శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
***
తప్త స్వర్ణ కృతోరుకుండలయుగం మాణిక్య ముక్తోల్లస
ద్ధీరాబద్ధ మనన్యతుల్య మపరం హైమం చ చక్రద్వయం
శుక్రాకార నికారదక్ష మమలం ముక్తాఫలం సుందరం
బిభ్రత్కర్ణయుగం భజామి లలితం నాసాగ్రభాగం శివే.
***
కరుగుతున్న బంగారము వెలిబుచ్చు కాంతి వంటి కాంతితో కెంపులు, ముత్యములు అలంకరించిన వజ్రాలతో పొదగబడిన ( కెంపులు సూర్య సంబంధమైనవి, ముత్యాలు చంద్ర సంబంధ మైనవి.....తాటంక యుగళీభూత తపనోడుప మండలా...లలితా సహస్రం)
కుండలములను ధరించిన నీ కర్ణద్వయమును, ముత్యముతో పొదగబడి వేగుచుక్క(శుక్రతార) యొక్క ప్రకాశమును కూడా ఓడింప సమర్థమైన అందమైన బంగారు బులాకీని ధరించిన నీ నాసాగ్రభాగమును ( నాసాగ్రే స్వమౌక్తికం...) ఓ శివా! నేను స్మరిన్చుచున్నాను.
***
కరగిన బంగారు ఘనమైన కుండలాల్
.....ముత్యాల కెంపుల మురువు దాల్చి
పొదిగిన వజ్రాల పొల్పగు కాంతుల
.....ననుపమ రీతుల నమరియుండె
ముత్యము పొదిగిన పోడిమి నలరుచు
.....మురిపించు చక్కని ముక్కుపుడక
వేగుచుక్కను మించు వెలుగుల ప్రసరింప
.....జాలుచు రమ్యమై వ్రేలుచుండె
నిట్టి రమణీయ భూషల కిరవు గూర్చి
లలితమై యొప్పు కళలచే కలిత మైన
నీదు కర్ణనాసాగ్రాల నియత భక్తి
నాదు మది నెంతును శివాని నతులు నీకు.
No comments:
Post a Comment