శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ :
***
శింజన్నూపుర పాదకంకణమహా ముద్రాసు లాక్షారసా
లంకారాన్కితమంఘ్రిపంకజ యుగం శ్రీ పాదుకా లంకృతం
ఉద్భాస్వన్నఖచంద్ర ఖండ రుచిరం రాజజ్జపా సన్నిభం
బ్రహ్మాది త్రిదశా సురార్చిత మిదం మూర్ధ్ని స్మరామ్యంబికే.
ఓ తల్లీ! ధ్వనిస్తున్న నూపురములను కడియాలను ధరించి, వివిధవర్ణములతో ముద్రలు తీర్చిదిద్దబడియుండి, లత్తుకరసముతో పారాణి పెట్టబడి యుండి, శ్రీపాదుకలను (చింతామణి పాదుకలను) ధరించియుండి, నెలవంక ముక్కల వలె మనోహరంగా ప్రకాశించుచున్న గోళ్ళను కలిగియుండి, జపా కుసుమముల వలె ఎర్రగా వెలుగొందుతూ, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల చేతను దేవేంద్రాది సురల చేతను పూజింపబడు చున్న నీ పాదపద్మముల జంటను నా శిరస్సు మీద ధ్యానించుచున్నాను.
***
ఘలుఘల్లు మని మ్రోయు గజ్జెలు కంకణాల్
.....గొప్పవౌ ముద్రల నొప్పు చుండి
లత్తుక రసముతో నొత్తుగ పారాణి
.....భాసింప దాల్చి శ్రీ పాదుకలను
నెలవంక ముక్కలై నెలకొనె నను రీతి
.....నఖము లుద్దీపింప నవ్యమైన
దాసాని పూవుల దత్తుగ నెఱ్ఱనై
.....వెలుగొందుచుండి శ్రీ విభవ మలర
బ్రహ్మవిష్ణుమహేశ్వరుల్ ప్రణతి సేయ
భక్తితో చెంగట న్నిల్చు వాసవాది
సురల పూజల గొనుచున్న చరణయుగళి
నాశిరస్సున ధ్యానింతు నియతి నంబ!
No comments:
Post a Comment