padyam-hrudyam

kavitvam

Thursday, December 13, 2012

జిలేబీ తయార్




మినప గుళ్ళు తెచ్చి మేలి రకమ్మును
నీటిలోన నాన నిచ్చి పిదప
పిండి రుబ్బవలయు నండి మెత్తగ దాని
పులియ బెట్ట వలెను పూటబాటు.

పంచ దార దెచ్చి బాణలిలో పోసి
నీరు జేర్చి సన్న నెగడు మీద
లేత పాక మైన రీతిని కానిచ్చి
ప్రక్క నుంచవలయు పదిలముగను.

నూనెను మూకుడు లోనిడి
మానుగ స్టౌ పైన బెట్టి మరిగిన పిదపన్
పూనిక పులిసిన పిండిని,
పానకమును ప్రక్కనుంచి పళ్ళెము లోనన్,

కొబ్బరి చిప్పకు కొద్దిగ
దబ్బనమున చిల్లు జేసి దానిలొ పిండిన్
గొబ్బున నుంచిన పిమ్మట
నబ్బురమగు చుట్ట వోలె నయ్యది దానిన్,

కాగు నూనె లోన కమ్మగ వేయించి
వేడి వేడి చుట్ట వేయ వలెను
పాకమందు నాన బాగుగా తయ్యారు
తీయనౌ జిలేబి తినగ పొండు.

2 comments:

Anonymous said...

నోరూరిపోతోందండి. కాని పంచదార కర్మాగారమే ఉందే లోపల :)పద్యాలు బాగున్నాయ్ నాకర్ధం కాకపోయినా. జిలేబీ గారెక్కడో!!! :)

మిస్సన్న said...

కష్టేఫలీ గారూ స్వాగతమండీ! లోపల పంచదార కర్మాగారం లేని వాళ్ళు క్రమేపీ తగ్గి పోతున్నారండీ! ఏం చేస్తాం?
మన లాంటి వాళ్ళ కోసం కొన్ని పేరున్న స్వీట్ షాపుల్లో చక్కర వేయని తియ్యనైన జిలేబీ, జాంగీరు వగైరా అమ్ముతుంటారట కదా. అందుకని సరదాగా:

అయ్యో! జిలేబి గన మా-
మయ్యకు నోరూరె గాని మధు బాధితుడే!
ఇయ్యది చక్కెర రహితం-
బయ్యిన చెపుడయ్య దీని నాతని కిత్తున్.

ధన్యవాదాలండీ!