padyam-hrudyam

kavitvam

Friday, February 11, 2011

ఒక మంచి పద్యం



కీ.శే. దినవహి సత్యనారాయణ గారు,
కీ.శే. దినవహి భాస్కరమ్మ గారు.



ఒక మంచి పద్యం
*************************************************************
కీ.శే. దినవహి సత్యనారాయణ గారు గొప్ప కవి. తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ప్రవీణులు. గోస్వామి తులసీదాసు హిందీలో రచించిన 'శ్రీ రామ చరిత మానసం ' తెలుగులోకి అనువదించారు. ఆ గ్రంథం బహుళ ప్రజాదరణ పొందింది.
అదే కాకుండా మరి కొన్ని పుస్తకాలను కూడా ఆయన వ్రాశారు. హిందీ, తెలుగు, ఆంగ్ల వ్యాకర ణాల్లో మంచి దిట్ట. 'విద్యా భాస్కర' బిరుదాంకితులు.

శ్రీ సత్యనారాయణ గారు మంచి వక్త. మృదు స్వభావి. దయార్ద్ర హృదయులు.
అయన రాజమహేంద్రవరంలో ఉండేవారు.

ఆయనను మా వయసు వాళ్ళందరం (1970 లలో) తాతగారూ అని ప్రేమతో పిలిచే వాళ్ళం.
ఆయన కూడా అంతే ప్రేమతో మమ్మల్ని చేరదీసేవారు. మాకు వ్యాకరణ పాఠాలను చెప్పేవారు.
తాతగారు ఎప్పుడూ రామనామాన్నే స్మరిస్తూ ఉండేవారు.

అంతిమ క్షణాల్లో ' రామా రామా' అంటూ ఆ పరంధామునిలో ఐక్యమైన ధన్యజీవి ఆయన.

ఆయన ఒక సందర్భంలో మానవ జీవితాన్ని చలన చిత్రం తోనూ, చలన చిత్రాన్ని తెరపై చూపే యంత్రంతోనూ (projector) పోలుస్తూ మంచి పద్యాన్ని చెప్పారు.

ఎవ్వరి కెవ్వరీ భువిని ఈశ్వరు డద్భుత కాలచక్రమున్
రివ్వున ద్రిప్పుచుండ పలురీతుల జీవపు వెల్గునన్ మహిన్
నవ్వుచు కేరియాడుచును నాదిగ భావన చేయుచుందు మా
దివ్వెయడంగ నన్నియును ద్రెళ్ళెడు వైద్యుతయంత్ర పుత్రికల్!


సినిమా ప్రొజెక్టర్లో తిరిగే చక్రం, వెలిగే బల్బూ, అది పని జేయడానికి విద్యుత్తూ, ఆ బొమ్మలను చూపే తెరా ఉంటాయి కదా. అలాగే మహి అంటే భూమి అనేది తెర. ఈశ్వరుడు నడిపే ప్రొజెక్టర్లో చక్రం కాల చక్రం. బల్బు జీవపు దివ్వె. ఆడే బొమ్మలు మనం. విద్యుత్తున్నంత సేపూ తెర మీద బొమ్మలు ఆడినట్లు మనం ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత సేపూ రకరకాల లీలలు చూపిస్తూ అంతా నాదే అనుకొంటాము. విద్యుత్తు పొతే తెర మీద బొమ్మలు ఆగిపోయి నట్లు జీవపు దివ్వె ఆరిపోతే మనపని కూడా ఆఖరు. ఎంత అద్భుతమైన భావన!





No comments: