padyam-hrudyam

kavitvam

Sunday, April 30, 2017



పాశమున నీదు ప్రాణముల్ పట్టి లాగ
వచ్చి నిలుచుండ కాలుడు, వల్లెవేయు
వ్యాకరణ సూత్ర మేరీతి నీకు రక్ష
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

విత్తమందు దురాశను విడచిపెట్టు
ప్రాప్త మైనట్టి దానితో తృప్తి నొందు
మంచి బుద్ధిని లోకాన మసలుకొమ్ము
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

తామరాకున నీరము తరళ మట్లు
చంచలము జీవితమ్ము  ప్రపంచ మెల్ల
వ్యాధిగర్వాభిమానదుఃఖాపహతము
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

విత్తసముపార్జనాశక్తవేళ వరకె
బంధువుల ప్రేమ, ముదిమిని వ్యాధి వలన
ధనము తేలేకపోయిన దరికి రారు
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

గూటిలో గువ్వ యున్ననే కుశల పృచ్ఛ
దీప మారిన లోపల దేహము గని
భార్య యైనను దరి రాదు భయము జెంది
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

బాల్యమున సక్తి క్రీడల, ప్రాయమందు
పడుచు లందున రక్తియు, జరను చింత
కాని పరమైన బ్రహ్మము గాన డెవడు
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

భార్య యెవ్వరు నీ తనూభవు డెవండు
చూడ సంసారమే గొప్ప చోద్య మెవరి
వాడ వీ వెవడవు వస్తి వేడ నుండి
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

కొంచెమైనను గీత పఠించ వలెను
కొంచెమైనను గంగ సేవించ వలెను
కొంచెమైనను పరమాత్ము నెంచ వలెను
కోరి గోవిందు కొల్వవే కుమతి నీవు.

  




No comments: