కం.
పద్మాల సరసులో నొక
పద్మాసనమందుఁ జేతఁ బద్మము తోడన్
బద్మయు, కరు లా దేవిని
బద్మాలను గొల్చు చిత్ర భంగిమ లొప్పెన్. 7- 6
ఆ.వె.
ఇన్ని కనియు రావణేశుని లంకలో
సీత నరయ లేమిఁ జింత నొందె
నిశిత బుద్ధిశాలి నేర్పరి శిక్షిత
మనము తోడ నొప్పు హనుమ యకట. 7- 7

Friday, January 22, 2021

సుందరవిజయం 6




(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - ఆరవ సర్గ)
రావణాదుల భవనములలో హనుమంతుఁడు సీతకై వెదకుట
=============================================
తే.గీ.
కామరూపియై మారుతి భూమిజ కయి
భవనముల లోన వెదకుచు వడిగఁ జనుచు
నరుణ భాస్కర వర్ణమౌ వరణము గల
పంక్తికంఠుని సౌధమ్ము వైపు కదలె. 6- 1
సీ.
కలధౌత మయములున్ గనకంపుఁ బూతల
.......ప్రభల నీనెడి బహిర్ద్వారములును
దంత రజత వర్ణ తాపడ యుతములు
.......వింతధ్వనులఁ జేయు పెక్కు తేరు
లుత్తమ కాంతల పుత్తడి భూషలు
.........గుణుకుణు మని చేయు గొప్ప సడులు
భేరీ మృదంగాది భీకర ధ్వనులును
.........హోమాగ్ని సంజాత ధూమములును
తే.గీ.
జలధి గాంభీర్యయుక్తమౌ శబ్ద మలర
గజ తురంగ రథాదుల గణము లెసగ
లంక కాభరణమ్ముగ రహి వహించు
రావణుని కోటఁ గాలించెఁ బావని వెస. 6- 2
తే.గీ.
రావణుని కోట దరి నున్న రాక్షసాళి
యిండ్లఁ దోటల విడువక నింత యైన
భయముఁ జెందక మారుతి రయముగాను
వెదుకఁ జొచ్చెను సీతకై వెంట వెంట. 6- 3
కం.
దశరథ రాముని సతికై
విశదముగా రక్కసుల నివేశము లెల్లన్
నిశితేక్షణములఁ గని పర
వశుఁడై యా సంపదలకుఁ బావని యొప్పెన్. 6- 4
ఆ.వె.
ఇట్లు సకల గృహము లెల్లను శోధించి
శక్తి ముద్గరాది శస్త్రములను
నిలిచి యచట వికృత నేత్రలై రావణుఁ
గాచు చున్న స్త్రీలఁ గాంచె నతఁడు. 6- 5
తే.గీ.
రావణుని మందిరము వద్ద కావలిగను
*గుల్మముల, శస్త్రధారులౌ గొప్ప దైత్య
తతులఁ, బలు వర్ణముల హర్యతములఁ, గరుల
ద్వారముల చెంత దర్శించె వానరుండు. 6- 6
*సేనావిశేషము
తే.గీ.
వివిధ రూపాల నలరించు ప్రేంఖణముల,
లతలతో నొప్పు పొదరిండ్ల, రమ్య చిత్ర
సదనముల, నాడు గృహముల, సతులఁ గూడి
యొంటి రావణుఁ డేలెడి యింటిఁ గనియె. 6- 7
కం.
మందర పర్వత సమమై
సుందరమౌ వనమయూర శోభాయుతమై
యందమగు ధ్వజములను గను
విందగు నా భవన ప్రభల వేడ్కను గనియెన్. 6- 8
ఆ.వె.
సకల నిధి రత్న సంచయ సంయుతమ్ము
రావణామోఘవిక్రమ లభ్య యశము
శివ సుకైలాస సన్నిభ శ్రీకరమ్ము
నసుర విభు సౌధ సౌందర్య మరసె నతఁడు. 6- 9

Wednesday, January 20, 2021

సుందరవిజయం 5

 

(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - ఐదవ సర్గ)
*హనుమంతుడు లంకలో సీతను వెదకుట*
సీ.
ఆవుల మందలో నాబోతుదౌ రీతి
........వెండి గూటిని దూడుదిండి వలెను
బర్వత గుహలోని బంచాస్యమును భాతి
........మదపు టేనుగు పైన మగని వలను
నున్నత శిఖరాల నొప్పు శైలము జాతి
........బంగరు దంతాల పద్మి పెలుచ
తారకా సైన్యాల దండ నాథుని గతి
........రాజ్యమ్ము నేలెడు రాజ నలవి
తే.గీ.
షోడశకళా ప్రపూర్ణుఁడై సొగసుకాఁడు
జక్కఁదనముల చెలికాఁడు రిక్క ఱేడు
మేఘ రహితమౌ గగనాన మెఱయ హృదయ
రంజకమ్ముగ నలరించె సంజ నరయ. 5- 1
ఆ.వె.
వినుట కింపు గాను వీణలు మ్రోయంగ
ధవుల సతులు శయలఁ గవగొనంగ
నద్భుతముగ భయదమై యొప్పు చుండంగ
నసుర తతులు కొన్ని యాడ సాగె. 5- 2
సీ.
త్రాగిన మైకాన వాగుచుఁ గొందఱు
.........మేల మాడుకొనుచుఁ దూలు కొనుచు
బోరలు విరచుక బోవుచుఁ గొందఱు
.........సతులపై వ్రాలుచు సర్దు కొనుచు
చిత్ర వేషమ్ములఁ జెలగుచుఁ గొందఱు
.........విలువిద్య సాధన సలుపు కొనుచు
జందన చర్చతోఁ జక్కగాఁ గొందఱు
.........నిద్రించ శయ్యపై నీల్గు కొనుచు
నవ్వు మొగముల గొందఱు, నాథుల యెడ
నలిగి నిట్టూర్పులను గొంద ఱతివ లిట్లు
వివిధ భంగులఁ బురుషులు నువిద లుండ
హనుమ సూచుచు సాగెనా యసుర పురిని. 5- 3
తే.గీ.
బుద్ధిమంతులు, బనులందు శ్రద్ధఁ జూపు
వారు, మధుర వచస్సుల వారు, మంచి
పేరు గల వారు, వికృతమౌ విగ్రహములఁ
దిరుగు రక్కసి మూకల నరసె నతఁడు. 5- 4
సీ.
ఉత్తమ పురుషుల కుత్తమ పత్నుల
..........స్వచ్ఛమౌ భావాల సతులఁ జూచెఁ
బతుల కిష్టంబైన పానాదులందునఁ
..........బాల్గొని మురిపించు పడతులఁ గనెఁ
దారల వలె వెల్గు తరుణీ లలామల
..........సిగ్గుతో మెరసెడి స్త్రీలఁ జూచె
భర్తల కౌగిళ్ళఁ బరవశించెడి వారి
..........సంతసమ్మున కేరు చానలఁ గనె
తే.గీ.
పసుపు పచ్చని సంపెంగ పసిడి వారి
మేల్మి బంగరు వర్ణాన మించు వారిఁ
బతుల విరహానఁ జిక్కిన పడుచు వారి
మైథిలినిఁ జూడ నేగుచు మారుతి గనె. 5- 5
కం.
సీతను వెదకుచు నమృతపు
సూతిని మించిన ముఖేందు సోయగములతోఁ
బ్రీతినిఁ జేసెడి పలువురు
నాతులఁ బరికించి చూచె నయముగ నచటన్. 5- 6
కం.
ఉత్తమ కుల సంజాతను
నుత్తమ ధర్మాభిజాత నుత్తమ సాధ్విన్
పుత్తడి బొమ్మ నయోనిజ
నత్తరి దర్శింపఁడాయె నతఁ డచ్చోటన్. 5- 7
సీ.
ధర్మాను సారియు ధవలగ్న చిత్తయు
............నుత్తమ వనితల నుత్తమయును
శ్రీరామ విరహాగ్నిఁ జిప్పిల్లు బాష్ప గ
............ద్గద ఖిన్న కంఠియు ధరసుతయును
మేటి పతకముతో మేలైన వక్త్రయు
............సుందర పక్ష్మయు సుస్వరయును
గాంతార నర్తన కాంతపక్షి నిభయు
...........నవ్యక్త శీతాంశు నమృత కళయు
తే.గీ.
బూది యంటిన పుత్తడి ముక్క వలెను
పైకి మానియు బాధించు బాణ హతిగ
గాలి కెడలిన కరిమబ్బు ఖండము వలెఁ
దనరు సీతను గనఁజాలఁ డనిలసుతుఁడు. 5- 8

Saturday, January 16, 2021

సుందరవిజయం 4


(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - నాలుగవ సర్గ)

*హనుమంతుడు ప్రాకారము దాటి లంకలో ప్రవేశించుట*
ఆ.వె.
లంక నట్లు గెలిచి లాంగూల వీరుఁడా
రాత్రి ప్రహరి నెక్కి శత్రు శిరము
పైనఁ బోలె సవ్య పాదమ్ము మోపి నాఁ
డమర పురిని మించు నసుర పురిని. 4- 1
తే.గీ.
అట్టహాస రవమ్ముల నదిరి పడుచు
వాద్యఘోషకు గుండెలు పగులు నట్లు
పిడుగు లుమిసెడి మబ్బుల వెరవు పెద్ద
మేడ లరయుచు సాగె సామీరి యపుడు. 4- 2
సీ.
అప్సరసల మించు నంగనా మణులవౌ
........మంద్ర మధు స్వర మార్దవములు
ముదితల యొడ్డాణముల, కాలి యందెల
........మువ్వల మురిపించు సవ్వడులును
నొక యింటఁ జప్పట్లు నొక చోట సింహనా
........దములు వేరొక తావు దాళములును
వేదనాదమ్ములు వివిధ జపమ్ములు
........రావణ స్తోత్రముల్ రావములును
తే.గీ.
రాక్షసుల యిండ్ల నా రాత్రి రాజసముగఁ
దిరుగుచును వినెఁ బావని యరయఁ గుజను
రాజమార్గానఁ జూచెను రక్షకులను
నగరి మధ్యనఁ గనె రావణాను చరుల. 4- 3
సీ.
వ్రతదీక్షలో నుండి క్రతువుఁ జేసెడి వారి,
.........నెద్దు చర్మము దాల్చి యెగురు వారి,
నున్నగుండుల వారి, మిన్న జడల వారి,
.........గరముల దర్భలు గలుగు వారి,
నరులు నశింపగా నభిచార హోమాల
.........నిర్వహించుచు నుండి నెగడు వారి,
ముద్గరాల్ దండముల్ మున్నగు శస్త్రాల
.........ధరియించి క్రుద్ధులై తిరుగు వారి,
నేకాక్షులగు వారి, నేక కర్ణము వారి,
........నుదరమ్ము కుచములు నుబ్బు వారి,
ముడుతలు వడియున్న మొగములు గల వారి
........వివిధాయుధమ్ముల వెలయు వారిఁ
బొడవు లావును గాక పొట్టి సన్నము గాక
........నెరుపుఁ దెల్పును గాక మెరయు వారి,
తే.గీ.
గూను లేనట్టి, మరుగుజ్జు గాని వారి,
రూపసులను, గురూపులఁ, దాపినట్టి
కవచధారుల, ధ్వజములు గలుగు వారిఁ
గాంచె మారుతి లంకలోఁ గనులు సెదర. 4- 4
తే.గీ.
పూలమాలలు ధరియించి పొంగు వారి,
మేన చందన మలదుక మించు వారి,
వివిధ వేషాలు ధరియించి స్వేచ్ఛ మీర
వజ్రములు శూలములు దాల్చి వరలు వారిఁ
(గాంచె మారుతి లంకలోఁ గనులు జెదర.) 4- 5
తే..గీ.
కొండ శిఖరముపై స్వర్ణ మండితమగు
ద్వార తోరణాల్, పద్మాలు పరిఖ, లొప్ప
పెద్ద ప్రాకారముల తోడ వెల్గుచున్న
రాక్షసేంద్రుని భవనమున్ రమ్యముగను,
(గాంచె మారుతి లంకలోఁ గనులు జెదర.) 4- 6
తే.గీ.
నగల చప్పుళ్ళ, దివ్యమౌ నాదములను,
ఘోట హేషల, రథ వాజి కుంజరముల,
బండ్ల, వ్యోమయానమ్ముల, వారిదముల
వంటి నాలుగు దంతాల భద్రములను,
(గాంచె మారుతి లంకలోఁ గనులు జెదర.) 4- 7
తే.గీ.
పశుల పక్షుల బొమ్మలు భాసిలంగ
తగిన సొగసుల నొప్పెడు ద్వారములను
నగణితమ్మగు నసురు లహర్నిశలును
గాపుఁ గాయు రాజభవంతిఁ గాంచె నతఁడు . 4- 8
తే.గీ.
స్వర్గమే యన నొప్పెడి స్వర్ణ లంక
నరయుచును సాగె ముందుకు నాంజనేయుఁ
డమిత హర్షమ్ము నొందుచు నందమునకు
ధరణిజను జూచు తలపునఁ ద్వరితముగను. 4- 9
కం.
అంగుగ ముత్యాల మణుల
బంగరు ప్రహరీలు దాటి పావని చేరెన్
రంగుగ ధూపపు టగరుల
హంగుగ విలసిల్లు రావణాంతఃపురమున్. 4-10

Tuesday, January 12, 2021

సుందరవిజయం 3



ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - మూడవ సర్గ

 *లంకాధిదేవత హనుమంతు నడ్డగించుట*

ఉ.
సుందరమైన తోటలును, సోయగమొప్పు జలాశయాలు, జ
క్కందన మొల్కు సౌధములుఁ గంధినిఁ బోలిన ఘోష, వెల్గులన్
జిందెడి మేఘపంక్తులు, సుశిక్షిత సైనిక సంచయాలుఁ గ
న్విందొనరించుచుం జెలఁగ వేల్పుపురిం దలపించు లంకలో. 3- 1
ఉ.
పాదము నుంచి వాయుజుఁడు భావము నందున నెంచె నేరికిన్
గా దిల లంకనుం గెలువగన్ గుము దాంగద మైంద ప్రభృతుల్
మేదిని నేర్చి యుందు రిది, మిక్కిలి శక్తిని వానరేశ్వరుం
డాదిగఁ గొద్ది వానరుల కౌ నిటఁ జేరఁగ నన్యు లెట్లొకో. 3- 2
ఆ.వె.
అనుచుఁ దలఁచి మరల నంజనా సూనుండు
వీరులందు మేటి వార లైన
రామలక్ష్మణులకు భూమిని సాధ్యమై
తీరు సర్వ మనుచుఁ దృప్తిఁ జెందె. 3- 3
ఉ.
లోనికిఁ గాలు వెట్టి చను లోపల మారుతి నడ్డగించె లం
కానగరాధిదేవత వికారముగాఁ బృథివీనభమ్ములే
పూనిక బ్రద్దలౌ పగిది బొబ్బలఁ బెట్టుచు నోరు పెద్దగా
నూనుచు ముందు వచ్చి నిలుచుండి తటాలునఁ బల్కె నిట్టులన్. 3- 4
కం.
ఓయీ కోతీ నీవెవ
రోయీ చొచ్చెదవు లంక లోనికి నీకిం
కాయువు మూడెను జాగుం
జేయక సర్వమును దెలియఁ జెప్పుము నాకున్. 3- 5
తే.గీ.
రావణుఁడు చతురంగ బలములఁ గూడి
సైనికుల తోడ రక్షించు సంతతమ్ము
నట్టి లంకాప్రవేశమ్ము నెట్టు చేయఁ
గలవు నీకదిసాధ్యము గాదుర కపి. 3-6
తే.గీ.
అనగ హనుమంతుఁ డిట్లనె నడిగినావు
గాన చెప్పెద ముందుగాఁ గాని యింత
వికృత నేత్రాల నొప్పు నీ వెవరు జెపుమ
యేలఁ బోనీక బెదిరింపు లిట్లు నాకు. 3- 7
చం.
అన విని లంక యిట్లనిన దాగ్రహ మొప్పగ వాతసూతితో
విను మిది రావణాజ్ఞ గొని వీడక లంకను గాచుచుంటి నే
ననుపమ శక్తియుక్తులను నట్టి నను న్నిరసించి లంక లోఁ
జనఁగల నంచు నెంచెద వసాధ్యము జంపెద నిన్ను వానరా. 3- 8
తే.గీ.
లంక మాటల కింతయుఁ జంకఁబోక,
కొండ వలె నామె యెదురుగా నుండి, వికృత
చందమున నున్న లంకతోఁ జతురుఁడైన
హనుమ యిట్లని పలికెను వినయమునను. 3- 9
తే.గీ.
సుందరమ్మైన లంకను జూచిపోవ
బుద్ధి పుట్టగ వచ్చితి బుల్లివాఁడఁ
జిట్టడవులను దోటలఁ గట్టడములఁ
జూచి పోదును బోనిమ్ము సుంత నన్ను . 3- 10
తే.గీ.
కామరూపిణి యది విని కటువుగాను
బలికె నో దుష్టబుద్ది యో వానరమ్మ
పోరులో నన్ను గెలువక దూరఁ దలచి
నావె లంకలో నీ కంత లావు గలదె.. 3- 11
ఆ.వె.
ఆంజనేయుఁ డంత నావేశ పడఁబోక
యో శుభాకృతి విను మొక్క సారి
నగర శోభఁ జూచి నా దారి నేఁ బోదు
ననుమతింపు మనెను వినయ మొప్ప. 3- 12
చం.
అది విని రాక్షసాంగన ప్రహస్తముతో నొక దెబ్బ కొట్టె నం
గదపడి వానరేశ్వరుని, గర్జన జేయుచు నంతఁ గ్రుద్ధుఁడై
పదపడి వజ్రదేహుఁడొక పాఠముఁ జెప్పగ నెంచి దానినిన్
జదిమెను వామహస్తమునఁ జప్పునఁ గంపముతోడఁ గూలగన్. 3- 13
ఆ.వె.
అబల యంచు నెంచి హనుమంతుఁ డామెపై
కరుణఁ జూపె మదిని మరల నపుడు
లంక మద మణంగ లజ్జతో భయముతో
హీన మైన స్వరము నిట్లు పలికె. 3- 14
తే.గీ.
నేను లంకాధి దేవత నిట్టు లైతి
నన్ను రక్షించు కపివరా! చిన్నఁబోతి
నబలలను జంప రాదిల నమిత బలుర
నెడి నియమమును బాటింప నేర వేమి. 3- 15
తే.గీ.
బ్రహ్మ నాకిచ్చె నాడొక వరము " నిన్ను
నెప్పు డొక కపి గెలుచునో యింతి నాడు
మొదలు రాక్షసులకు గొప్ప ముప్పు గలుగు"
నట్టి సమయము నేడాయె నది నిజమ్ము. 3- 16
ఉ.
సీత నిమిత్తమై కుటిలశీలుఁడు రావణుఁ డాది దైత్య ని
ర్భీతుల కౌ వినాశనము వీరవరా విడనాడి శంకలన్
బ్రీతిగ లంకలోని కరిభీకర మూర్తిగఁ బోయి వేగమే
సీతను గాంచి కాదగిన చేష్టలఁ జూడుము మూఁడె లంకకున్. 3- 17

Saturday, January 9, 2021

సుందరవిజయం 2

 


(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - రెండవ సర్గ )

*హనుమంతుడు లంకను చూచుట*
మకో. అమ్మహా బలుఁడైన మారుతి యా భయంకరమైన సం-
ద్రమ్ము దాటి యొకింతఁ దేరి ముదమ్ము నొందె త్రికూట శై-
లమ్ము పై నలరారు బంగరు లంక వంకను జూచుచున్
గుమ్ముగా వృక్షములు రాల్చిన గుట్టలౌ కుసుమమ్ములన్. 2- 1
కం. ఇంకను వందల కొలదిగ
నుంకించెద యోజనముల నుప్ఫని యిట్టే
జంకక, నూరామడలా
టంకము లేకుండ దాటుటలు సిత్ర మొకో? 2- 2
కం. అని తలచి యాన్జనేయుఁడు
చనె ముందుకుఁ బచ్చనైన చక్కని బయళుల్
గనువిందుఁ జేయగా రా-
వణ పాలిత మైన లంక వంకకు వడిగా. 2- 3
కం. ఫల పుష్పభరితమై పలు
పులుగుల కావాసమైన భూరుహ పంక్తుల్
గలువలు పద్మము లంచలు
గల వనములను గొలనులను గపి దిలకించెన్. 2- 4
సీ. పద్మకైరవముల భాసించు పరిఖలు
.........ధనువులఁ దాల్చిన దానవులును
బంగరు ప్రహరీల శరదభ్ర సమములై
.........యంబర మంటెడు హర్మ్యములును
విస్తృతమై యొప్పు వీధులు నమితమౌ
.........బురుజుల జెండాలఁ బురతతులును
లతలతో భాసించు రమ్యమౌ కాంచన
.........ద్వారమ్ము లొప్పెడి భవనములును
తేగీ. విశ్వకర్మ నిర్మితమైన వేల్పునగరిఁ
బోలు లంకను రావణ పాలితమును
నింగిలోఁ దేలుచున్నట్లు నిలుపబడిన
కోట నా లంకఁ గనెఁ గపికుంజరుండు. 2- 5
శా. ఆ లంకన్ గనగా నచింత్యమును భవ్యం బిమ్మునౌ పూర్వమే
పాలింపం బడె నా కుబేరపతిచే భాగ్యాల మంజూషగా
కైలాసాచల శృంగ మేమొ యన నాకాశమ్ము స్పర్శించు పా
తాలాంతర్గత భోగవ త్యస మహా స్థానీయమై తోచెడిన్. 2- 6
తేగీ. శత్రు దుర్భేద్యమైన దీ స్వర్ణ లంక
వానరానీక మీ పురిఁ జేరు టెట్లు
చేరి దనుజ సంఘములతోఁ బోరు టెట్లు
భూమిజను రాఘవుండింక పొందు టెట్లు . 2- 7
కం. అని తలచి మారుతాత్మజుఁ
డనుకొనె తనలోన మరల నది నాకేలా
కనుఁగొనెద మొదట రావణు
ఘన పటిమను సీత కొఱకుఁగాలింతు వెసన్. 2- 8
కం. నేనీ రూపముతో బల
వానులు గ్రూరులును దనుజ వైరుల దాటం
గా నేరను లంకను జిన
మేనునఁ జొరబడుట మేలు మెల్లగ రాత్రిన్. 2- 9
తేగీ. దుష్టుఁడౌ రావణుని గనుదోయిఁ బడక
ప్రభువు కార్యంబు నావల్ల పాడు గాక
యే యుపాయమ్ముతో లోన కేగ గలుగు
దెట్టు లాసీత జాడ నేఁ బట్ట గలను. 2- 10
కం. పరిపరి విధముల నీ గతి
ధరణిజకై వెదకు తీరుఁ దనలోఁ దానే
యరయుచు వాయు తనూజుఁ డె
దురు చూచెను రాత్రి కొఱకు తొందర వడకన్. 2- 11
తేగీ. ప్రొద్దు గ్రుంకినఁ దోడనే బుద్ధిశాలి
దేహ మెల్లఁ గుదించెను దీరు మారి
మూషకారాతి యంత యమోఘమైన
రూపుఁడై కొండ దిగి లంక ద్రోవఁ బట్టె. 2- 12
కం. బంగారు స్తంభములతో
హంగగు కిటికీలు పెక్కు లంతస్తులతో
రంగగు మేడలు గల లం
కం గన హర్షమున వెడలె కపివరుఁ డంతన్. 2- 13
ఉ. రావణ బాహు పాలితము రక్షితమై కనుపించు చున్నదీ
భూవలయమ్మునం గనక భూషితమై యలరారు లంక నే
నేవిధి కార్యమున్ గరపు టీ దనుజారుల కండ్లఁ గప్పి యం
చా విభవంబుఁ గాంచుచు మహా వ్యథఁజెందె కపీశుఁడంతలో. 2- 14
చం. హనుమకుఁ దానుఁ గూడను సహాయము సేయగ వచ్చినాఁడు ధా
త్రినిఁ దన వెండి వెన్నెలలఁ దెల్లగఁ జేయ సుధాంశుఁ డత్తరిన్
గన బెనుగుల్ల, పాలు, సితకంజము వోలెను శ్వేతపుంజమై
కనులకుఁ బంట యౌచు నుడుకాంతుఁడు రాతిరి వేళ నింగిలో. 2- 15

Wednesday, January 6, 2021

సుందర విజయము 1


    


(ఆధారము: శ్రీమద్వాల్మీకిరామాయణాంతర్గత సుందరకాండ - మొదటి సర్గ)

మ.కో.

జాంబవంతుఁడు ప్రోత్సహించగ శత్రు నాశకుఁడైన తా 

నంబరమ్మున నేగ నెంచెను యాతుధానుఁడు లంకలో 

నంబ నుంచిన చోటుఁ గన్గొన నాత్రమై హనుమంతుఁడున్ 

సంబరమ్మున గ్రీవమెత్తె వృషమ్ము పోలిక నొప్పుచున్.      1


తే.గీ.

"సాగరోల్లంఘనముఁ జేతు క్షణము లోన

సీత జాడను గనుగొందుఁ జింత వలదు"

పలికె సామీరి యాత్మ విశ్వాస మొలుకఁ

గపికులమునకు శాశ్వత ఖ్యాతి నొసగ.      2


తే.గీ.

అంజలించెను భక్తితో హనుమ యపుడు

భానునకు మహేంద్రునకును బవనునకును

స్వర్భువునకును భూతపంచకమునకును 

దక్షిణ దిశకు నేగెడి తలపుఁ బూని.      3


ఉ.

పెంచెను కాయమున్ హనుమ పెల్లుగ శక్తినిఁ బూని కాలు దా  

నుంచి మహేంద్ర కుధ్రమున హుమ్మని గెంతెను దాని యొత్తిడిన్

గొంచెము గ్రుంగె బర్వతము గొబ్బున వృక్ష సుమాలు రాలెఁ బీ 

డించబడంగ శైలములు ఢీకొని యగ్ని జెలంగె నంతటన్.      4


తే.గీ. 

హనుమ పాదపు టొత్తిడి కదిరిపోయి

కొండ గుహలలో జంతువుల్ గోల సేసె

సర్పముల నోళ్ళలో విష జ్వాల లెగసె

నోషధులు గూడ నా విష మ్మోప వాయె.      5


సీ.

కొండగుహల లోనఁ గొలువౌ తపస్వులు

...భూత దుశ్చర్యగాఁ బొరపడంగ

విహరింప వచ్చిన విద్యాధర శ్రేణి

...భయపడి  స్త్రీలతోఁ బయికి నెగుర

నణిమాది సిద్ధుల నాకాశమున నిల్చి

...విద్యాధరర్షులు వేడ్కఁ జూడ

దుస్తర జలధినిఁ ద్రుటిలోన లంఘించు

...నీద కొమరుఁడని ఋషులు వలుక

తే.గీ.

రోమములను విదల్చెను రూపుఁ గదపె

గర్జనముఁ జేసెఁ గొప్ప మేఘమ్ము వోలె

వినతసూనుఁడు పామును విసరినట్లు

వాయుసూనుఁడు విసరెను వాల మపుడు.      6


చం.

గుదియల వంటి బాహువుల గొబ్బునఁ జాచెను, కౌను కాళ్ళు తా 

నదనుగ వంచె,  స్కందముల, నాపయి కంధరమున్ బిగించెఁ దా 

హృదయమునందుఁ బ్రాణముల నిమ్ముగ స్తంభనఁ జేసెఁ జూచుచున్

గుదురుగఁ బోవు దారిఁ గపికుంజరుఁ డాకసవీధి నయ్యెడన్.       7


ఆ.వె.

శిఖరిఁ ద్రొక్కి పెట్టి చెవులను గుంచించి 

పైకి నెగురు వేళఁ బలికె నతఁడు

రామబాణ మెట్లు రయమునఁ బోవునో 

యేను నట్లె లంక కేగు వాఁడ.        8


ఆ.వె.

లంకలోన సీత లభియింప కున్నచో 

నమరపురికిఁ జనెద నచటఁ గూడ 

కాన రాని దైనఁ గట్టి యా రావణు 

రామపాదములను రాలవైతు.       9


తే.గీ.

ఎట్టులైనను కార్యమున్ బట్టుదలను 

బూర్తిఁజేతును, దర్శింతు భూమిసుతను, 

గానిచో రావణాయుతమైన లంకఁ 

ద్రవ్వి తెత్తు నా రామపాదముల వైతు.      10 


తే.గీ.

జలధి పైన ప్రయాణమన్ దలఁపు లేదు

లంక బహు దూరమనియెడు శంక లేదు 

వైనతేయుఁడ ననుకొని వాయుసుతుఁడు 

నింగి కెగిరెను క్షణములో నేరుగాను.        11


* హనుమంతుని సముద్రయానము *


సీ.

కొండపై వృక్షముల్ కొమ్మలతోఁ బాటు 

.........వెనువెంట నెగుర నా వేగమునకుఁ

బయనమై పోయెడు బంధుజనమ్ముల

........సాగనంపెడు వారి చంద మాయె!

మరికొన్ని చెట్లు సమరములో రాజు వెం- 

........బడిపోవు సైన్యమన్ భ్రాంతిఁ జేసె !

వెనుకకు మరలిన ప్రియమిత్రులో యనఁ  

.......బూల రాల్చుచు నీట కూలిపోయె!

శక్రుని భీతిచే జలధిలో మున్గిన 

......కొండల వలెఁ దోచె కొన్ని చెట్లు 

తే.గీ.

పూలు మొగ్గలు చివురులు రాల మీద

మిణుగురుల్ గప్పు కొండయై మెరయ హనుమ 

గాలి కెగిరిన పూవులు రాలి యుదధి

రిక్కలన్ మించు గగనమన్ రీతిఁ దోచె.       12


తే.గీ.

రంగురంగుల పూవులు రమ్యముగను 

వాయుసూనుని దేహానఁ జేయ విడిది  

మెరపులను గూడు నల్లని మేఘము వలె 

దోచినాఁ డాతఁ డయ్యెడ  దూరమునకు.        13


సీ.

చాచిన బాహువుల్ శైల నిర్గతములౌ

...పంచ శీర్షముల సర్పాల రీతి

రెండు నేత్రమ్ములు కొండలలో రాజు  

...కణకణ మను నగ్ని కణము లట్లు 

నెరుపైన నాసిక నెఱ్ఱనౌ వదనమ్ము

...వేకువలో రవిబింబ మనగ

గాలిలో లేచిన ఘనమైన వాలమ్ము 

...సాగి వంపుగ నింద్రచాపమొ యన 

తే.గీ.

తెల్లనౌ దంతములఁ గపి దేలి యున్న

వాలమున మధ్య గుడిలోఁ బ్రభాకరునిగ

వాలమూలమ్ము పగిలిన పర్వతంపు 

ధాతుశిల భాతి నరుణమై ప్రీతిఁ గొలిపె.      14


సీ.

మూసి తెఱచు బాహు మూలాలఁ బుట్టిన

...గాలి శబ్దము మేఘ గర్జ నాయె 

నుత్తరమ్మునఁ బుట్టి యుదుటున దక్షిణ 

...దిక్కు కేగెడు తోకచుక్క యాయె 

బంధింప గొలుసులఁ బదపడి ముందున 

...కురుకు మదించిన కరటి యాయె

నీటిలోఁ దోచెడి నీడను జూడగా

...నుదధిలో సాగెడి యోడ యాయె 

తే.గీ.

నాతఁ డెచ్చోట నెగిరిన నా జలమ్ము

బిచ్చి వట్టిన తీరాయె వేగమునకుఁ 

గొండ యెత్తైన కెరటాలఁ గొట్ట సాగె

ఱొమ్ముతోఁ గపియోధుండు హుమ్మనుచును.        15


ఉ.

ఆగక వాయువేగమున నంబర వీథిని వాతసూతి తా

నేగఁగ, ధాటికిన్ జలము నేగెను నింగికి మేఘపంక్తి గా

మూగుచుఁ గ్రింద గోతిని సముద్రపు జీవులు నగ్న దేహపుం

భాగము లట్లు బైకి కను పట్టిన వత్తరి నెంత వింతయో.        16


కం.

వెడలుపు పది యామడలును

బొడవుం గన ముప్పదియును మున్నీటను వెం

బడి వచ్చెడి హనుమంతుని

పొడ తెల్లని మబ్బు వోలెఁ బోవగ వడిగా....       17


ఆ.వె.

పక్షి వోలెఁ జను, బ్రభంజనమో యనఁ 

బెద్ద మబ్బు గుంపు వెంబడించు, 

నట్టి నీరదమ్ము లద్భుత కాంతులఁ 

జిత్రమైన రీతిఁ జెలగుచుండ.        18


కం.

మబ్బులలో దాగుండును 

గబ్బున వెలుపలికి వచ్చి కనుపించు నతం 

డబ్బుర పరచుచుఁ జంద్రుఁడు 

మబ్బుల మాటున రహించు మాడ్కిని వెల్గున్.      19


తే.గీ.

రామదూతను గని సురల్ ప్రేమ మీరఁ 

బూల వానలు గురిపింపఁ బూషుఁ డతని 

నెండతోఁ దపియింపక యింపుఁ గొల్పె

వాయు వనుకూలముగ వీచె హాయిగాను.      20


* మైనాకుని ఆతిథ్యము *


మ.

కని సామీరిని సాగరుండు మది పొంగన్ గౌరవం బంతటన్

దన యిక్ష్వాకు కులంపు బంధమును స్వాంతంబందు భావించి లో

నను దాగున్న హిరణ్యనాభు నడిగెన్ నాకీవు దోడ్పాటుగాఁ

జని నీట న్నిలు పైకిఁ దేలి కపి విశ్రాంతిం గొన న్నీ పయిన్.      21


కం.

అన మైనాకుఁడు రయముగఁ

జని ఫలపుష్పావృతంపు క్ష్మాజ భరితమౌ

కనకాచలమై సంద్ర

మ్మును జీల్చుక పైకి లేచెఁ బొడవౌ కొనలన్.      22


కం.

నల్లని మబ్బులఁ జించుక

తెల్లగ వెలుపలికి వచ్చు తిమిరారి వలెన్

బెల్లగు శోభల తోడ గు-

భిల్లున పైఁ బడిన దానిఁ బింగళుడు గనెన్.      23


కం.

"బంగారు శృంగములతో

హంగుగఁ బైకుబికి దారి కడ్డము నిలచెన్

భంగముఁ జేయగ నా పనిఁ

బొంగుచు రాక్షసుఁ" డని కపి బుద్ధినిఁ దలచెన్.       24


తే.గీ.

గాలి మబ్బును దాకిన గతినిఁ దాకె

ఱొమ్ము జేతను గిరిని మారుతి క్షణానఁ

బడెను మైనాకుఁ డా దెబ్బ పడిన యంత

లేచి పావని వేగముం జూచి మురిసె.      25


ఉ.

'సాగరుఁ డంపినాఁడు కపిచంద్రమ! కొంచెము విశ్రమింపగా 

నాగుము, దీరు నీ శ్రమము, హాయిగఁ  బండ్లనుఁ గందదుంపల

న్నాగృహమందుఁ జేకొనుము, నాదగు విన్నప మాలకించు  ని

న్నీ గతి సత్కరించుట లదే పదివే' లనె శైలరాజమున్.         26


తే.గీ.

సంతస మ్మాయె మర్యాద చాలు నాకు

నడ్డు వని యెంచి కొట్టితి నలుగఁ బోకు

కాల హరణమ్ము తగ దిట వీలు కాదు

మధ్యలో నాగ రాదని మారుతి యనె.         27


ఆ.వె.

చేతితో స్పృశించి ప్రీతితో మైనాకు

నెగిరె నింగి వైపు ఋషులు మెచ్చ

హనుమ జేసినట్టి యా ద్వితీయాద్భుత

కార్య మెంచి సురలు గణుతి సేయ.         28


* సురసను జయించడం *


చం.

సురలును సిద్ధులున్ ఋషులు జూచి కపీశుఁ బరీక్ష సేయగా

సురసను బిల్చి యో రమణి చుక్కలతెర్వున నేగుచున్న వాఁ

డరయుము వాని ద్రోవను  భయంకర రాక్షసివై విఘాతమున్

బరపుము చూతుమన్నఁ జనెఁ బాములతల్లి తదర్థమై వెసన్.        29


ఆ.వె.

వికృత రూపమునను భీతిల్ల నెల్లరు

సురస యసురనారి సరణి మారి 

జలధి మధ్యమునకుఁ జని హనుమంతుని

నడ్డగించి పలికె నాగు మనుచు.      30


ఆ.వె.

సురలు నిన్ను నాకు సురుచిరాశనముగా

నిర్ణయించినారు నేరుగాను

రమ్ము నోటిలోని కిమ్ముగా భక్షింతు

నన్న భీతి లేక హనుమ పలికె.        31


కం.

అమ్మా! దశరథ రాముఁడు

తమ్ముని నర్థాంగిఁ గూడి తండ్రి పనుపునన్

ద్రిమ్మరుచుండెను వనముల

నిమ్ముగ ఋషి పుంగవులకు నిరవై ధరలో.         32


ఆ.వె.

తాపసారులైన దానవ తతులతో

వైర మగుట దొంగ వలెను వచ్చి

సీత నపహరించె చెనటి యా రావణుఁ

డతని లంక కిప్పు డరుఁగు చుంటి.          33


తే.గీ.

సహకరింపుము నా కీవు సహనమునను

వీలు కాదందువా నేను వేగఁ బోయి

సీత నరసి శ్రీరామునిఁ బ్రీతుఁ జేసి

తిరిగి వచ్చెద భక్షింపఁ దృప్తి గాను.        34 


తే.గీ.

సురస కాదని పెద్దగాఁ దెరచె నోరు

బొటన వ్రేలంత రూపున బుద్ధిబలుఁడు

మారుతాత్మజుఁ డా నోట దూరి క్షణము

వెలికి నేతెంచి నింగిలో నిలిచె నపుడు.       35


కం.

మ్రింగగ రాహువు చంద్రుని

గ్రుంగక  వెలి కేగు దెంచి క్రొత్త వెలుగులన్

నింగిని క్రాలెడు గతిఁ గపి

పొంగుచు సురసాంగనకును మ్రొక్కుచుఁ బలికెన్.         36


తే.గీ.

నతులు దాక్షాయణీ! నీకు నాకు లిడిన

వరము నిజమాయె నీనోటఁ జొరఁబడితిని

తిరిగి వెలికి నేతెంచితి నరుగువాఁడ

సీత జాడను గనుగొన మాత! సెలవు.          37


తే.గీ.

రాహు ముఖ నిర్గతంబైన రాజు వోలె

నున్న హనుమను జూచి యా యురగ మాత

స్వస్వరూపమ్ముఁ దాలిచి, సాగుమయ్య

కలుప జానకీరాములఁ గపివర! యనె.       38


తే.గీ.

హనుమ చేసిన మూడవ యద్భుతమును

మేలు మేలని యందరు మెచ్చు కొనగ

గరుడ రయమున నుదధిపై కపివరుండు

వాయు మార్గాన నెగురుచుఁ బయన మాయె.          39


* సింహికను సంహరించడం *


కం.

రెక్కలు ముడిచిన గిరి వలె

మిక్కుటమౌ వేగమునను మింటను కనగా

నక్కజముగఁ బయనించెడు 

నక్కపి గనె సింహికాఖ్య యంబుధి లోనన్.          40


కం.

పీడించు చుండె నాకలి

నేడీ కపి దొఱకె నాకు నింగిని రాను 

న్నాడిటు భక్షించెద నని

నీడను బట్టుకొని లాగె నెమ్మది నతనిన్.         41


ఉ.

అంతట వానరేశ్వరుఁడు హా యని యచ్చెరు వొంది యేమి యీ

వింత మహా సముద్రమున వీచెడు గాలికిఁ జిక్కు నావనై

సుంతయు నాడ నీక ననుఁ జూడగ వెన్కకు లాగుచున్న ద

త్యంత మహోగ్ర శక్తి యని యన్ని దిశల్ బరికించి చూడగా.        42


ఉ.

నీటను జూచి పట్టి తన నీడను లాగుచునున్న రక్కసిన్

సూటిగ వానర ప్రభువు సూచన జేసిన జంతు వియ్యదే

మాటని బుద్ధిమంతుఁడగు మారుతి యోచనఁ జేసి లిప్తలో

వాటముగాఁ గళేబరము వార్నిధి నిండగఁ బెంచె నయ్యెడన్.        43


చం.

అది గని సింహికాస్రపయు నాస్య బిలమ్మును జేసెఁ బెద్దగా

నుదధిని మించు వానరుని నుబ్బుచు మ్రింగగ నెంచి యంతలోఁ

బదపడి సూక్ష్మ రూపునిగఁ బావని మారెను జొచ్చె రాక్షసీ

వదనము లోన కేగి బిగఁ బట్టెను రక్కసి మర్మ సంధులన్.              44


ఉ.

చివ్వున దానవాంగనను జీల్చగ నాయువుపట్లు గోళ్ళతో

న వ్వనసంచరుండు వడె నయ్యది దబ్బున నీట నార్చుచున్

గెవ్వునఁ గాలునింటి కరిగెన్ గని మెచ్చగ నింగి భూతముల్

నవ్వుచు రాక్షసాంతకుఁడు నాకపు మార్గముఁ బట్టె నేగఁగన్.          45


* మారుతి లంకలో దిగడం *


ఆ.వె.

ఇట్లు వాయుసూనుఁ డేగి నూరామడల్

చేరి చూచినాఁడు దీరమందు 

వృక్ష మండితమ్ము ద్వీపమున్ దోటలన్

సంద్రమునను నదుల సంగమముల.          46


తే.గీ.

భూరి జలదమ్ము వంటి శరీర మరసి

తలచెఁ దనలోనె తాని ట్లనిల సూతి  

యిట్టి కాయమ్ము వేగమ్ము నిపుడు సూడ

నిలుపుదురు దృష్టి నా పైనె పొలసుదిండ్లు.         47


కం.

అనుకొని పర్వత సమమౌ

తనువును దగ్గించుకొనియెఁ దత్క్షణమే తా

ననిలసుతుఁడు జ్ఞానులు కా

మనలను దగ్గించుకొనెడు మహనీయ గతిన్.      48


కం.

మూఁ డడుగుల వామనుఁడై

మూఁడు జగములాక్రమించి మూఁడగ బలికి

న్నాఁడు ద్రివిక్రమ రూపము

నూడిచి హరి యొప్పినట్టు లుండెను గపియున్.        49


ఆ.వె.

కామరూపుఁ డైన కపివీరుఁడు గడచి

ఘన తరంగములును గర్కటులును

దానవులును గూడు దారుణ వారాశి 

లంబగిరిని వ్రాలి లంక నరసె.          50

...............