padyam-hrudyam

kavitvam

Sunday, September 29, 2013

ప్రణవ నాద! మోంకారము!........





ఆదినాదమ్ముగా నవతరించిన గీత-
........మానంద సంధాయ మైన గీతి!
పంచాక్షరికి ముందు పల్లవించెడు గీత-
........మాది శంకరున కామోద గీతి!
ఆముష్మికము గోరు నా ముముక్షుల గీత-
........మాగమమ్ముల కమ్మ యైన గీతి!
జపతప యజ్ఞాది సర్వ కర్మల గీత-
........మష్టసిద్ధుల నిచ్చు నమర గీతి!

నాట్య సంగీత శాస్త్రాల నవ్య గీతి!
భారతీయుల సంస్కృతి ప్రాణ గీతి!
అన్ని జీవులలో మ్రోయు హంస గీతి!
ప్రణవ నాద! మోంకారము! భవ్య గీతి!


Wednesday, September 25, 2013

ఏమి మహానుభావమిది?


ఏమి మహానుభావమిది యీశ్వర! నీదగు వామభాగమౌ
నామె ప్రియాత్మజున్ బొదువ నంకమునన్, భవదీయ పుత్రుఁడున్
బ్రేమగఁ బట్టి మీ మొలను వ్రేలెడు నూలును, వెంట నంటెడున్!
గోముగ పెద్దవాఁడచట, కుఱ్ఱఁడు క్రింద నదేమి చోద్యమో!

ఏ తిరునాళ్ళ కీ పయన మేగుచు నుండిరి పిల్లగాండ్రతో?
రాతిరి యేడ మీకు బస? రమ్య వనాంతర సీమ లందునా?
మాత! జగత్పితా! తలప, మాయెడ మాలిమి పొంగ మీ యెదన్
భూతల మేగుదెంచిరని పోలెడు, మా యెదలందు నుండరే!

ఏల మహేశ్వరా! తమరికింతటి మాలిమి మానవాళిపై?
ఆలిని దాల్చి మేన సగమందున దోగుచు వెంట నంటి రా
బాలురు షణ్ముఖుండు గజవక్త్రుఁడుఁ, జయ్యన వచ్చినారు మా
నేలకు, మమ్ము నేలుటకొ? నీలగళా! కరుణా సముద్రమా!

తల్లియు తండ్రియున్ కలసి తత్త్వములున్ దనువుల్ సగమ్ముగా,
బిల్లల వెంటబెట్టుకొని పెద్దమనస్సున నేగుదెంచిరీ
చల్లని వేళలో, జనులఁ జల్లగఁ గావగఁ జూడు డల్లదే!
యెల్లరు మ్రొక్క రారె పరమేశునకున్, ధరణీ కుటుంబకున్.

Wednesday, September 11, 2013



ఆగు, విడువకు బాణము, నాగు పార్థ!
రథము క్రుంగెను, చక్రమ్ము లాగి పైకి
మరల యుద్ధమ్ము జేసెద నరయు మయ్య!
ఆయుధము లేని నను జంప న్యాయమగునె?

విజయ! బాణము సంధించు, విడువబోకు
నీతి మాలిన వానిపై నీకు జాలి
తగదు,  బాలు నిరాయుధు తెగడి నపుడు
ధర్మ పన్నము లేమాయె, తప్పు లేదు .

కర్ణు డీల్గెను భీభత్సు కరకుటమ్ము
గుండె చీల్చగ! పడమటి గూటికేగె
నర్కు డాతని గనలేక! నాశ్రయమ్ము
చెడ్డదగుటను, కర్ణుడు చెడెను తుదకు.

Monday, September 9, 2013

శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా!



శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా!
భావింపందగు నన్ని కార్యములలో ప్రారంభమందున్ నినున్!
రావే విఘ్నము లెందునన్ కొలువ దూర్వారమ్ములన్, నిత్యమున్,
భావిన్ మంచి శుభమ్ము, కీర్తి గలుగున్ ప్రార్థించ నిన్ భక్తితో.

భాద్రపదమ్మున చవితిని
భద్రేభముఖున్ భజింప భక్తిని సర్వుల్
భద్రంబగు, రావు దరి యు-
పద్రవములు విఘ్ననాధు పటుతర కృపచే.

కొల్తును నే గజవక్త్రుని,
కొల్తును నే గౌరిసుతుని, కొల్తును దంతున్,
కొల్తును నే విఘ్నేశ్వరు,
కొల్తును నే భక్తితోడ కొల్తును సతమున్.

వరములనిమ్మా గణపతి!
కరిముఖ! గౌరీకుమార! కల్పోక్త విధిన్
కరమొప్ప భక్తి మనమున
వరదా యని పూజ సేతు పత్రిని, పూలన్.

గణనాథున్ భజియింపరే సతతమున్ గల్గున్ గదా సంపదల్!
వణకున్ విఘ్నము లెల్ల విఘ్నపతిఁ సంభావింపగా, దేవతా
గణముల్, యక్షులు, రాక్షసప్రభృతు లేకార్యమ్ము చేపట్టినన్
ప్రణతుల్ జేతురు దొల్త దంతిముఖునిన్ ప్రార్థించి సఛ్ఛ్రీలకై.


Friday, September 6, 2013

భావ్యమె? రామ! దయానిధానమా!



భాద్రపదమ్మునందు మము భద్రతఁ జూడుము భద్రమూర్తివై
ఛిద్రములాయె మా బ్రదుకు చిత్రములెల్లను నిత్యకృత్యమౌ
క్షుద్రపు రాజకీయముల సోకుల మూకలఁ జిక్కి శల్యమై
భద్రగిరీశ! దాశరథి! భక్త జనావన కల్పవృక్షమా!

నిద్రయు దూరమాయె నవినీతి నిశాచర ఘోర చేష్టలన్,
భద్రత మాసిపోయినది, భద్రగిరిన్ కొలువుండి చూపినన్
ముద్రను భీతి వీడుమని మోదమె? పూనికఁ బూని యీ  మహో-
పద్రవ మాపకున్న మరి, భావ్యమె? రామ! దయానిధానమా!

చిద్రూపుండవు చిన్మయుండవు సదా శ్రీ జానకీవల్లభా!
సద్రాజాన్వయ వార్థి సంభవ శశీ! సంహారముంజేసి యా
క్షుద్రుండౌ దశకంఠు, డస్సితివొకో! చూడంగదే మమ్మికన్
నిద్రాసక్తిని వీడి కూల్చగదవే నీకోల నా దైత్యులన్.

 

Wednesday, September 4, 2013

చిన్నికృష్ణా! నిన్ను చేరి కొలుతు.




నల్ల కలువ మోము, పిల్లన గ్రోవియున్,
ఘల్లుఘల్లు మనెడు కాలి గజ్జె,
చిట్టిపొట్టి యడుగు లిట్టట్టు వేయుచు
నందు నిందు నాడు నందు పట్టి!

ఆవు పొదుగు చెంత 'ఆ' యని నోరుంచి
క్షీర మాను నందశిశువు వదన
బింబ రుచుల గాంచి బిడియమ్ముతో దాగె
మబ్బు వెనుక చందమామ గనుడు!

చేత కొంత వెన్న, మూతిని మరి కొంత,
మెడను పులి నఖమ్ము మెరయుచుండ
బెట్టు సేయు ముద్దు బెట్ట రావే యన్న,
చుట్టు ముంగమూతి సున్న వోలె!

పల్లె లోని పడుచు పిల్లల చూపులు
చిన్ని కృష్ణు పైనె యున్న వంచు
దృష్టి తీసివైచు దినదినమ్ము యశోద
వన్నె తగ్గకుండ వెన్న దొంగ!

రారా! నందకుమారా!
రారా! నవనీత చోర! రార! మురారీ!
రారా! నగధర! నాకీ
వేరా! శరణంటి పదము లిమ్ముగ కృష్ణా!

Sunday, September 1, 2013

ప్రాభాత సంధ్య



గుడి గంట మేల్కొల్పు, కోడి కూతల పిల్పు
.......... లెండు లెండని ప్రజన్ లేపు వేళ!
మలయ మారుత వీచి, మంచు బిందువు రోచి
.......... ప్రాభాత సంధ్యను పలుకరింప!
భక్తి రంజని పాట, పక్షి కూనల యాట
.......... నిదుర మత్తును లేపి నిలువరింప!
వెలుగుల యెకిమీడు వేయి చేతుల ఱేడు
.......... చీకటి రాత్రికి సెలవు జెప్ప!

తూర్పు కొండల చూడుడీ తోచె నెఱుపు
దిద్దె నుదుట నుషఃకాంత తిలక మదియె!
కర్మ సాక్షికి నందరు ఘనము గాను
స్వాగతము పల్కి చేయరే వందనములు.