padyam-hrudyam

kavitvam

Thursday, February 24, 2011

రామ తారక శతకము 4

16 . నిన్నాశ్రయించితి నీవాడ నని యంటి - పాహిమాం కోదండ పాణి యంటి
రఘుకుల దీపక రక్షించు మని యంటి - కరుణ సాగర నన్ను గావుమంటి
దైవము నీవని దిక్కు నీవని యంటి - దుష్కృత కర్మముల్ ద్రుంచు మంటి
అఖిల లోకారాధ్య యభయ మిమ్మని యంటి - నీప్సితార్థము లిప్పు డియ్యమంటి

అడుగ నింతైన నితరుల నమర వంద్య - పరుల యాచింప నాకేల పరమ పురుష
దాతలకు నెల్ల దాతవు దైవ రాయ - రామ! తారక! దశరథ రాజ తనయ!

17 . ఎచ్చోట హరికథ లచ్చోట సిద్ధించు - గంగాది తీర్థముల్ గన్న ఫలము
లెచ్చోట సత్యంబు నచ్చోట నిత్యంబు - లక్ష్మీ సరస్వతు లమరి యుందు
రెచ్చోట ధర్మంబు నచ్చోట దైవంబు - జయము లెల్లప్పుడు జరుగు చుండు
ఎచ్చోట భక్తుండు నచ్చోట హరియుండు - నిధుల ఫలంబిచ్చు నింట నుండు

నీదు భక్తుల గుణములు నిర్ణయింప - ఫలము భాగ్యము లింతని ప్రస్తుతింప
వశమె ఎవ్వరికైనను వసుధ లోన - రామ! తారక! దశరథ రాజ తనయ!

18 . పదివేల గోవుల ప్రతి దినం బొసగిన - పంచ భక్ష్యాన్నముల్ పరగ నిడిన
గ్రహణ పర్వములందు గజ దాన మొసగిన - నశ్వ దానంబులు నమిత మైన
పెక్కు యాగంబులు ప్రేమతో జేసిన - యితర ధర్మంబులు నెన్ని యైన
...................................................................................................

తుల్య మగు నట్టి మీ నామ స్తుత్య మునకు - హస్తి మశ కాంతరము సాటి యౌను గాక
యింత ఫలమని వర్ణింప నెవ్వడోపు - రామ! తారక! దశరథ రాజ తనయ!

19 . నా పాలి దైవమా నా మనంబున నిన్ను - దలచి సేవించెద తండ్రి వనుచు
నా మూలధనమని నమ్మియుప్పొంగుచు - దండ మర్పించెద దాత వనుచు
నా తోడు నీవని నవ్వుచు గేరుచు - రంజిల్లు చుండెద రాజు వనుచు
నాకును గురుడవై నా తప్పులెన్నక - కాచి రక్షించును కర్త వనుచు

పెంచి పోషించి కాపాడ పెద్ద వనుచు - పుత్ర వాత్సల్య తండ్రికి పుట్టి నట్లు
కృపకు పాత్రునిగా జేసుకొనుము దేవ - రామ! తారక! దశరథ రాజ తనయ!

20 . బహు జన్మముల నెత్తి బాధ నొందగ నేల - పరమ పురుషుని గొల్చి బ్రతుక వలయు
శేష వాసనలచే చిక్కి వగవగ నేల - శ్రీ నివాసుని పూజ సేయవలయు
విషయ భోగంబుల విర్ర వీగగ నేల - విష్ణు చరిత్రంబు వినగ వలయు
అస్మదాదుల కొరకు యనృత మాడగ నేల - హరి నామ కీర్తన లాడ వలయు

తనువు తథ్యంబు గాదని తత్త్వ విదులు - సంతత ధ్యానులై మిమ్ము సంస్మరించి
నిన్ను సేవింపు చుందురు నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: