padyam-hrudyam

kavitvam

Saturday, February 26, 2011

రామ తారక శతకము 6

26 . దేహంబు విడచెడు దినము తా నెరుగడు - కర్మంబు వచ్చుట గాన లేడు
మూడవస్థల లోన మునిగి లేవగ లేడు - ఆర్వురు శత్రుల నణచ లేడు
మగువల రతులందు మమత మానగ లేడు - వాడు వీడని పల్కు వదల లేడు
అభిమాన రహితుడై యాస లుడుగగ లేడు - ఇంచుక హరి మాయ నెరుగ లేడు

నరుడు బ్రహ్మంబు తానగుట నరయ లేక - బుద్ధి హీనుల కడ కేగి పొందు జేసి
యుదర భరణంబు గావించు నుర్వి లోన - రామ! తారక! దశరథ తనయ!

27 . నీతి నెరుంగవు నిందకు నోడవు - చంచలం బెప్పుడు చెడ్డ గుణము
వాయు వేగము కంటె వడి గల వాడవై - పారెద వెప్పుడు పడుచు దనము
చేరు వేరొక్కటి జీరుట యొక్కటి - చేరువ కర్మంబు చెప్ప లేవు
పుత్ర మిత్రాదులె పుణ్య లోకంబని - సద్గతి నెరుగవు జడుడ వగుచు

మనసు యీ రీతి వర్తించు మంద మతిని - నరసి నగరంబు కేగుట నయమె నీకు
ముందు తెలియక విహరించి మోస పోక - రామ! తారక! దశరథ తనయ!

28 . యమునిచే బాధల నెట్లోర్చగా వచ్చు - నగ్ని కంబంబున కంట గట్ట
పాపంబు నా నోట పల్కించి యొప్పించు - చిత్రగుప్తుని పిల్చి చెప్పుమనుచు
తప్పక నావారు తప్పులెన్నియొ జెప్ప - నుగ్రుడై దూతల కొప్పగించి
బాధించు వేళ నా బ్రదుకేలనో యని - యార్వగ నెవ్వరు నచట రారు

తెలిసి వర్తించు మిప్పుడే తెలివి గలిగి - అనుదినంబును శ్రీ రాము నాశ్రయించి
మ్రొక్కి సేవించి కనుగొను మోక్ష పదవి - రామ! తారక! దశరథ తనయ!

29 . మరిమరి నాయొక్క మర్మ కర్మంబులు - ప్రఖ్యాతి జేసెద పాప హరణ
ధర శీలుడైనట్టి ధన్వంత్రి దొరికితే - దేహ రోగంబెల్ల దెలిసి నట్లు
గురు శిష్యు డైనట్టి గురువును కనుగొని - ముక్తి మార్గము కొరకు మ్రొక్కినట్లు
రక్షింప దలచిన రాజును గనుగొని - యార్తుడై యన్నంబు నడిగినట్లు

విన్నవించెద నా వార్త విమల చరిత - అగణి తంబైన కలుషంబు లడగ జేసి
నిర్మలాత్మునిగా జేయు నిగమ వేద్య - రామ! తారక! దశరథ తనయ!

30 . ఎన్ని జన్మంబుల నెత్తితి నేనని - తప్పుగా బలుకునా తపసి యొకడు
శత్రుల మిత్రుల సమముగా జూచుచు - శ్రీ హరి నమ్మిన సిద్దు డొకడు
సకలేన్ద్రియంబుల సాధకంబున బట్టి - ముక్తుడై యుండునా మునియు నొకడు
.............................................................................................................

బ్రహ్మ యీ రీతి వాడని పలుక వచ్చు - గాక యితరులు నేర్తురే కనుగొనంగ
సకల వేదాంతముల గల్గు సార మిదియ - రామ! తారక! దశరథ తనయ!

No comments: