శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
***
గేహం నాకతి గర్వితః ప్రణతతి స్త్రీసంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మావల్లభో దాసతి
మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి త్వత్పాద సంసేవనా
త్త్వాం వందే భవభీతిభంజనకరీం గౌరీం గిరీశప్రియాం.
***
అమ్మా సంసార భయాన్ని పటాపంచలు చేసే గౌరీ! గిరీశుని ప్రియ పత్నీ! నీ పాదసేవలో నిత్యం తరించే వానికి ఇల్లే స్వర్గం అవుతుంది అంటే అనుకూలవతియైన భార్య, యోగ్యులైన సంతానము మొదలైనవి కలుగుతాయి . గర్వితుడైన వాడు నమస్కరిస్తాడు. స్త్రీసంగమమే మోక్షం అవుతుంది. అంటే గృహస్థ జీవితంలో ఉండి కూడా మోక్షానికి అర్హుడవుతాడు. ఎప్పుడూ ద్వేషించే వాడు స్నేహితుడైపోతాడు. చేసిన పాపము లన్నీ సుకృతము లైపోతాయి. అంటే నీ భక్తుడు కాక మునుపు చేసిన పాపము లన్నీ నశిస్తాయి. పాపవాసనలన్నీ తొలగిపోతాయి. చక్రవర్తి దాసుడై సేవ చేస్తాడు. మృత్యువు వైద్యుడై రక్షిస్తుంది. అంటే అపమృత్యు భయం ఉండదు. దూషణములే భూషణము లవుతాయి. ఇంకేమి కావాలి మానవునకు?
విశెషార్థం:
అమ్మా నీ భక్తుడైన వాడికి ఇల్లైనా ఒకటే స్వర్గమైనా ఒకటే. గర్విష్ఠుడు ఎదురైనా వినమ్రు డెదురైనా ఒకటే. భార్యతో సహజీవనం చేస్తున్నప్పటికీ మోక్షానికి అర్హుడై ఉంటాడు. ద్వేషించే వాడైనా మిత్రుడైనా ఒకలాగనే ఉంటాడు. పాప పుణ్యాలకు అతీతుడై ఉంటాడు. రాజును సేవకుడినీ ఒకే దృష్టితో చూస్తాడు. మృత్యువుకు భయపడడు. దూషణ భూషణములను ఒకటిగానే భావిస్తాడు. సమశ్శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు " సమస్సంగ వివర్జితః తుల్య నిందా స్తుతి ర్మౌనిః సంతుష్టో యేన కేన చిత్ అనికేచ స్థిరమతిః భక్తిమాన్ యః సమేంద్రియః "( గీతా వాక్యం ). అలాగ ద్వంద్వాలకు అతీతుడై తరించిపోతాడు. ద్వంద్వాతీతో విమత్సరః.
అమ్మ ఆరాధన పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది.
***
గృహము స్వర్గమ్మౌను కేల్మోడ్చు గర్విష్ఠి
.....ముదితను పొందుట మోక్ష మగును
ద్వేషి మిత్రుడగును వృజినము సుకృతమౌ
.....పృథ్వీశుడు భజించు భృత్యుని వలె
మృత్యువు వైద్యుడై మేల్జేయు స్వయముగా
.....దూషణ లెల్లను భూష లగును
నీ పాద పద్మంపు నిరత సంసేవనా
.....సక్తుడై తరియించు భక్తమణికి
నింక కొఱత యేమి యిహమైన పరమైన
నండ నెపుడు నీవె యుండ గౌరి!
భవము వలన కలుగు భయమును హరియించు
గట్టువిల్తుని ప్రియ కాంత! నతులు.
No comments:
Post a Comment