యశోద పెద్ద కుండలోని పెరుగును పెద్ద కవ్వంతో చిలుకుతోంది. ఆ సమయంలో బాలకృష్ణుడు అమ్మా ఆకలి పాలు కావాలి అంటూ వచ్చాడు. యశోదమ్మ ఉండమ్మా కన్నా పెరుగు చిలకడం అయిపోయాక పాలిస్తాను అన్నా వినకుండా మారాం చేసాడు కన్నయ్య. సరే అని ఆవిడ చిలకడం అక్కడి కాపేసి బాలుణ్ణి ఒల్లో బెట్టుకుని పాలిస్తోంది.
ఇంతలో వంటింట్లోంచి పొయ్య మీద పాలు పొంగి కాలిన వాసన వచ్చింది. చటుక్కున బాలకృష్ణుడిని క్రిందకు దించేసి వంటింట్లోకి పరిగెత్తింది యశోద. కన్నయ్యకు కోపం వచ్చేసింది. అమ్మ చిలుకుతున్న పెరుగు కుండను ఒక్క రాయితో కొట్టేడు. కుండ చిల్లు పడి పెరుగంతా నేల పాలయింది. అక్కడినుంచి ఎదురుకుండా ఉన్న ఇంట్లోకి దూరి ఉట్టి మీద ఉన్న తాజా వెన్నను తను తింటూ అక్కడ ఆడుకుంటున్న కోతి పిల్లలకు పెట్టడం మొదలెట్టాడు.
వంటింట్లోంచి వచ్చిన గోపమ్మ బాల కన్నయ్య ఆగడాలు చూసి విసిగి వేసారి ఒక బెత్తం తీసుకుని వాణ్ని పట్టుకొని కొట్టబోయింది. కన్నయ్య బేల మొహం పెట్టేసి వద్దమ్మా కొట్టద్దమ్మా అంటూ భయాన్ని అభినయిస్తూ పరిగెట్టడం మొదలు పెట్టాడు. అమ్మకు దొరకకుండా బాలుడు, అలసిపోతూ ఆయాస పడుతూ బాలుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని యశోద పరుగెడుతున్నారు. చివరికి అలసి పోయిన అమ్మను జూసి జాలిపడి కిష్టయ్య లొంగి పోయాడు.
వెంటనే యశోద జాలిపడి బెత్తాన్ని క్రింద పడేసి వాణ్ణి ఓ ముద్దు పెట్టుకొని నీ అల్లరి ఎక్కువై పోతోంది, నిన్ను కట్టేస్తేనే కాని నీ అల్లరి మానవు అంటూ ఒక పెద్ద తాడు తెచ్చి అక్కడ ఉన్న ఒక కర్ర రోలుకు బాలుణ్ణి కట్టేద్దామని దించింది. తాడుని రోలుకు ముడేసి బాలుడి బొజ్జ చుట్టూ తిప్పింది. రెండు అంగుళాలు తక్కువైంది తాడు. వెంటనే ఇంకో తాడు తెచ్చి మొదటి తాడుకు జతచేసి బొజ్జ చుట్టూ తిప్పింది. మళ్ళా రెండు అంగుళాలు తక్కువైంది. ఇంకో తాడు తెచ్చింది. జత చేసింది అదీ సరిపోలేదు. అలా ఇంట్లో తాళ్ళన్నీ అయిపోయాయి ఇంకేమీ లేవు అప్పుడు కృష్ణుడికి అమ్మ పడుతున్న పాట్లకు జాలేసి ఆఖరి తాడుతో తన బొజ్జకు సరిపెట్టేసుకున్నాడు. యశోద నీ కిదే శాస్తి అంటూ బాలుణ్ణి రోటికి కట్టేసి ఇంటి పనిలోకి వెళ్లి పోయింది. ఇదే ఉలూఖల (ఱోలు) బంధనం.
ఇదంతా మనకు తెలిసిందే.
అయితే ఈ లీల వెనక అపురూపమైన యోగ రహస్యం దాగుందని, సాధకులైన యోగులు ఆ యోగాన్ని సాధన చేస్తూ ఆనందాన్ని పొందుతూ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారని, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇంకా ఇలా చెప్పేరు.
పరమాత్ముడు మన చుట్టూనే తిరుగుతూ తన ఉనికిని తెలుసుకోమని మనను హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ సరైన సాధన లేక మనం వినం ముందు యశోద కృష్ణుడి ఆకలిని పట్టించుకోనట్లు. ఆఖరికి అదృష్ట వశాత్తు సాధనకు దొరుకుతాడు. అంతలో సంసార వాసనలు ఆయన్ని ప్రక్కకు తోసేస్తాయి. యశోద పొయ్యి మీద పాలకోసం బాలుణ్ణి దించేసి లోపలి పరిగెట్టినట్లు. ఆ స్థితిలో భవ బంధాలను అన్నిటినీ ఒక్కొక్కటీ ఏకం చేసి పరమాత్మ వైపు చూడటం మొదలెట్టాలి యశోద ఇంట్లో తాళ్ళు అన్నీ ఒకటిగా చేసినట్లు. అప్పుడు ద్వంద్వాలను (అంటే అహంకార మమకారములు, సుఖ దుఃఖములు వంటి వాటిని) కూడా విడచి పెట్టాలి. అవే యశోదను తిప్పలు పెట్టిన రెండంగుళాలు. ఆ క్రమంలో యశోదలా తపించిపోవాలి విశ్వగర్భుడిని హృదయకుహరంలో కట్టి పడెయ్యడానికి. దొరకకేం చేస్తాడు విశ్వాత్మకుడు?
పై భావానికి నా పద్య రూపం:
సాధనతో సమాధి గొని సర్వమయు న్నెదలోన నిల్పినన్,
కాదని యైహలౌకికపు గాటపు వాసన లీశు జార్చెడిన్
ఛేదన చేసి బంధముల చిట్లని పట్టున భక్తి రజ్జుచే
మాధవు గట్టగా వలయు, మాయని ద్వంద్వములన్ త్యజించి, దా
మోదరు డంత బట్టువడు మోదముతోడను, నందనందనుం
డాదర మొప్ప ఱోటికడ నమ్మకు జిక్కిన రీతి, గట్టిగా.
*****
( శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు రాజమహేంద్రవరం లో 42 రోజుల శ్రీమద్భాగవత ప్రవచనం చేస్తున్నారు ఈ నెల 2వ తేదీ నుంచి. ఫేస్ బుక్ లో " బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు
" అనే పేజీ లో ప్రతి రోజు సాయంత్రం 6.30 గం.నుంచి లైవ్ లో చూడవచ్చును ఆ ప్రవచనాన్ని. మార్చి నెల 15 వ తేదీ వరకు)
2 comments:
మిస్సన్న గారు, అందరికి తెలిసిన కథే అయినా దాని వెనుక ఉన్న మర్మం చక్కగా చెప్పారు. మీ పద్యంలో కూడా దాన్నే చాలా చక్కగా చెప్పారు.
బ్లాగుకు స్వాగతం అన్యగామి గారూ. మీ స్పందనకు ధన్యవాదములు.
Post a Comment