padyam-hrudyam

kavitvam

Monday, October 30, 2017

కావ్య కంఠ వాశిశ్ట గణపతి {5}



ఆ నాలుగు సమస్యలు:
స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి (కింత్యనవద్యచరితా)
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
సూర్య శశాంకేన సమం వినష్టః (నత్వమవాస్యా)
పిపీలికా చుంబతి చంద్రమండలమ్
ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గు సమస్యలని తడుముకోకుండా పూరించి తన ప్రతిభ చాటాడు.

ఆ పూరణలేమిటంటే:

హిడింబా భీమదయితా నిధాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిజ్యత్యా వధూ శ్వశుర మిచ్ఛతి
(భీముని భార్యయగు హిడింబ ఉక్కకోర్వలేక, తనమామగారైన గాలినిచ్చగించి స్తనవస్త్రమును విడిచెను అని అర్థం. ఇక్కడ, ద్రౌపదిని గాక హిడింబని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంది. దీనికి రెండు కారణాలు – మెదటిది ద్రౌపది ఒక్క భీమునికేగాక పాండవులందరికీ ఇల్లాలు. అదీగాక, ద్రౌపది రాచకన్య, కాబట్టి స్తనవస్త్రం పరిత్యజ్య అని ద్రౌపదినుద్దేశించి చెప్పటం అంత ఔచిత్యం కాదు)

చతుర్థ్యాం భాద్ర శుక్లస్య చంద్ర దర్శన శంకయా
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
(భాద్రపద శుద్ధ చవితినాడు (వినాయక చవితినాడు), శివుడి తలపైనున్న చంద్రుడిని చూడవలసి వస్తుందేమోననే శంకచే, సంవత్సరమున కొక్కసారి గౌరీదేవి తన పతి ముఖాన్ని చూడదు)

రాహుస్త్రీ కోణే చ గురుస్తృతీయే
కళత్ర భావే చ ధరా తనూజః
లగ్నే చ కోష్ఠే యది బాలకః స్యాత్
సూర్య శశాంకేన సమం వినష్టః
(పంచమ, నవమ స్థానములలో నొకదాని యందు రాహువు, తృతీయమునందు గురువు, కళత్ర స్థానమునందు కుజుడు ఉండగా పుట్టిన బాలునకు – లగ్నమందు సూర్యచంద్రులున్ననూ అరిష్టముండును)

సతీ వియోగేన విషణ్ణ చేతసః
ప్రభో శయానస్య హిమాలయే గిరౌ
శివస్య చూడాకలితం సుధాశయా
పిపీలికా చుంబతి చంద్ర మండలమ్
(దక్ష యజ్ఞమందు సతీదేవిని కోల్పోయి, విషణ్ణ చేతస్కుడై, శివుడు హిమవన్నగముపై పడుకొని యుండగా, అతని శిరోభూషణమైన చంద్రుడు భూమికంటియుండెను. అదే సమయమని యెంచి, చంద్రునియందున్న అమృతాన్ని అందుకోవాలనే ఆశతో చీమలు చంద్రమండలమును చుంబించెను)


దీంతో, కవిత్వ పరీక్షలో నెగ్గినట్లే.

సశేషం...

No comments: