padyam-hrudyam

kavitvam

Wednesday, February 23, 2011

రామ తారక శతకము 3

11. ఆవేళ యమునిచే నాపద బడలేక - జడిసి యిపుడే మిమ్ము తలచు కొంటి
నపరాధి నపరాధి నపరాధి నని మ్రొక్కి - యాశ్ర యించితి మిమ్ము నప్రమేయ!
శరణన్న మాత్రాన శంకలన్నియు మాని - భయ నివారణ మాయె భజన చేత!
ఇంత సులభుడవంచు నెరిగితే యిన్నాళ్ళు - యేమరి యుందునా యెరుగ నైతి

తెలిసె మీ కృప నాకెల్ల తేట పడను - మర్మ మెరిగితి నీ కీర్తి మహిమ వింటి
గట్టు దాటితి నీవె నా గతివి యంటి - రామ! తారక! దశరథ రాజ తనయ!

12 . వరము దప్పక ధర్మ వర్తన వర్తించి - వేదోక్త కర్మముల్ వెదకి జూచి
శిష్ట శీలుర యొక్క శిష్యత్వమును జేసి - సత్వ ప్రధానంబు సంగ్రహించి
సాంద్ర దయా గురు స్వామిని మదినుంచి - హరి జేరు మార్గంబు నరయ నడిగి
వారిచే బడసిన వర మంత్ర రాజంబు - పరి చిత్తుడను గాక పఠన జేసి

మరచి కామ్యము గోరక మర్మ మెల్ల - హరికి నర్పించి నట్టి యా యధిక పుణ్య
మరసి రక్షించు మదియెల్ల నంతె గాక - రామ! తారక! దశరథ రాజ తనయ!

13 . హరి నామ కీర్తన లానాడె జేసితే - వేదన త్రయము నన్ వీడి యుండు
నీక్షించి మదిలోన యిన కులోత్తమ యన్న - నీషణ త్రయములు నీడ్వ కుండు
దశరధాత్మజు గూర్చి ధ్యానంబు జేసితే - దారిద్ర్య దోషంబు తొలగి యుండు
జానకీ పతి మంత్ర జపమును జేసితే - జన్మ కర్మంబులు జారి యుండు

భక్తి పుష్పంబు పక్వమై పండు గాక - అమిత శాలంబు లిన్నాళ్ళు హరణ మాయె
పాతకుడ నన్ను రక్షించు పరమ పురుష - రామ! తారక! దశరథ రాజ తనయ!

14 . మరిమరి జిహ్వకు మాధుర్య మై యుండు - మనసు మీ స్మరణను మరగి యుండు
వీనులు మీ కథ విన వేడ్కలై యుండు - చూడ్కులు మీ రూపు జూచు చుండు
బుద్ధి మీ తత్వము పొంద గోరు చునుండు - పూజింప హస్తముల్ పొంగు చుండు
కామ్యంబు మోక్షంబు కాంక్ష జేయుచు నుండు - భక్తి యీ రీతిని ప్రబలు చుండు

ఇతర నామంబు పలుకను యింపు గాదు - సతతము న్నీదు నామంబు సంస్తుతింప
హర్ష మానంద మగుచుండు నను దినంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

15 . నీ ప్రభావంబులు నిగమంబులే కాని - పలికి వర్తింప నా బ్రహ్మ వశమె
నీ నామ మధు రుచి నీల కంఠుడె గాని - వేయి కన్నులు గల వేల్పు వశమె
నీ పాద నఖముచే నిర్భిన్న మైనట్టి - బ్రహ్మాండ కటహ మెవ్వరుల వశమె
నీ కీర్తి గొనియాడ నిశ్చలు రైనట్టి - నారదాదులె గాని నరుల వశమె

ఎన్న జాలని తారల నెన్న వచ్చు - జలధి కణముల గణుతించి చెప్పవచ్చు
పరమ తారక మంత్రంబు పలుక వశమె - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: