padyam-hrudyam

kavitvam

Friday, September 22, 2017

త్రిపురా మహిమ్న స్తోత్రం. 1




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ :

***

శ్లో.
శ్రీ మాత స్త్రిపురే పరాత్పరతరే దేవీ త్రిలోకీ మహా
సౌందర్యార్ణవ మంథనోద్భవసుధా ప్రాచుర్య వర్ణోజ్వలమ్ |
ఉద్యద్భానుసహస్ర నూతన జపా పుష్పప్రభం తేవపుః
స్వాంతే మే స్ఫురతు త్రిలోకనిలయం జ్యోతిర్మయం వాఙ్మయమ్ ||

ఓ శ్రీ మాతా!  త్రిపురసుందరీ! గొప్పవైన అన్నిటి  కన్న గొప్పదానవైనదానా! దేవీ! ముల్లోకములలోని మహా సౌందర్యము అనే సముద్రమును మథించగా పుట్టిన అమృతపు ముద్ద యొక్క రంగు వంటి రంగుతో ప్రకాశిస్తున్న తల్లీ! ఉదయించుచున్న వేలకొలది సూర్యుల వంటి, అప్పుడే వికసించిన ఎర్రనైన జపాకుసుమము వంటి కాంతితో వెలుగొందుచున్న శరీరము కలదానా! త్రిలోకములకు నిలయమైన (ఆధారభూతమైన) దానా! సూర్యచంద్రాగ్ని మయమైనస్వయంప్రకాశము గల జ్ఞానరూపమైన దానా! అక్షరరూపమైన మంత్రరూపమైన పరా పశ్యన్తీ మధ్యమా వైఖరీ రూపములలో ప్రకాశించు దానా! అట్టి నీ స్వరూపము నా హృదయమందు స్ఫురించు గాక.

***

సర్వలోకమ్ముల సౌందర్య జలధుల
.....మధియించ వచ్చిన సుధల ముద్ద
రమ్యమౌ వర్ణము రాజిల్లు తీరున
.....దేహప్రభారాశి తేజరిల్ల
వేలబాలార్క సంవికసిత జపపుష్ప
.....తామ్రవర్ణద్యుతిన్ తనువు చెలగ
త్రిభువననిలయ! జ్యోతిర్మయి !వాఙ్మయి !
.....శ్రీమాత !త్రిపురారిప్రేమపత్ని!

ఓ పరాత్పరతరి! శివా! ఓ భవాని!
దేవి ! యీరీతి నీదగు దివ్య రూపు  
నాదు డెందము నందున మోద మలర
నిత్యమున్ స్ఫురియించుత నీదు కరుణ.

No comments: