శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ :
***
ముక్తారత్న విచిత్రకాంతి లలితై స్తే బాహువల్లీ రహం
కేయూరాంగద బాహుదండ వలయై ర్హస్తాంగుళీ భూషణైః
సంపృక్తాః కలయామి హీరమణిమన్ముక్తావళీకీలితం
గ్రీవాపట్ట విభూషణేన సుభగం కంఠం చ కంబుశ్రియం.
***
ఓ తల్లీ! ముత్యములతో పొదగబడి విచిత్రమైన కాంతితో ప్రకాశిస్తున్న, కేయూరములతోను, అంగదములతోను, కంకణములతోను, ఉంగరముల తోను భాసిస్తున్న కల్పవృక్షపు తీగలవలె యున్న నీ నాలుగు బాహువులకు నమస్కరించుచున్నాను. వజ్రములతోను ముత్యములతోను కూడిన మెడపట్టెడతో ప్రకాశిస్తూ శంఖ శోభతో అలరారుచున్న నీకంఠమునకు నమస్కరించు చున్నాను.
***
పొదిగిన ముత్యముల్ మెరుపు పూవుల వోలెను కాంతు లీన నం
గదములు కేయురమ్ములును కంకణముల్ బటువు ల్రహించగా
ముదమిడు బాహువల్లరుల మ్రొక్కుదు వజ్రము లాణిముత్యముల్
పదపడు పట్టెడన్ వెలుగు వారిజ శోభల నొప్పు కంఠమున్
మది దలతున్ ప్రణామములు మాటికి సేతును భక్తి నమ్మరో.
No comments:
Post a Comment