padyam-hrudyam

kavitvam

Wednesday, October 2, 2013

దొర్లెదమయ్య హాయిగా!









భారతమాత హస్త యుగ పద్మములన్ దవిలించ సంకెలల్,
జారెను బాష్ప బిందువులు జాలిగ నాయమ కల్వ కన్నులన్
ధారగ, నీ యెడంద నవి తాకెను, చివ్వున నీవు చూడగా
క్రూరులు తెల్ల రక్కసుల కొంపలు కూలెను బాపుజీ! భళా!

మేరు సమాన ధీరుడవు మేదిని నీదగు వీరు లెన్ననీ
ధారుణి నింక బుట్ట రిది తథ్యము! యోరిమి దివ్య చాపమున్!
భూరి యహింస సత్యమను పొల్పగు బాణ యుగమ్ము! వీనితో
పోరితివీవు శత్రువుల మోములు ఛిద్రము గాగ బాపుజీ!

పుట్టిన రోజునాడు నిను బుద్ధి దలంతుమె? చెప్పలేమె యి-
ప్పట్టున బాపుజీ! సెలవు! పండుగ! సత్యమహింస తుంగలో
గట్టిగ త్రొక్కి పట్టి, కడు కమ్మగ మాంసము మెక్కి, మద్యమున్
పట్టుగ పట్టి ద్రావి కడు పారగ, దొర్లెదమయ్య హాయిగా!



2 comments:

మధురకవి గుండు మధుసూదన్ said...

సాహితీ మిత్రులు మిస్సన్నగారికి నమస్కారములు. తమరి "పద్యం-హృద్యం" బ్లాగును ఇప్పుడే చూచుట తటస్థించినది. మీ నిర్వహణము బాగున్నది. అభినందనలు.

హృద్యములగు పద్యములను
నాద్యంతము మధుర కవన నవ్యాకృతిచే
సద్యశము గల్గఁ జెప్పితి;
మాద్య న్మిస్సన్న నామ! మాన్య! సుమిత్రా!

మిస్సన్న said...

సత్కవి మిత్రులు, సరస గంభీర సమాసబంధుర పద్యరచనా ధురీణులు గుండు మధుసూదను గార్కి స్వాగతం. మీ రాకతో పద్యం-హృద్యం పులకిచింది.

ముదమాయెను నా బ్లాగుకు
మదిమెచ్చుక సన్నుతింప మధుసూదన! యో
సదమల చరితా! మేలగు
నిది మీ సహృదయతఁ జాటె నింపుగ సుకవీ!