padyam-hrudyam

kavitvam

Friday, February 25, 2011

రామ తారక శతకము 5

21 . ఈప్సితార్థములిచ్చి యిహమందు రక్షించి - పరమందు మీ సేవ ప్రాప్తి జేసి
అగణితంబైన నీ ఆశ్రయస్తుల లోన - గణుతించి గ్రక్కున గార వించి
భక్తుని కృప జేసి పరిపూర్ణ ముగనుంచి - నిజముగా దాసుల నిర్వహించి
ప్రియముతో పిలిచితే ప్రేమతో పొడసూపి - యభయ హస్తము నిచ్చి యాదరించి

ఒరుల యాచించి సేవింప నోర్వ లేక - వెదకి కనుగొంటి నా పాలి వేల్పువనుచు
మగుడ జన్మంబు లేకుండ మందు గోరి - రామ! తారక! దశరథ రాజ తనయ!

22 . మూఢుల రక్షించి మోక్ష మిచ్చుట కీర్తి - ద్రోహుల గాచుట దొడ్డ కీర్తి
పాప కర్ముల కెల్ల పదమిచ్చుటది కీర్తి - ఆత్మ సంరక్షణ యమిత కీర్తి
నీ వాడ నని యంటె నిర్వహించుట కీర్తి - ప్రేమ దీనుల బ్రోవ పెద్ద కీర్తి
సామాన్య జీవుల సంతరించుట కీర్తి - మునుల రక్షించుట ఘనత కీర్తి

పెద్దలైనట్టి సంసార పామరులకు - సరస సాయుజ్య పదమిచ్చు టంతె గాక
యనుచు సేవింతు రీరీతి నను దినంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

23 . జంతు జాలమునందు జన్మించి కొన్నాళ్ళు - యితర జన్మమ్బులు ఎత్తి ఎత్తి
మానవ దేహంబు మరిమరి ఎత్తుచు - నన్ని వర్ణంబుల నరసి చూచి
ఏ పుణ్య వశమునో యీ జన్మ మెత్తితి - విప్ర దేహమ్బిపుడు విమల చరిత!
ఈ జన్మమందైన నిపుడు నీ సేవను - మానక జేసెద మౌని వంద్య!

వేద శాస్త్రములన్నియు వెదకి జూచి - తప్పు గాకుండ నడువ నా తరము కాదు
శరణు జొచ్చితి నిక నాకు శంక ఏమి - రామ! తారక! దశరథ రాజ తనయ!

24 . దశరథాత్మజ నీకు దండంబు దండంబు - వైదేహ పతి నీకు వందనంబు
కౌసల్య సుత నీకు కల్గు కల్యాణంబు - జానకీ పతి నీకు జయము జయము
అమరవందిత నీకు నాయు రారోగ్యముల్ - శర ధనుర్వర్థ నీ శరణు శరణు
నీల మేఘ శ్యామ నీకు సాష్టాంగంబు - సుర రాజ పూజిత శుభము శుభము

అనుచు వర్ణించి భజియించి యాత్మ దలచి - నిలిచి సన్మార్గ వంతుడు నిన్నెరుంగు
నతని కను గొన్న ఫల మెన్న నా వశం బె - రామ! తారక! దశరథ రాజ తనయ!

25 . భాను వంశము నందు ప్రభుడవై జన్మించి - యఖిల విద్యల నెల్ల నభ్యసించి
తాటకి మర్దించి తపసి యాగము గాచి - శిలకు శాపము బాపి స్త్రీని జేసి
శివుని చాపము ద్రుంచి సీతను పెండ్లాడి - పరశు రాముని త్రాణ భంగ పరచి
తండ్రి వాక్యము గొరకు తమ్ముని తో గూడి - వైదేహి తోడను వనము కేగి
ఖర దూష ణాదుల ఖండించి రాక్షస - మారీచ మృగమును మడియ జేసి
లంకకు రాజైన రావణాసురుడు నీ - సతిని గొని పోవంగ సంభ్ర ముడిగి
సుగ్రీవు గనుగొని సుముఖు డైయప్పుడు - వాలిని వధియించి వరుస తోడ
రాజ్య మాతనికిచ్చి రాజుగా చేపట్టి - కిష్కింధ నేలించి కీర్తి వడసి

వాయు సుతు జేత జానకీ వార్త దెలిసి - తరలి సేతువు బంధించి త్వరను దాటి
రావణానుజు కభయంబు రయము నొసగి - ఘోర రణమందు రావణు గూల నేసి
యతని తమ్ముని రాజుగా నమర జేసి - సతిని చేకొని సురలెల్ల సన్నుతింప
రాజ్య మేలిత యోధ్యకు రాజు వగుచు - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: