padyam-hrudyam

kavitvam

Sunday, February 27, 2011

రామ తారక శతకము 7

31 . జపము దేవార్చన సలపని జన్మంబు - తామసంబున జేయు తపసి తపము
పతిభక్తి లేనట్టి పడతుల వ్రతములు - యజమాని గూర్చని యాగములును
గురుభక్తి లేనట్టి గూఢ మంత్రంబులు - విత్త మార్జించెడి వేదములును
కాసులార్జిన్చెడి కన్యకా దానంబు - ధనము వాటున గొన్న ధర్మములును

ఎంచి చూచిన నవి యేల నేమి ఫలము - ఫలము దెలియంగ నేరక పాటి దప్పి
నరసి నరకంబు కేగుట నయమె నీకు - రామ! తారక! దశరథ రాజ తనయ!

32 . అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక! నీవు - ముచికుందునకు మోక్ష మిచ్చి నావు
ఆకుచేలుని చేతి యటుకుల భక్షించి - ఎడతెగని సంపద లిచ్చినావు
శరణాగత త్రాణ! శబరి తెచ్చిన పండ్లు - అంచితంబుగ నార గించినావు
వేద వేదాంగ! యా విదురుని యన్నంబు - కోరి వేడుకతోడ గుడిచినావు

జానకీ నాథ మీ దాస జనుల యిండ్ల - తులసి దళమైన మీ జిహ్వ తృప్తి నొందు
యచ్యుతానంత ! గోవింద!హరి! ముకుంద! - రామ! తారక! దశరథ రాజ తనయ!

33 . ఆశ్రమ ధర్మ మందాస నొందని వాడు - సత్య మార్గం బెపుడు చనెడు వాడు
శ్రీ రాము నర్చించి సిరియు గోరని వాడు - మమకార బుద్ధిని మాను వాడు
లబ్ధ పదార్థంబు లాభంబు యనువాడు - పరులకు హితముగా బలుకు వాడు
..........................................................................................................

యోగ సంసారికీ గుణ మెంచ వలయు - గాక కడు భక్తి వేషంబు గణన చేయ
వలదు సంసార బద్ధుల వాంఛ గాక - రామ! తారక! దశరథ రాజ తనయ!

34 . విష్ణు ప్రసంగముల్ వలనొప్ప విను వాడు - పులకామ్కురమ్ములు పొడము వాడు
హరి గానగా మది నాస్థ గల్గిన వాడు - సకలోప చారముల్ సల్పు వాడు
అతని కర్పించి తానను భవించెడి వాడు - సుతుని కైవడి నర్థి జూచు వాడు
సాధుల మాన్యుల సౌఖ్య పెట్టెడి వాడు - మదిలోన శ్రీరామ మనెడి వాడు

పుణ్య పురుషుండు భక్తుండు పూజితుండు - ధర్మ మార్గుండు ధన్యుండు ధార్మికుండు
కలడు వేయింటి కొక్కడు కడను లేడు - రామ! తారక! దశరథ రాజ తనయ!

35 . తల్లి దండ్రుల గన్న తాత ముత్తాతలు - తరలి పోయిన వార్త దాను తెలిసి
జీవించు పెక్కండ్రు జీవ కోట్లను జూచి - జనన మరణాదుల జాడలెరిగి
సర్వ కాలము నిల్చు సంపద లుండని - విభవంపు రాజుల వింత జూచి
సారంబు లేనట్టి పాప సంసారమ్ము - యాతనల చేత తానను భవించి

కనియు గానంగ జాలరు కర్మ వశులు - అస్థిరంబెల్ల స్థిరమన కవని బుధులు
సన్నుతింతురు మిమ్మును సంతతంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: