padyam-hrudyam

kavitvam

Sunday, February 20, 2011

పాలకొల్లు గోపురం

రెండ్రోజుల క్రితం మా బంధువులింట్లో శుభ కార్యముంటే పాలకొల్లు వెళ్ళాం.
పాల కొల్లు పేరున్న శైవ క్షేత్రం. అక్కడి క్షీరారామ లింగేశ్వరస్వామి గొప్ప మహత్తు గల దేవుడు.
క్షీరారామం పంచారామాల్లో ఒకటి.
పాలకొల్లు శివాలయం గాలిగోపురం చాలా ఎత్తుగా రమ్యమైన శిల్పకళతో శోభిస్తూ ఉంటుంది.
ఒకప్పుడు దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దదైన గోపురంగా పాలకొల్లు గోపురం ప్రసిద్ధి చెందిందని అంటారు.

మా నాన్నగారు నా చిన్నప్పుడు ఈ పాలకొల్లు గోపురం గురించి ఒక చమత్కారం చెప్తూండేవారు.

వారి చిన్నప్పుడు గోదావరి జిల్లాల్లో ఒక వస్తాదు ఉండేవాడట. మంచి కండ బలంతో దేహ దారుఢ్యంతో గొప్ప
గొప్ప విన్యాసాలు చేసి అందర్నీ ఆశ్చర్య పరచే వాడట.

ఒకసారి అతను తన గ్రామస్తులతో ' నేను పాలకొల్లు గోపురం మోసెయ్యగలను, ఒక్క ఆరు నెలలు నాకు మంచి
పుష్టికరమైన, బలమైన ఆహారాన్ని పెట్టే ఏర్పాటు చేస్తే' అని పందెం కాసేడట. అందరూ నువ్వు యెంత వస్తాదువైనా
పాలకొల్లు గోపురం మొయ్యడం నీవల్ల అయ్యే పనికాదు, పందెం వద్దు అన్నారట.

అతను కాదని పందెం కుదుర్చు కొన్నాడట.

ఆరు నెలలు అతన్ని బాగా మేపడానికి, అతను గోపురాన్ని మొయ్యడానికీ. అతను ఆ పని చెయ్య లేక
పోతే అతన్ని మేపడానికయిన ఖర్చును అతను తిరిగి గ్రామస్తులకు ఇచ్చెయ్యాలి. అదీ పందెం.
అతనా విన్యాసాన్ని మహాశివ రాత్రి నాడు చెయ్యాలి.

ఆరు నెలలు గడచి పోయాయి. ఈ ఆరు నెలలూ అతన్ని మా బాగా మేపారు.
శివరాత్రి రానే వచ్చింది.

బోలెడు జనం. మన వస్తాదు పాలకొల్లు గోపురాన్ని మొయ్యాలి.
సాయంత్రం 4 గంటలయ్యింది.

పాలకొల్లు శివరాత్రి భక్తజనం తో కిటకిట లాడిపోతోంది.
అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. నిజంగా మనవస్తాదు అన్నంత పనీ చేస్తాడా లేక తోక ముడిచేస్తాడా అని.

సరే వస్తాదు గుడి దగ్గరికి వచ్చాడు. బయటనుంచి దేవుడుకి నమస్కరించాడు.
లోపలికి వెళ్లి క్షీర లింగేశ్వరుని దర్శనం చేసుకొన్నాడు.
బయటికి వచ్చి నంది శృంగాల మధ్యనుంచి మళ్ళా శివ దర్శనం చేసుకొన్నాడు.

ఒక నిముషం ఆలయం ఆవరణలో కూర్చున్నాడు. బయటికి వచ్చాడు.
గోపురం ముందు నిలబడ్డాడు. తలెత్తి గోపురం శిఖరం వంక చూశాడు.

అబ్బా అని నోటితో ముఖంతో ఒకసారి హావభావ ప్రదర్శన చేసాడు.

గోపురాన్ని మోయగలిగి తన మాట నిలబెట్టుకొనేలా శక్తి ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థించాడు.

నలుదిక్కులా అందరి వంకా చూశాడు. అభివాదం చేశాడు.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

అంతే ఒక్కసారిగా 'హరహరా' అంటూ గోపురం ముందు వంగున్నాడు.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అంతా నిశ్శబ్దం.

మన వస్తాదు ' ఊ! పెట్టండి!' అన్నాడు.

ఎవరికీ అర్థం కాలేదు.

మళ్ళా అన్నాడు. 'ఊ! పెట్టండి!'

ఎవరికీ అర్థం అవలేదు. అందరూ ఆశ్చర్య పోయారు.

గోపురాన్ని మోయ్యకుండా ఏమిటో పెట్టమంటాడేమిటి???????????

ఇక ఆగలేక ఒక పెద్దమనిషి అడిగాడు.

'ఏమిటయ్యా పెట్టండి అంటావు? గోపురం మోస్తానన్నవుగా? మొయ్యి.'

వస్తాదు: 'అదేనండీ! నేను సిద్ధం.'

పెద్దమనిషి : 'మరి మొయ్యవయ్యా'

వస్తాదు: 'భలే వారండీ. మీరెవరూ గోపురాన్ని ఎత్తి నా వీపు మీద పెట్టందే నేనెలా మోసేదండీ?
అలా చూస్తారేమిటండీ? గోపురాన్ని నా వీపు మీద పెట్టండి. మోస్తాను.'

!!!!!!!!!!!!!!!!!

No comments: