padyam-hrudyam

kavitvam

Tuesday, March 28, 2017



మిత్రులకు, పెద్దలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

*************

హేవిళంబి వైన హేమలంబివి నైన
భూమి జనుల కెల్ల ప్రేమ తోడ
క్షామ మీయబోకు మామంచి దానవు
క్షేమ మీయ రమ్ము చేతు నతులు.

దుర్ముఖ సమ్ముఖమ్మునను దుఃఖము సేమము చెట్టపట్టలై
మర్మ మదేమొ కాని కడు మాన్యత నొందెను, హేవిళంబిలో
ఘర్మము నోడ్చుచున్ మనకు కమ్మని తిండిని బెట్టు రైతుకున్
కర్మము కాలనీకు మని కాలమురూపగు నీశు వేడెదన్.


నూతన వత్సరం బది వినూతన శోభల వచ్చుచుండె నా
రాతలు మార్చునంచు పటు భ్రాంతిని పొందుట పాడిగాని, దా
ధాత లిఖించు వ్రాత లవి తప్పని వెన్నడు జీవితమ్మునన్
ప్రీతిని శోకసౌఖ్యముల భీతిని జెందక యొప్పు టొప్పగున్.

Sunday, March 26, 2017

వసంతు డొచ్చేసాడు



తలుపు నెవ్వరో తట్టిన యలికి డాయె
తెరచి చూచితి పిల్ల తెమ్మెర యొకండు
చల్లగా నన్ను తాకిన దుల్ల మలర
మలయ మారుత వీచివా మంచి దంటి.

గడప దాటితి వాకిట నడుగు బెట్ట
సన్నగా నెవ్వరో నవ్వుచున్న సడులు
గుబురు పొదవంక జూచితి గుట్టు నెరుగ
మల్లె మొగ్గల నవ్వులు తెల్లగాను!

తోచె నల్లంత దూరాన రోచు లేవొ
లేత యెర్రని డవులుతో లీలగాను
తలను పైకెత్త సిగ్గు దొంతరలు క్రమ్మ
నెర్ర బారిన చివురుల నెలమి మావి!

ఇంతలో గుప్పుమని తాకె నింపుగాను
నాసికను కాస్త వగరౌ  సువాసన  యది
కొమ్మ రెమ్మల తెలి మంచు క్రమ్మి నట్లు
విరగ బూసిన యొయ్యారి వేప మొక్క.

ఉల్ల మానంద డోలిక నూయ లూగ
నెవ్వరో నన్ను కోయని యింపుగాను
పిలువ పరికించి చూచితి నలు దెసలను
మావి కొమ్మల కోయిల మాటు వేసె.

హృదయ మానంద కెరటాల నెగసి పడగ
కంటి దిక్కుల  క్రొంగ్రొత్త కాంతి ఝరులు
పలు సువర్ణాల మేలిమి పట్టు చీర
ప్రకృతి పడతుక ధరియించి పరవశించె.

ఏమిటి విశేష మెల్లెడ నీ దినాన
నింత హాయియు నానంద మినుమడించె
నోహొ తెలిసిన దీ సుముహూర్త వేళ
వచ్చె వాసంతు డల్లదే వసుధ వైపు.

మలయమారుతవీచియు మల్లె మావి
వేము కోయిల క్రొవ్విరుల్ వెడలె నెదురు
స్వాగతమ్మని పిలువ వాసంత సఖుని
నేను నెదురేగి రమ్మందు నిపుడె వత్తు.

Wednesday, March 8, 2017

ఆమెకు వందనములు.

పసిపాప లాకలై వసివాడు వేళలో
......మాతృమూర్తిగ మారు మహితశక్తి!
అనురాగమును పంచ నపురూప బంధాన
......సోదరిగా దిగు శుద్ధశక్తి!
ధర్మార్థకామాల కర్మల సగమౌచు
......బ్రతుకును పండించు ప్రబలశక్తి!
తనయయై తలిదండ్రులను రాగబంధాన
......కనిపెట్టుకొని సదా తనుపుశక్తి!

అత్త వదిన మామ్మ అమ్మమ్మ మేనత్త
పిన్ని దొడ్డ సఖియ ప్రియము గూర్చు
నీదు రూపములని నేనెంతు  శ్రీమాత!
ఈవె నరున కెన్న నేడుగడవు.

పిల్లవాం డ్రాకటిన్ తల్లడిల్లెడు వేళ
......కడుపును నింపెడు కన్నతల్లి
అన్న రారా యంచు నాప్యాయతను బంచు
......తోడబుట్టిన ప్రేమగూడు చెల్లి
కష్టసుఖాలలో కడదాక తోడుండి
......బ్రతుకును పండించు వల్లభ చెలి
ముద్దుల బిడ్డయై మురిపాల నందించి
......కన్నతీపిని పంచు కల్పవల్లి

తల్లి చెల్లియు చెలియయు పిల్ల లందు
నెవ్వరైనను లేకున్న నేది శోభ
యిలను మగవాని కెన్నగా నింతి లేక
బ్రతుకు వ్యర్థమ్ము జోహారు పడతి! నీకు.