padyam-hrudyam

kavitvam

Sunday, March 25, 2018

సీతాకల్యాణం



" ఎప్పుడు వచ్చునో యిటకు నెప్పుడు శంభుని వింటిఁ జూచునో
యెప్పుడు దాని నెక్కిడునొ యెప్పుడు నా కరమున్ గ్రహించునో
చప్పున సాగు కాలమ! దశాస్యుని పీడ బ్రచండ మాయెెఁెెె పె
న్ముప్పున నున్న సాధువుల బ్రోవ వలెన్ రఘురాముడే వెసన్.

ఇప్పుడు లంక కేగ వలె నేనిక నా రఘురామమూర్తి యా
గొప్ప సముద్రమున్ గడచి క్రూర దశానను ద్రుంచనౌ వెసన్
తప్పదు కొంత బాధ మరి దండన సేయగ రాక్షసేశ్వరు
న్నెప్పటి కైన "  నీ గతి దపించిన జానకి! నీకు మా నతుల్.

ఇంత దయాంబురాశి జగ మెల్ల సృజించెడి తల్లి సీతయే
సంతస మొప్ప  జీవ తతి జల్లగ జూచుచు జేయు పాలనన్
చింతల బాపి సర్వులకు శ్రేయము గూర్చు నిరంతరమ్ము తా
నంతము జేయు సర్వము ననంత తుదిన్  సెలవిచ్చి సృష్టికిన్.

***

తెల్లని ముత్యముల్ మెరయ దివ్య కరాబ్జములందు కెంపులై
యల్లన వోసె రామవిభు నౌదల జానకి,  రాలుచుండగా 
మల్లెల రీతి నొప్పె నవి, మా రఘు రాముని మేని శోభ రా
ణిల్లి సునీలకమ్ములుగ నెంతయు దీప్తుల మించె సేసలే.

***

మైథిలీ రామచంద్రుల మనువు వేళ
నిట్లు మురిపించు సేసలు హితవు గూర్చి
ధర్మపరులను గాచును ధరణి లోన
మంగళములను  గూర్చును మానవులకు.


No comments: