padyam-hrudyam

kavitvam

Friday, March 2, 2018

హోళికా పూర్ణిమ.



రమ్య బృందావనీ సీమ రమణు లలర
నారి నారికి నడుమ మురారి మెఱసె
జలజలా పారు యమునలో జలము లాగి
చూచి పులకించి తరియించెఁ జోద్యముగను.

నిండు పున్నమి రేయెండ వెండి వోలె
నిసుక తిన్నెల మెఱయింప మిసమిస నవి
గోపికల గూడి యాడెడు గోపబాలుఁ
గనుచు పులకించి తరియించెఁ దనివి దీర.

దట్టముగ నిల్చి యమున లోతట్టు పైన
జట్లు గట్టిన చీకటిచెట్లు గూడ
నింతులను గూడి క్రీడించు నిందు వదను
నరసి పులకించి తరియించె నప్పు డెలమి.

తరుణులఁ గూడి మాధవుఁడు తారలతో శశి వోలె రంగులన్
మురియుచు మానినీ హృదయముల్ విరులై వికసింప యామునీ
శరముల నిండు పున్నమిని సారసపత్రపు నీటిబిందువై
తిరిగిన వేళ లోకములు దీయని వేదన నొందె నెల్లెడన్.

No comments: