padyam-hrudyam

kavitvam

Sunday, October 30, 2016

నాటి దీపావళి.



నాటి దీపావళి 


కల్వము పొత్రము కాగితాల్ లైపిండి
.........చిన్న కర్రయు బట్ట సేకరించి
కర్రకు మెల్లగా కాగితాలను చుట్టి
.........గొట్టములను చేసి కోమలముగ
సూరెకారమ్మును చూర్ణముగా చేసి
.........గంధకమ్మును కూడ కలిపి నూరి
వస్త్రగాయితమును వడుపుగా గావించి
.........మెత్తని చూర్ణముల్ మెదప జేసి
పాళ్ళకు తగినట్లు పై రెండు బీడుతో
..........హత్తించి చేరిచి క్రొత్త ముగ్గు

ఆముదముతోడ పదునుగా నన్ని కలిపి
కొద్ది మందును గొట్టాన కూరి నంత
తలుపులను వేసి కాల్చి ముత్యాలు రాల
మంచి ముత్యాల్మతాబుల మందు కుదురు.

ముదురు జిల్లేడు మొక్కల మొదలు త్రవ్వి
పూర్తిగా యెండ కాలిచి బొగ్గు చేసి
గంధకము బొగ్గుపొడి సూరెకారములను
పావు రెండును నారుగా పాళ్ళు కలుప
కుర్రకారు కేరింతల గోలజేయు
ముదితలను పెద్దలను సిడిముడిని జేయు
చివ్వునను గెంతు చిటునటు స్థిరము లేని
చిలిపి తూనీగలకు మందు సిద్ధమగును.

తాటాకు టపాకాయలు
పోటీ జువ్వలును చిచ్చుబుడ్లు సిసింద్రీల్
మేటి మతాబులు త్రిప్పు ప
టాటోపపు పొట్లములును ఢంఢమ దినుసుల్.

దీపావళి యింకా దరి
దాపులకే రాక మున్నె తత్సంబంధం
బౌ పనుల మునిగి పోదురు
పాపలు పెద్దలును స్త్రీలు పదుగురు నొకటై.

నవ్వు పువ్వుల రివ్వున రువ్వుకొనుచు
నొక్కెడన్ గూడి ఆనంద మురక లేయ
బాణసంచా తయారిని పాలుగొనుట
నాడు దివ్యానుభూతి! యీ నాడు సున్న.


No comments: