padyam-hrudyam

kavitvam

Friday, September 29, 2017

దేవీ మహిమ్న స్తోత్రం - 8



శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

చాప ధ్యాన వశా ద్భవోద్భవ మహామోహస్య విజ్జృంభణం
ప్రఖ్యాతం ప్రసవేషు చింతన వశాత్త త్త చ్ఛరవ్యం సుధీ:.
పాశ ధ్యాన వశాత్సమస్తజగతా మృత్యోర్వశత్వం మహా
దుర్గస్తంభమహాంకుశస్య మననాన్మాయా మమేయాం తరేత్

***
.
తల్లీ నీ చేతిలోని ధనుస్సును ధ్యానించిన వానికి సంసారం వలన పుట్టే మహా మోహము యొక్క తీవ్రత నశిస్తుంది.  బాణములను స్మరించిన వానికి ధర్మబద్ధమైన అభీష్టము లన్నీ నెరవేరుతాయి.  పాశమును తలచుకొనే వాడికి  సమస్త లోకములలోను మృత్యువు వశమై పోతుంది. (అపమృత్యువు కలుగదు).  అమితమైన బాధలను అణచే అంకుశమును ధ్యానిస్తే మాయకు చిక్కుపడడు.

అంటే అమ్మవారి ఆయుధాలను ధ్యానించే వారు మోహం నాశనమై పోయి, న్యాయమైన కోర్కెలు తీరి, అపమృత్యు భయం లేక, మాయను తరించ గలుగుతారు.


బ్రహ్మజ్ఞానం కలగాలంటే అమ్మవారి చేతులలోని ఆయుధములను ధ్యానించాలి అని పెద్దల వాక్కు.  అదే ఈ శ్లోకంలోని సారాంశం.

***

చాపమున్ ధ్యానింప సంసార భవ మహా
.....మోహవిజ్జృంభణ ముడిగిపోవు
నారాచముల  దల్ప న్యాయ బద్ధంబైన
.....చింత లన్నియు దీరి సంతస మగు
పాశమున్ ధ్యానింప పదునాల్గు భువనాల
..... మృత్యువు వశమగు మేలు కల్గు
అత్యుగ్ర వేదన నణచెడు నంకుశ
.....మును దల్ప మాయలో మునుగ బోడు

ధూర్తులకు భీతి గలిగించు నార్తి బాపు
నర్థులకు నమ్మ హస్తాల నాయుధములు
మోహ ముడుగును నెరవేరు నైహికములు
మృత్యు వంటదు మాయ తరించ గలుగు.





No comments: