padyam-hrudyam

kavitvam

Saturday, June 25, 2011

నా పూరణ

సమస్య:
అంద వికారమె బ్రతుకున నానంద మిడున్.

అందుకొని కుబ్జ చుబుకము
నందాత్మజు డిట్లు పల్కె నవ్వుచు తరుణీ!
కుందెద వేలా? నీయీ
అంద వికారమె బ్రతుకున నానంద మిడున్.

కంది శంకరయ్య గారి శంకరాభరణం సౌజన్యంతో ..........

చిన్మయ రూపిణీ !


















నీ లలితా ధరమ్మునను నిత్యముఁ బూచెడి నవ్వు పువ్వులన్
మాలిమిఁ స్వీకరించుచును మాటికి దాల్చు నెడంద ప్రీతితో
నీలగళుండు ! భాగ్య మన నీదె గదా భువనైక సుందరీ!
శ్రీ లలితా! భవాని ! శివ! చిన్మయ రూపిణి ! లోక పాలినీ !

Sunday, June 19, 2011

ఋతు సందేశం

చల్ల గాలి తెరలు మెల్లగా వీచును
మల్లె పూల తావి మత్తు గొలుపు
కోయిలమ్మ పాట తీయగా మనసుకు
సంతసమ్ము నిడు "వసంత" వేళ!
***************************
ఎండ మండి పోవు నెఱ్ఱనై సూర్యుండు
గుండె లదర గొట్టు గుబులు హెచ్చు
ఉస్సు రుస్సు రంద్రు నూరూర జనములు
"గ్రీష్మ" తాప మిట్టి రీతి నుండు.
***************************
చిట పటంచు వాన చినుకులు రాలును
ఏడు రంగులీను నింద్ర ధనువు
బీద బిక్కి వార్కి పిడుగు పాటై యొప్పు
"వర్ష" ఋతువు మేలు కర్షకులకు.
***************************
రెల్లు దుబ్బు విరియు తెల్లని పింజలై
నిండు చందమామ నింగి వెలుగు
ప్రకృతి పులకరించు పారవశ్యమ్మున
"శరదృతువు" న పుడమి సంద డించు!
****************************
మంచు బిందు చయము మంచి ముత్యము లట్లు
మెరయు బాల భాను కిరణములకు
చలికి ముసుగు తన్ని సాగెడు వారికి
మంచి సుఖము యీ "హిమంత" మందు!
*****************************
ఆకు రాల్చి చెట్లు ఆశతో చూచును
క్రొత్త చివురు తొడుగు కోర్కె తోడ
రేపు మంచి దంచు రేపుచు నాశల
వశము చేసి కొనును "శిశిర" ఋతువు!
*****************************
కాల దివ్య చక్ర గంభీర గమనాన
చీకటైన వెనుక చిందు వెలుగు
కష్ట సుఖము లిట్లె గమియించు బ్రదుకున
ఎరుక సేయు "ఋతువు" లిట్టి నిజము.

(ది. 8-6-1996 న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన నా కవిత)






re

Friday, June 17, 2011

చిన్మయ రూపిణీ !













దున్మితి వీవు దానవుని దుష్టుని యమ్మహిషున్ క్షణంబునన్!
దున్మితి వీవు లీలగను ధూర్తుని దైత్యుని రక్తబీజునిన్!
దున్మవదేల మద్ధృదిని దోచెడి పాపపు టూహ సోకులన్?
చిన్మయ రూపిణీ! నిను భజించెడి భాగ్యము నిమ్ము సర్వదా!

Friday, June 10, 2011

చిన్మయ రూపిణీ !




















ఎన్మిది దిక్కులన్ గలుగు నెన్బది కోటుల జీవ రాశులన్
మున్మమ కార మేర్పడగ మోదముతోడ సృజించినావు, నీ-
పెన్మిటి గూడి చూచెదవు వేడ్కను ప్రాణుల పిల్ల చేష్టలన్
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

Friday, June 3, 2011

చిన్మయ రూపిణీ !




















నిన్మది నెంచుచున్ నలువ, నీరజనాభుడు, నీలకంఠుడున్
షణ్ముఖ వాసవాది సుర సత్తములే కొనియాడు చుండగా
తన్మయులౌచు! నీ పరమ తత్త్వ మెరుంగగ నాకు సాధ్యమే ?
చిన్మయ రూపిణీ ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!