padyam-hrudyam

kavitvam

Sunday, March 18, 2018

విళంబికి స్వాగతం.



కూయని గండుకోయిలలు కూయగ వేడ్కను గున్నమావిళుల్
వేయు జివుళ్ళు గాలియును వీచు సుగంధ పరీమళమ్ముతో
పూయును మల్లె మొల్లలును పొంకముగా కుసుమించు వేములున్
హాయిగ నాడి పాడ ధర కయ్యెడ వచ్చు వసంతు డర్మిలిన్.

క్రొత్త చివుళ్ళు మెక్కి సరి క్రొత్త గళమ్మున పాడ కోయిలల్
క్రొత్త వెలుంగు లీను సరి క్రొత్త యుగాదిని ధాత్రి నల్దిశల్
క్రొత్తకు తావు నిచ్చి తన గూటికి జేరగ ప్రాత మెల్లగా
క్రొత్త చివుళ్ళ సాగు పలు కోర్కెలు డెందము లందు తీవలై.

కాలమను దివ్య చక్రాన కదలె జూడు
మరొక ఆకు మున్ముందుకు మహిత గతిని
కాల రూపేశ్వరుని భక్తి కేలు మోడ్చి 
సలుప వలయు విళంబికి స్వాగతమ్ము.

***

కాయము మావి, మానవుని కర్మఫలాలు చివుళ్ళు, జీవుడే
కోయిల, లోని వాణి కుహు కూయను పాట, సుగంధ వీచియౌ
వాయువు శ్వాస, లోవెలుగు వంకల ద్యోతము, జీవభూమికన్
నేయము జూచువారలకు నిత్యవసంతము సత్యమే కదా. 

No comments: