padyam-hrudyam

kavitvam

Sunday, December 30, 2012

సరసాహ్లాదిని

 అక్క - అన్న - వదిన - మామ’

పై పదాలను ఉపయోగించి

రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ

పద్యం వ్రాయాలి:

 

పర పురుషుని సతి  యన్నను
వరుసకు నక్కనియొ లేక వదినయొ  యనుచున్
చరియింప నెరుగమా మరి
మరియాదయె సీత గోర మహిత గుణాఢ్యా?

Saturday, December 29, 2012

సరసాహ్లాదిని

సమస్య:
రామ మనోరథమ్ము భళిరా! నెరవేర్చెను కైక రాణియై!

పూరణ:

వేమరు వేడినన్ వినదు, వీడదు పట్టిన పట్టు నక్కటా!
యేమనెదన్? ప్రియాత్మజుని, యీ రఘువంశ సుధాబ్ధి సోము! నా-
రాముని! పంప కానలకు రవ్వను జేసెడి ప్రేమ మాలి నా-
రామ! మనోరథమ్ము భళిరా! నెరవేర్చెను కైక రాణియై!

Friday, December 28, 2012

మాసిన శశి బోలు నిన్ను మాతా! కంటిన్.





కోతినె కానీ నిజమిది
ప్రీతిని సేవకుడను నేను శ్రీ రామునకున్
ఖ్యాతిని తెత్తును వానర
జాతికి నిను జూచిపోయి జానకి! వినవో!

నిను బాసిన నీ రాముడు
వినుమమ్మా! తిండి నిద్ర విడచెను నీకై
యనవరతము దు:ఖ పడుచు
వనముల తపియించు చుండె వారిజనేత్రీ!

మాసిన వస్త్రముతో పతి
బాసిన దు:ఖమ్ము మిగుల బాధింపంగన్
మూసిన మబ్బుల కళలను
మాసిన శశి బోలు నిన్ను మాతా! కంటిన్.

నీకు తగు భర్త రాముడు
శ్రీకరునకు తగిన సతివి సీతా మాతా !
నీకిక శోకము కూడదు
నీకై చనుదెంచు నిటకు నీ పతి త్వరలో.

చింతను వీడుమమ్మ! చని చెప్పుదు నీవ్యధ రామ మూర్తితో
వంతెన గట్టి వార్నిధికి వానర మూకను గూడి వచ్చు నీ
కాంతుడు వేగమే యిటకు కాలము మూడిన పంక్తికంఠునిన్
సంతసిలంగ నీవు యమసన్నిధి కంపును నిన్ను చేకొనున్ !

Thursday, December 27, 2012

సరసాహ్లాదిని

సమస్య :
కోడలు మామ జూచి కనుగొట్టెను  రామ్మని సైగ జేయుచున్!

పూరణ:

వేడుక నాడు బిడ్డ, తను వెళ్ళెడు వేళ సినీమ కప్పుడే
కాడియు నెడ్లతో  దిగెను గమ్మున నింటికి పెద్ద! వెంటనే
కోడలు మామ జూచి, కనుగొట్టెను  రమ్మని సైగ జేయుచున్
తోడుగ పెన్మిటిన్ తమకు, తొందరగా నొక వంక భీతితో!


Tuesday, December 25, 2012

లోకముల కెల్ల పండుగ గాక యేమి?



కరిరాజ వదనుండు కరిరాజ వరదుడు
............ముచ్చట లాడుచు మురియు వేళ!
నాగ సూత్ర ధరుడు నాగారి వాహను-
............డుల్లాస హృదయులై యున్న వేళ !
ఆది పూజ్యుండును నాదిజు తండ్రియు
............భక్తావనమ్మున బరగు వేళ!
ఏక దంతుండు లోకైక నాథుండును
.............విష్ణు రూపమ్ముల వెలయు వేళ!

ఏమి చవితిని నష్టమి నిడుములేమి?
అను దినమ్మును శుభములు తనరవేమి?
విఘ్నములును విపత్తుల బెడద యేమి?
లోకముల కెల్ల పండుగ గాక యేమి?

Friday, December 21, 2012

సరసాహ్లాదిని


 సమస్య: 
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

పూరణ:

చెట్లు ప్రాణ వాయువు నిడు చేయు మేలు
కల్మషమ్ముల హరియించు గాలి లోన
మొక్కలను నాటి చెట్లకు ప్రోది సేయ
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

Wednesday, December 19, 2012

సరసాహ్లాదిని

సమస్య:  నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

పూరణ:

' నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ ' హరా!
చక్రీ! కావరె యన్న నిష్ఫల మిదే శాపంబు రాజాధమా!
వక్రా! వేములవాడ భీమ కవి కా బన్నంబు? పొమ్మంచు తా
నాక్రోశించె సభాంతరస్థలిని హాహాకారముల్ రేగగా.

Sunday, December 16, 2012

మధుర బృందావనీ సీమ మధుపమగుదు ....




పసుల కాపరి వీవు పసు పతియును నీవు
..................పసు లక్షణమ్ముల మసల నీకు.
శిఖి పింఛ మౌళివి శిఖ పట్టుకొని నీవు
.................చెడు దారి బోకుండ శిక్ష నిమ్ము.
వేణుగాన విలోల వేవేల రాగముల్
.................నీవి గానివి జేర నీకు నన్ను.
గోపాల బాలకా గోపాలురను వోలె
.................చెలిమి  నీతోడను  చేయ నిమ్ము.


యమున యొడ్డున పున్నమి యామిని నను
నీదు చెంతను పులకింప నిమ్ము కృష్ణ!
మధుర బృందావనీ సీమ మధుపముగను
పుట్టి నీ పాద పద్మాల మురియ నిమ్ము.

Saturday, December 15, 2012

చిన్మయ రూపిణీ !

 


భండాది ప్రముఖామరారి తతులన్ భంజింపవే తల్లి! బ్ర-
హ్మాండంబుల్ పరిరక్ష సేయుటకునై మాల్మిన్ మహా కాళి! పిం-
డాండంబుల్ మనలేవు నీ కనులలో నగ్నుల్ జ్వలింపంగ నో 
చండీ! చిన్మయ రూపిణీ ! కరుణతో  సౌమ్యాకృతిన్ దాల్పవే!

Thursday, December 13, 2012

జిలేబీ తయార్




మినప గుళ్ళు తెచ్చి మేలి రకమ్మును
నీటిలోన నాన నిచ్చి పిదప
పిండి రుబ్బవలయు నండి మెత్తగ దాని
పులియ బెట్ట వలెను పూటబాటు.

పంచ దార దెచ్చి బాణలిలో పోసి
నీరు జేర్చి సన్న నెగడు మీద
లేత పాక మైన రీతిని కానిచ్చి
ప్రక్క నుంచవలయు పదిలముగను.

నూనెను మూకుడు లోనిడి
మానుగ స్టౌ పైన బెట్టి మరిగిన పిదపన్
పూనిక పులిసిన పిండిని,
పానకమును ప్రక్కనుంచి పళ్ళెము లోనన్,

కొబ్బరి చిప్పకు కొద్దిగ
దబ్బనమున చిల్లు జేసి దానిలొ పిండిన్
గొబ్బున నుంచిన పిమ్మట
నబ్బురమగు చుట్ట వోలె నయ్యది దానిన్,

కాగు నూనె లోన కమ్మగ వేయించి
వేడి వేడి చుట్ట వేయ వలెను
పాకమందు నాన బాగుగా తయ్యారు
తీయనౌ జిలేబి తినగ పొండు.

Sunday, December 9, 2012

నాకు చేయూత నిమ్ము పినాక పాణి !




లోక గురవే నమ:

ఆయుష్షు జారెడు ననుదినమ్మును జూడ  
...............కవ్వించి మాయమౌ యవ్వనమ్ము! 
పోయిన దినములు పోవు మరలి రావు 
...............కబళించు లోకమున్ కాల మెపుడు!
భంగ తరంగముల్ క్రుంగెడు  రీతిని 
................చంచలమౌ సిరి సంపదలును! 
మెరుపు తీగె యనంగ మురిపించి మాయమౌ 
................నీవిడి నట్టి నా  జీవితమ్ము!

శరణమని పట్టితిని నీదు చరణములను 
గాన శంకరా! నాయందు కరుణ జూపి 
నాకు చేయూత నిమ్ము పినాక పాణి!
విడచి పెట్టక యేలుకో! విశ్వనాథ!     

Monday, December 3, 2012

వలదు వలదోయి శంకరా వలదు వలదు.






శ్రీ శంకర గురవే నమ:

పౌరోహితీ వృత్తి, బ్రహ్మ విద్వేషమ్ము
..............పరమేశ్వరా! నాకు వలదు వలదు.
రాత్రి సంచారమ్ము,  గ్రామాధికారమ్ము 
..............పార్వతీపతి! నాకు వలదు వలదు.
మూగ సంతతియు, నియోగమున్, పరభుక్తి 
..............భవహర! శివ! నాకు వలదు వలదు.
కల్లలాడు ప్రవృత్తి, ఖలజన మైత్రియు
..............వామదేవా! నాకు వలదు వలదు.

భూత నిర్దయ, పశుబుద్ది భూతనాధ!
సాక్షి వాదమ్ము లిచ్చుటల్ సాంబ మూర్తి!
వలదు వలదోయి నాకిల వలదు వలదు
జన్మ జన్మల కైనను శంకర! శివ!

Sunday, December 2, 2012

ఎన్న నివి యెల్లను బుద్బుదముల్.......




 ఆది గురుభ్యో నమ:

ఏమిడు యాత్రలున్ ధనము నేన్గులు గుఱ్ఱము లేలు రాజ్యమున్ ?
ఏమిడు పుత్ర మిత్ర  సతులిల్లును గోవులు కీర్తి సంపదల్?
ఏమిడు దేహ? మెన్న నివి యెల్లను బుద్బుదముల్! తలొగ్గకన్
కామునకున్ గురూక్తుల ప్రకారము సాంబశివున్ భజింపుమా!

Saturday, December 1, 2012

మంత్ర మఖమ్ముల నేమి ముక్తియౌ?







శివాయ గురవే నమ:


ఇందుధరున్! స్మరాంతకుని! యీశుని! శీర్షమునన్ సురాపగల్
చిందులు వేయు వాని! సువిశేష శుభంకరు! నాగభూషణున్!
సుందరు! నగ్ని లోచనుని! శుద్ధు! కపర్దిని! చిన్మయున్! మనో-
మందిర మందు నిల్పు మిక! మంత్ర మఖమ్ముల నేమి ముక్తియౌ?


Friday, November 30, 2012

త్రిగుణములకు నతీతు నిన్ దెలియ కుంటి.........







శంకరాచార్య స్వామినే నమ:

హృద్యుడవు వేద వేదాంత వేద్యు డవును
హృదయ పద్మాల వెల్గుల నీను హరివి
శాంత చిత్తుండ నిత్యుడ సత్య మూర్తి
వివిధ మునిజన హృదయాబ్జ వేద్యుడీవు !

స్వప్న జాగ్ర త్సుషుప్త్య వస్థలకు పరుడ
త్రిగుణములకు నతీతు నిన్ దెలియ కుంటి
దురితమును జేసి యుంటిని దుష్ట మతిని
నన్ను క్షమియించు శంకరా! నన్ను గావు.

Thursday, November 29, 2012

సకల మందుండు లింగ రూపకుడు శరణు ........



ఆది గురువుకు అభివాదములతో............

హృదయ సరసిజ స్థానాన నెపుడు నిలచి
ప్రణవ యుత ప్రాణయామాన వాయు గతిని
సూక్ష్మ మార్గాన స్తంభింప జూచి శాంతు,
దాంతు, దివ్య శివాఖ్యుని దలుప నైతి.

సకల మందుండు లింగరూపకుని, బ్రహ్మ-
వాక్యమున నేను స్మరియించి పలుకనైతి
నాగ్రహింపకు శంకరా! అధముడనని
తప్పు మన్నించు శివశివా! దయను జూపు.







Wednesday, November 28, 2012

మంద బుద్ధిని యున్మత్త మతిని నేను..................



శ్రీ శంకరులకు ప్రణామములతో......

స్వామి నగ్నుడ వీవు! నిస్సంగుడవును!
త్రిగుణ రహితుడ వీవు! నీ దృష్టి యెపుడు
నిల్చు నాసాగ్ర మందున! నీవు  మోహ-
తమ మెరుంగవు! భవమందు తపన లేదు!

మంద బుద్ధినై యున్మత్త మతిని యగుచు
నిన్ను స్మరియింప కుంటిని నిత్య మకట
నన్ను మన్నించు  శంకరా! నాదు తప్పు
గాచి రక్షించు దయతోడ కాల కాల!




 

Monday, November 26, 2012

రుద్ర జపమును దలుపలే దద్రిజ పతి................




శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమః

మదిని నీ నామమును దల్చి మరల మరల
ద్విజుల కెక్కుడు దక్షిణల్ బెట్ట లేదు
బీజ మంత్రాలతో నీదు పేరు జెప్పి 
లక్ష హోమాల జేయ లేదక్షయముగ.

గంగ యొడ్డున నీ వ్రత కర్మ సలిపి
దాన మిడి రుద్ర జపమును దలుపనైతి
తప్పు మన్నించు శంకరా! దయను జూడు
నాదు యపరాధమును సైచి నన్ను గావు.

Sunday, November 25, 2012

తప్పు మన్నించు శంకరా! దయను జూడు.




శ్రీ శంకరులకు ప్రణామములతో ................

పదపదమ్మున  గహనమై భారమైన
స్మార్త కర్మలు చేయగా శక్తి లేదు
బ్రహ్మ మార్గానుసారియౌ బ్రాహ్మణునకు
విహితమౌ శ్రౌత మనినచో వెఱపు నాకు.

తత్త్వ మెరిగిన పిమ్మట తలుపనేల
శ్రవణ మననాల ధ్యానమ్ము నెవడు జేయు
నేరమున్ జేసినాడను నిన్ను మరచి 
తప్పు మన్నించు  శంకరా! దయను జూడు.

Saturday, November 24, 2012

నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ................




ఆది గురవే నమః.

పెరుగు తేనెను నెయ్యయు బెల్లములను
పాల నభిషేక మొనరింప జాలనైతి
చందనము పూయలేనైతి చల్లగాను
స్వర్ణ పుష్పాలు ధూపదీపాలు  లేవు.

వివిధ భక్ష్యమ్ములను దెచ్చి విరివిగాను
నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ !
నన్ను క్షమియించు శంకరా! నతులు నీకు
తప్పు మన్నించు కాపాడు  దండము లివె.

Friday, November 23, 2012

వేకువను లేచి తేనైతి నీకు గంగ................



శ్రీ జగద్గురవే నమః

వేకువను లేచి నీ యభిషేకమునకు
స్నానమొనరించి తేనైతి చల్లనైన
గంగ నీటిని, పూజకై కఱవు దీర
బిల్వ దళములు తేనైతి, కల్వ పూల,
పరిమళమ్ముల వెదజల్లు సరసిజముల,
గంధ ధూపాల తేనైతి బంధురముగ
శివ శివా! నన్ను మన్నించు చేసినాడ
తప్పు!  క్షమియించు శంకరా! దయను జూడు.
 

Sunday, November 18, 2012

ఎద్దిర బాలకా................



ముద్దులు మూటగట్టు చిరు మువ్వవొ! మొద్దు మృగాల కెన్నగా
యొద్దిక నేర్పు బాల గురువో! పులి పాలను గొన్న స్వామివో!
పెద్దలు మెచ్చ భారతపు పేరుకు మూలమవైన బిడ్డవో!
ఎద్దిర బాలకా తగిన యింపగు నామము నీకు చెప్పవో !

సరసాహ్లాదిని

సమస్య:
మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే!

పూరణ:
నెచ్చెలి నాలో వలపుం-
జిచ్చు రగుల్కొనును నీదు చెక్కిలిపై నా
మచ్చను గనినంత నహో
మచ్చా! అది కాదు కాదు మణిభూషణమే!

వృద్ధుడనై తలపకుంటి విశ్వేశు మదిన్.



శ్రీ జగద్గురవే నమః

వార్ధకమ్మున నింద్రియాల్ వడలి పోయె
బుద్ధి వికలమై మనమున పొగులుచుంటి
వ్యాధి బాధల దైవిక పాశములను
పాప రోగాల విరహాల వ్యసనములను

తనువు కృశియించె ఙ్ఞప్తియు తగ్గిపోయె
దీనతను బొంది యే దిక్కు గానకుంటి
శివశివా! నీదు స్మరణమ్ము చేయకుంటి
తప్పు గావవె శంకరా! దయను జూపు.

Saturday, November 17, 2012

యవ్వనమ్మున నీ యూసు లసలు లేవు.



ఆది గురువున కభివందనములతో......................

యవ్వనమ్మున నన్ను విషాహు లైదు
మర్మ సంధుల గఱచుట మాసి పోయె
తెలివి !  పుత్రుల, సిరులను, స్త్రీల బొంది
తగని సంసార సుఖముల తగిలి యుంటి.

అంతమే లేని మాన గర్వాంధత బడి
యెదను నీ చింత తోపలే దింత యైన
నేర మొనరించితిని శివా! నేర నైతి
తప్పు మన్నించు శంకరా! దయను జూడు.

Friday, November 16, 2012

పసి తనమ్మున శివుడని పల్కనైతి.




నమామి భగవత్పాద శంకరం లోక శంకరం.,,,,,,,,,,,,,,

బాల్యమున పొర్లితిని మల పంకిలమున
దప్పిగొని స్తన్య పానాన తగిలియుంటి
ఇంద్రియమ్ముల శక్తి లేదింత యైన
భవ జనితమైన జీవముల్ బాధ పెట్టె.

పెక్కు వ్యాధుల బాధలు పీడ జేసె
దుఃఖ పరవశ మొందితిన్,  తోప లేదు
నీదు నామమ్ము, నేరమే నీలకంఠ!
తప్పు క్షమియించు శంకరా! దయను జూపు.

Thursday, November 15, 2012

గర్భమందు శివుని కాననైతి.


 




శ్రీ శంకర భగవత్పాదులకు పాదాభివందనములతో.............

తొల్లి కర్మల వశమున తల్లి గర్భ
వాస నరకమ్ము నొందితి పాప మంట
మూత్ర మలముల మధ్యన మునిగి యుంటి
కాల్చె జఠరాగ్ని తనువును  గాఢముగను.

అప్పు డెంతటి దుఃఖమో చెప్ప తరమె ?
నీకు తెలియదా నాబాధ నిజముగాను ? 
నిన్ను స్మరియింప లేదని నింద మోపి
తప్పు లెన్నగ శంకరా తగదు నీకు. 

Tuesday, November 13, 2012

నీవిక చింతను వీడు ! పోయి రా !

 మిత్రులందరికీ దీపావళీ శుభాకాంక్షలు.
 

 


భానుడు చింతతో పలికె పాపము ధాత్రికి వెల్గు లెట్టులౌ
నేను చనంగ రాత్రి యని,  నీవిక చింతను వీడు పోయి రా !
నేనిడు దాన కాంతులను  నెమ్మది,  నీవరుదెంచు  దన్క  నా
మేను గలుంగు దాక యనె   మిత్రుని తోడను దివ్వె కూర్మితో.

Friday, November 9, 2012

చిన్మయ రూపిణీ !



శ్రీ పద పంకజమ్ములను చిత్తము నిల్పగలేని మందుడన్ 
నాపయి కిన్క బూనుటది న్యాయమె? ధాత్రిని  బిడ్డలందునన్
కోపము దీర్ఘ కాలమది కూడదు తల్లికి, నీవెరుంగవే ?
పాపము వీడు బాలుడను భావన చిన్మయ రూపిణీ! తగున్.

Tuesday, November 6, 2012

సరసాహ్లాదిని

సమస్య : కారము కన్నులంబడిన కల్గును మోదము మానవాళికిన్.

శ్రీ రఘురామ దర్శనము క్షేమమొసంగును, పాపరాశులన్
తారక నామ సంస్మరణ దగ్ధము చేయును, భద్రశైలమున్
దూరము నుండి చూచినను దు:ఖము పోవును, గోపురమ్ము ప్రా-
కారము కన్నులంబడిన గల్గును మోదము భక్తకోటికిన్.

Saturday, November 3, 2012

సరసాహ్లాదిని


"రాకు - పోకు - తేకు - మేకు" ఈ    పదాలను ఉపయోగించి భారతార్థంలోపద్యం చెప్పాలి .

రాకుమారుల మధ్య స్పర్థలు రాజ్యలక్ష్మికి చేటగున్
పోకు పోరుకు నాశనమ్మగు పొందు మేలు సుయోధనా
తేకు మచ్చను తొల్లి పెద్దల దివ్య కీర్తికి పాపమౌ
మేకువై మన వంశ కుడ్యపు మేలు బాపకు మూర్ఖతన్.

Thursday, November 1, 2012

వ్రాసె నొక ప్రేమ లేఖను ........................

పాంధుడుగా వచ్చి నృపతి
గాంధర్వ గతిన్ గ్రహించి కరమును కడు మో-
హాంధత ముంచెను నను సఖి
బంధము గురుతెరుగ జేతు వ్రాసెద లేఖన్.

ఓరాజా! వేటాడుచు
నారామము జేర వచ్చి యబలన్ నన్నో
వీరా! కరమును బట్టవె
తారను చంద్రుండు వోలె తమకము మీరన్ .

నను జేకొని మురిపించితి
వను రాగపు సంద్ర మందు నవధులు లేకన్
తనియగ ముంచితి వకటా!
చని మరచితి వేమి యన్ని సంగతులు నృపా!

ఈ వీటను నేనొం టిగ
పూవిల్తుడు బాధ పెట్ట పొగులుచు నుంటిన్
రా వేగమె చేకొన నన్
నీవే పతి గతియు నాకు నిజముగ రాజా!

అని లేఖ నా శకుంతల
యనువగు నొక పత్రమందు ననురాగముతో
తన ప్రియుని కొరకు వ్రాసెను
కనుడది యీ మదిని దోచు ఘన చిత్రమునన్.


Wednesday, October 31, 2012

సరసాహ్లాదిని

సమస్య :  శూర్పణఖ సాధ్వి లోకైకసుందరాంగి

పూరణ:

హితవు పల్కెను మారీచు డిట్లు రాజ!
కల్ల సుద్దులు చెప్పెను కపటి వినుము
శూర్పణఖ, సాధ్వి లోకైకసుందరాంగి
సీత జెరబట్ట నెంచుట చేటు నీకు.

Tuesday, October 30, 2012

పశ్చిమాద్రి కడ గాయత్రీ!





రవి పూర్ణేంద్రుల పైని నింద్ర ధనువై రాజిల్లెనేమో యనన్
నవరత్నోజ్జ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరిం-
చి విరించ్యుక్తుల నాలపింప చిగురించెన్ తా నభోవల్లి సాం-
ధ్య విశేషంబన పశ్చిమాద్రి కడ గాయత్రీ! త్రి సంధ్యా సతీ!

ఈ పద్యం కీర్తి శేషులు యడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారు రచించిన శ్రీ గాయత్రీ శతకం లోని నాల్గవ పద్యం.

సూర్య చంద్ర బింబములపై ఇంద్ర ధనుస్సు నతికినారా యన్నట్లు వాణి నవరత్న వీణను పట్టుకొని సామగానాలాపనము చేయగా ఆకాశ లత పడమటి దిక్కున సంధ్యారాగమను నెపముతో చిగురు తొడిగిందా
అన్నట్లు గా ఉంది అన్నది ఈ పద్యంలోని సుందరమైన భావం.

Sunday, October 28, 2012

సరసాహ్లాదిని

పాలు, పెరుగు, చల్ల, వెన్న - ఈ పదాల నుపయోగించి భారతార్థంలో పద్యం వ్రాయాలి.
                                          అయితే పై పదాలను వాటి సహజార్థంలో వాడకూడదు.


పెరుగుట కక్షలెవ్వరికి పెంపొనరించును? కౌరవేశ! నీ
వెరుగవె ధర్మజాదులకు వేగమె పాలిడి జేరదీయవే,
కురియుచు చల్లగా మమత కూర్మిని,  వెన్నుని మాట చొప్పునన్!
కరుగవె సంపదల్ జరుగ కయ్యము? సాక్షిగ నుందు వెన్నగన్ .

Friday, October 26, 2012

సరసాహ్లాదిని


సమస్య:  దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.


ఓర్వగ లేక సోదరుల యోర్మిని కూర్మిని మెచ్చలేక తా
నేర్వక ధర్మబుద్ధి కురునేత సుయోధను డొందె నాశమున్
గర్వము ద్రోహమున్ గరపు కర్ణుని మైత్రికి బద్ధుడై కటా
దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.

Thursday, October 25, 2012

చెడ్డది నీ తల్లి .....



 

ముని యిచ్చిన వరమును తన
చిన తనపుం జాపలమున జేయగ పరిశీ-
లనమును బిల్చెను కుంతి ర-
విని,  భాస్కరుడిచ్చి పోయె బిడ్డ నతివకున్.

బిడ్డను గని భయమున రా-
బిడ్దొక మందసము నందు పెట్టెను వానిన్
అడ్డుపడ మాతృ హృదయము
చెడ్డది నీతల్లి యనుచు చేరెను నదికిన్.

పెట్టెను బాలుని తోడను
గట్టిగ బిగబట్టి గుండె కన్నియ నదిలో
నెట్టన విడువం బెట్టెను
చట్టున వెనుదిరిగె తల్లి చంచల మతియై.

Wednesday, October 24, 2012

చిన్మయ రూపిణీ !

 


  
కరముల నీ పదార్చనలు, కన్నుల నీదగు దివ్య రూపము-
న్నరయుటలున్, ముఖమ్మున భవాబ్ధిని దాటగ నావయైన నీ
వర గుణ వర్ణనల్ సలుపు భాగ్యము పొందిన పుణ్యమూర్తులన్
చరణము లంటి మ్రొక్కినను చాలదె చిన్మయ రూపిణీ! శివా!

Tuesday, October 23, 2012

కువకువలాడు మాబ్రతుకు ....................







 


 
నవనవలాడు జీవితము నవ్య సుశోభల, సర్వ సౌఖ్యముల్
కువకువలాడు మా బ్రతుకు గూటను  నీ కరుణార్ద్ర దృక్కులన్
పవలును రేయియున్ తడియ! పర్వమె నిత్యము! నెన్న నీ మహ-
ర్నవమిని నిన్ను గొల్చినను నాకమె చిన్మయ రూపిణీ ! తుదిన్.

Monday, October 22, 2012

సరసాహ్లాదిని

నన, నీనీ, నును, నేనే  -  ఈ పదాల నుపయోగించి భారతార్థంలో పద్యం వ్రాయాలి:

ననరు బోడి నీవేనటే నన్ను వలచి
వచ్చితివి భామి నీ నీదు వలపు సింహ
బలుని ముంచెత్తె నునుసిగ్గు వలదు చాలు
కలికి నేనేగదా రమ్ము కౌగిలిమ్ము.

త్రోవ జూప గదే !



 





 
దుర్గమమౌ భవాటవిని దు:ఖితునై కనజాల కుంటి నే
మార్గము త్రోవ జూప గదె మాలిమి దృక్కుల కాంతి రేఖలన్
స్వర్గమదేల నాకు భవ సంచిత కిల్బిషముల్ నశించినన్
భర్గుని రాణి! దుర్గ! విను  ప్రార్థన మీ నవరాత్రి వేళలో!

Sunday, October 21, 2012

ఈ నవరాత్రి వేళలో !


    



మృణ్మయ  భంజికల్ కనగ మేము ధరించిన యీ శరీరముల్
కన్మరుగౌ నిమేషమున కాలుని చూపులు సోకినంతనే
సన్మతి నిచ్చి నీ చరణ సన్నిధి నిల్పవె మమ్ము నెప్పుడున్
చిన్మయరూపిణీ !   నిను భజించెద    నీ నవరాత్రి వేళలో !

Saturday, October 20, 2012

సరసాహ్లాదిని

" పోరా,  తేరా, రారా, సారా "   ఈ పదాలను పాదాదిలో నుపయోగించి భారతార్థంలో పద్యం చెప్పాలి.

పోరాదు కృష్ణ జోలికి
తేరా దగదోయి  సభకు ధృతరాష్ట్ర !  సుతున్
రారాజు నాపవలె మన-
సారా యోచింపు మనెను సంజయు డంతన్.

Saturday, October 13, 2012

సరసాహ్లాదిని

దుగ్ధము, దగ్ధము, ముగ్ధము, దిగ్ధము   ఈ నాలుగు పదాలను పాదాదిలో ఉంచి
 కృష్ణుని పై వృత్తం వ్రాయాలి:

ఉత్పలమాల:

దుగ్ధము  లాను బాల్యమున ద్రుంచెను పూతన !  గోపికాళికిన్ 
దగ్ధము జేసె మోహమును తానయి సర్వము ! స్పర్శమాత్రచే 
ముగ్ధ మనోహరాంగి యగు మూర్తిగ మల్చెను కుబ్జ !  శౌరి! సం-
దిగ్ధము బాపి యర్జునుని దిద్దెను పోరున గీత వాక్కులన్ !

Saturday, October 6, 2012

సరసాహ్లాదిని

సమస్య : అర్థము లేని మాటలకు నందరు మెచ్చి శిరస్సు లూపరే!

పూరణ: వ్యర్థము వీనితో మనకు వాదము, లెమ్మిక ధర్మనందనా!
            స్పర్థను దూరుచుండె నిటు చైద్యుడు చక్రిని, చింత యేల యీ
            యర్థము లేని మాటలకు? అందరు మెచ్చి శిరస్సు లూప రే 
            యర్థము కోరి యీ తగవొ? ఆ హరికే ఎరుకౌను చూడగా!
 
 

Wednesday, October 3, 2012

సరసాహ్లాదిని

సమస్య : రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!

పూరణ:  రామశరాగ్ని కీలలను రాజ్యము దగ్ధము కాక మున్నె శ్రీ 
             రాముని ప్రాపు పొందుమని భ్రాత వచింపగ క్రోధనేత్రుడై  
             రామను గోలుపోయి వని గ్రాలెడు మర్త్యుడు దేవుడేమి? ఏ-
             రామ పదాబ్జమే శరణురా? యని పల్కెను రావణుం డహో!
             

Tuesday, October 2, 2012

స్మరియింతును.........


 





సత్యాగ్రహ చాపమ్మున
నిత్యమ్ము నహింస యనెడు నిశిత శరాళిన్ 
దైత్యుల బోలిన దొరల య-
కృత్యమ్ముల నేసి గొనవె కీర్తిని బాపూ!

స్మరియింతును బాపూ నిను 
స్మరియించెద నో మహాత్మ! సదమల భక్తిన్ 
స్మరియింతు ననవరతమును 
హరియింపు మసత్య హింస లందరి యెదలన్.
 

Sunday, September 30, 2012

చిత్ర వర్ణన

అగ్నిదేవుడు
అగ్ని దేవ సన్నుతింతు నయ్య నీవు లేనిచో భగ్న మౌను జీవయాత్ర పావకా వివాహపున్
లగ్నమందు శ్రద్ధ జేయు లాఁతి లౌకికమ్మునన్
మగ్నమౌను మా మనమ్ము మత్కృతమ్ము నీ యెడన్.

Saturday, September 29, 2012

సరసాహ్లాదిని

సమస్య :
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.

పూరణ : 
గురువే మాతా పితరులు
గురువే దైవమ్ము ధనము కొల్వుము వత్సా
గురుతర భక్తి శ్రద్ధల
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.













 


 


 

Thursday, September 27, 2012

చిన్మయ రూపిణీ !










పగలాదిత్యుడు వెల్గు నీయ  ధరకున్ భాసించు హస్తమ్ములన్
జగతిన్ చీకటి రాజ్యమేలగ  నిశల్ సంప్రాప్తమై చూచి చి-
ర్నగవున్ లేశము దీసి నింగి నిడవే రాకా శశాంకుండుగా !
నగజా! చిన్మయ రూపిణీ ! సకరుణానందానుసంధాయకీ !

Monday, September 24, 2012

సరసాహ్లాదిని

ఒక బాలుడు వాళ్ళ అమ్మను మమ్మీ అనీ నాన్నను డాడీ అనీ పిలవడం విన్న తాత 
నాయనా! ఆ దిక్కు మాలిన మమ్మీ డాడీ ఇంగ్లీషు మాటలకు అర్థం ఏమిటిరా అంటే 
ఆ బాలుడిలా అన్నాడు.

మమ్మీ డాడీలు, తెలుఁగు మాటలె తాతా!

అదెలారా అన్న తాతతో ఆ కుర్రాడిలా అన్నాడు.

 అమ్మీ యని పిలిచెదనే
నమ్మను డా యన్న ఎడమ యౌ డీ యన్నన్
నమ్ముము డీ కొట్టుట విను-
మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!





  

Sunday, September 23, 2012

చిత్ర వర్ణన

    
 మల్లి   పరిమళాల   తల్లి  








    స్వచ్ఛతకు మారు పేరుగ సద్గుణముల
    శోభ లీనెడు మనసుకు సూక్తులందు
    నిన్ను పోలిక తెత్తురు నిఖిల బుధులు
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    మండు వేసవి గాడ్పుల మాడి పగలు
    చల్ల గాలిని తిరుగాడు సంధ్య వేళ
    నీ గుబాళింపు మదులను నింపు శాంతి
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    శివునకును విష్ణువునకును శివ సుతునకు
    ముజ్జగమ్ముల నేలెడు మూల శక్తి
    త్రిపుర సుందరికిని నీవు తృప్తి నిడవె
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    శంభు దివ్య గాత్ర స్వచ్ఛత చెప్పుచో
    పలుకుతల్లి శోభ తెలుపు వేళ
    నీదు దేహ కాంతి యాదరణీయము
    మల్లె! పరిమళాల తల్లి వీవు.

    బుట్ట మల్లె యంచు బొండు మల్లె యటంచు
    బొడ్డు తీగ సెంటు ముద్ద లంచు
    వివిధ జాతులగుచు విందొన రింతువు
    మల్లె! పరిమళాల తల్లి వీవు.

    చెలికి చెలువునకును సేతువై వలపుల
    ముంచి తేల్చి వారి మురియ జేసి
    నలిగి పోదు వీవు మలిగి పోదువు నీవు
    స్వార్థ మెరుగ వీవు సార్థ జీవి.
*     *     *     *     *

Saturday, September 22, 2012

సరసాహ్లాదిని

సమస్య:
దుర్విన యంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.

పూరణ:
ఓర్వగ లేక సోదరుల యోర్మిని కూర్మిని మెచ్చలేక తా
నేర్వక ధర్మబుద్ధి కురునేత సుయోధను డొందె నాశమున్
గర్వము ద్రోహమున్ గరపు కర్ణుని మైత్రికి బద్ధుడై కటా
దుర్విన యంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా. 





Thursday, September 20, 2012

సరసాహ్లాదిని


సమస్య:   విఘ్న పతికి మ్రొక్క విఘ్నము లిడు.

పూరణ: భాద్రపదమునందు భద్రేభవక్త్ర యో
              వరద గావు మంచు భక్తి తోడ
              విఘ్నపతికి మ్రొక్క విఘ్నము లిడుమలు
              దొలగ జేయు భద్ర మలర జేయు.

చిత్ర వర్ణన





                                          బాల గణపతి








                                                       


                                        మంచు కొండపై నాయన మరచి మేను
                                        ప్రళయ తాండవ మొనరింప పరవశించి
                                        తల్లి యొడిలోన కూర్చుండి దాని జూచు
                                        బాల గణపతి గొల్తును భక్తి మీర.
                                  

Wednesday, September 19, 2012

 

విఘ్నరాజ నీకు వేయి నతులు

 

   



చవితి పండుగటంచు సంబర మేపార 
బొజ్జ గణపతయ్య బొమ్మ బెట్టి
పాలవెల్లి పత్రి పండ్లను గొని తెచ్చి  
పూజ సేయ నేను పూనుకొంటి.

మావి గరిక తులసి మారేడు నేరేడు 
జమ్మి దేవదారు జాజి పత్రి 
కలువ మల్లె మొల్ల గన్నేరు చామంతి 
పూలు తెచ్చి నేడు పూజ చేతు.

కుడుము లుండ్రములును  కొబ్బరి  యటుకులున్
పాలు జున్ను తేనే పానకాలు 
ద్రాక్ష యరటి వెలగ  దానిమ్మ పళ్ళను 
తిను మటంచు పెడుదు తృప్తి మీర.

చేత వేడి కుడుము చెంగట తమ్ముడు 
ఎలుక వాహనమ్ము నేన్గు ముఖము  
పెద్ద చెవులు బొజ్జ పెరికిన దంతమ్ము
విఘ్న రాజ నీకు వేయి నతులు.

కమ్మగ యుండ్రములను దిని   
యిమ్ముగ తిరుగాడ భువిని యిమ్మని చందా 
గమ్మున మూగిన భక్త జ-
నమ్ముల గని జారుకొను వినాయకు గొలుతున్.