padyam-hrudyam

kavitvam

Tuesday, March 24, 2020

క్షమించు శార్వరీ

ఉ. శార్వర మాయె మా బ్రతుకు సర్వము సూక్ష్మ కరోన నామయౌ
పుర్వుకు జిక్కి జీవితపు పోరున నెట్టులు గెల్తుమో మహా
పర్వమె నీదు రాక మరి బాధల నుంటిమి స్వాగత మ్మిడన్
శార్వరి! రాదు మా మనము క్షాంతిని మమ్ముల జూడుమా కృపన్.

Friday, March 13, 2020

అలిగిన గౌరి - బుజ్జగించే భవుడు



అలిగిన గౌరీ దేవిని బుజ్జగిస్తున్న అభవుడు:
ఉ. మానిని! యేలనీ బిగువు మానవె యల్కలు మాననీయ! ద్వా
రానికి నడ్డు వచ్చె నొక రాక్షసు డంచని యెంచి త్రుంచితిన్
వానిని, నీదు బిడ్డ డను వైనము నేరక, తత్క్షణంబె సూ
ప్రాణము నిత్తు 'భద్ర'మగు బట్టికి జింతను వీడి నవ్వవో.
కాదందువా....
ఉ. గంగను దాల్చినా ననుచు కాంత యలింగితి వేమి? చాలు, లే
మంగళగౌరి! కేశములు మాత్రమె దక్కిన వామె, కేల నీ
బెంగ? మదర్థ దేహమును బ్రేమను జిత్తము నెన్న నన్నె నీ
కొంగునె గట్టుకొన్న కడు కొంటె పడంతుక వీవు కాదొకో.

Tuesday, March 10, 2020

హోళీ కేళి



ఉ.
అంబను గూడి హోళి యనియా ఘన సంబర ముప్పతిల్ల వ
ర్ణంబుల జాలులం దవిలి నాట్య మొనర్చుచు నుంటి హాయిగా
త్ర్యంబక! యేమి న్యాయ మిది ధారుణి మానవజాతి ఘోర రో
గంబున జిక్కి శల్య మయి గాసిలి బొందుచు నుండ జూడవా!