padyam-hrudyam

kavitvam

Tuesday, February 22, 2011

రామ తారక శతకము 2

6 . నీ నామమే కదా నిఖిల శాస్త్రము లెన్న - పరలోక ప్రాప్తికి ప్రాభవంబు!
నీ నామమే కదా నిఖిల జీవుల కెల్ల - నఖిల వైభవముల కాలయంబు!
నీ నామమే కదా నిర్మలాత్ముల జేయ - నౌను జీవుల కెల్ల నౌషధంబు!
నీ నామమే కదా నిచ్చలు భక్తుల - కార్య సిద్ధికి నాది కారణంబు!

దునిమి భేదించు దారిద్ర్య దు:ఖమెల్ల - వాసి కెక్కించు సంసార వార్ధి గడుపు!
శాశ్వతంబైన పదవిచ్చు జగతియందు - రామ! తారక! దశరథ రాజ తనయ!

7 . హరి రామ నీవు నా యంత రంగమునందు - సాక్షివై యుండుట సత్యమైన
పావనంబాయెను పాంచ భౌతిక మైన - కాయంబు జలముల గడుగ నేల ?
మమకారముడిగిన మానును కర్మంబు - వేధించు వేల్పుల వెరువ నేల?
విత్తు క్షీణంబైన వీడును కర్మంబు - మోహంబు లుడిగితే మోక్ష మిదియె.

నిష్ఠ యీ రీతి నిజముగా నిలచె నేని - మనసు దృఢమైన చాలదా మాయ గెల్వ?
భ్రాంతు లుడిగిన బ్రహ్మంబు బట్ట బయలు - రామ! తారక! దశరథ రాజ తనయ!

8 . కామితార్థము లిచ్చు కామ ధేనువు గల్గ - వెల బెట్టి గోవుల వెదుక నేల?
మరణంబు లేకుండ మందు గల్గుండగా - సభయులై యమునికి జడియ నేల?
కల్యాణ మొసగెడి కల్ప వృక్షము గల్గ - వన పుష్ప ఫలముల వాంఛ యేల?
అమరుల కబ్బని యమృతంబు సేవించి - మధు రసంబుల మీద మమత లేల?

తార తమ్యంబు లీ రీతి తథ్య మనుచు - భజన సేతురు మిమ్ముల బ్రహ్మ విదులు
నతులు చేయుదు రెప్పుడు నుతుల తోడ - రామ! తారక! దశరథ రాజ తనయ!

9 . భూపతి యై పుట్టి భూమి నేలగ వచ్చు - శత్రు సంహారమ్ము జేయ వచ్చు,
చౌ షష్టి విద్యల చదివి చెప్పగా వచ్చు - బహు మంత్ర సిద్ధుల బడయ వచ్చు,
కోటికి పడగెత్తి కొల్ల బుచ్చగ వచ్చు - సకల మంత్రంబుల చదువ వచ్చు,
గంగాది నదులకు గ్రక్కున బోవచ్చు - నుత్తమా శ్రమముల కరుగ వచ్చు!

మగుడ జన్మంబు రాకుండ మాయ గెలుచు - విద్య సాధించి శత్రుల విరచి కట్టి
యరసి బ్రహ్మంబు గనుగొడు డంతె చాలు - రామ! తారక! దశరథ రాజ తనయ!

10 .సతమని దేహంబు సంతసిల్లగ నేల - నిలుచునా యిది వట్టి నీటి బుగ్గ!
కాయంబు నిలువదు కడు బ్రహ్మ కైనను - ప్రాణంబు నిలుచునా భ్రాంతి గాక?
విభవంబు జూడకు విస్మయంబొందకు - సంపద లెప్పుడు సతము గాదు!
పరుల నా వారని పాటింప జెల్లదు - వెళ్ళంగ తన వారు వెంట రారు.

అనుచు తలపోసి బుధులెల్ల యాస లుడిగి - మోహ జాలంబులో బడి మోస పోక
నిన్ను సేవింపు చుందురు నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: