padyam-hrudyam

kavitvam

Saturday, September 30, 2017

దేవీ మహిమన స్తోత్రం - 9




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

శృంగారాది రసాలయం త్రిభువనీ మాల్యై రతుల్యై ర్యుతం
సర్వాంగీణ సదంగరాగ సురభి శ్రీమద్వపు ర్దూపితం
తామ్బూలారుణ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం దధ
త్ఫాలం నందన చందనేన జనని ధ్యాయామి  తే మంగళం.

***

అమ్మా! నీ స్వరూపము శృంగారము మొదలైన నవరసములకు నిలయము.(శృంగార రససంపూర్ణా జయా జాలంధిరస్థితా .... లలితా సహస్రనామం ) అందుకే ఆవిడకు శృంగార నాయిక అని పేరు.  ప్రపంచము అమ్మవారి యొక్క సగుణ స్వరూపము.  ఈ ప్రపంచం లోని అనుభూతులన్నీ అమ్మవారి చైతన్యము యొక్క విభూతులు.  ముల్లోకముల లోని దివ్యమైన పుష్పములతో కూర్చిన మాలను ధరించినది. సర్వాన్గాములును చందనాది సుగంధలేపనములతో కూడినవి.  పరిమళ ధూపితమైనవి . తాంబూలము చేత ఎర్రనైన చిగురు వంటి పెదవులు కలిగియున్నది.(కర్పూర వీటికామోద సమాకర్షి ద్దిగంతరా...లలితా సహస్రం,   కర్పూర వీటీ సౌలభ్య కల్లోలిత కకుప్తటా....త్రిశతి).   ఎర్రని తల్లి, ఎర్రని పెదవులు, తాంబూలంతో మరింత ఎర్రనైనవి. రమ్యమైన త్రిపుండ్రములను ధరించిన ఫాలభాగము ప్రకాశిస్తున్నది. (భస్మరేఖామ్కిత లసన్మస్తకాయై నమః ...లలితా అష్టోత్తరం).  మరియు చందనాది పూతలతో ఆ నుదురు ప్రకాశిస్తున్నది.  అట్టి నీ దివ్య మంగళ స్వరూపమును ధ్యానించు చున్నాను.

***

శృంగార ప్రభృతమై చెన్నొందు రసముల
....కాలయమై నట్టి యద్భుతమ్ము
ముల్లోకములలోని ముఖ్యపుష్పమ్ముల
.....మాలతో సుందరమండితమ్ము
భవ్యాంగ సర్వమ్ము దివ్యాంగరాగమై
.....పరిమళ ధూపిత ప్రకటితమ్ము
కర్పూరవీటికా కలితారుణమ్మైన
.....పల్లవాధరయుత పరవశమ్ము

రమ్య భస్మ త్రిపుండ్ర సంరాజితమ్ము
నగరులేపితమౌ తిలకాశ్రయమ్ము
నిట్లు మంగళాకారమై యెసగు జనని
నిన్ను ధ్యానింతు నిరతమ్ము నేను మదిని.


No comments: