padyam-hrudyam

kavitvam

Sunday, April 23, 2017

పుస్తకము

అరటి ఆవు ఇటుక అని తెన్గు నేర్పిన
..........మొదటి వాచకమును మోడ్తు కరము
సామాన్యము గణిత సాంఘిక శాస్త్రాల
..........భాషల జెప్పిన వాని నెంతు
చందమామలు మంచి సాహితీ పత్రికల్
.........కథలను నవలల గణుతి జేతు
ఆర్థిక వాణిజ్య వ్యాపార గణితాల
..........బోధ జేసిన వాని పూర్తి దలతు

కొలువు పొందు కొఱకు విలువైన సంగతు
లేర్చి కూర్చి నాకు నింపు జేసి
జీవితమ్మునందు స్థిరపడ జూచిన
పుస్తకముల కేను పోహణింతు.

గణితబోధినుల్ శతకముల్ కావ్యములును
భాగవత భారతాదులు పథము జూపి
నిన్ను మల్చును మంచిగా మన్నన నిడు
మరువబోకుము పుస్తక మరయ గురువు.

పుస్తకము తల్లి తరువాతి నేస్త మెన్న
పుస్తకము మంచి శిక్షణ మస్తకమున
పుస్తకము తీర్చి దిద్దు సమస్త జనుల
పుస్తకము మూయ నంతయు  వ్యస్తమగును.

ఒకమారు చూచి చదివిన
సకలమ్మును వంటబట్టు సరిగా నీకున్
వికలము కాదది తుదకున్
రకరకముల పదను బెట్టు రంగుగ మేధన్.

గొప్ప గొప్పవారు గొప్పవా రెట్లైరి
చదివి పుస్తకముల సర్వ దశల
చదువుపట్ల నీకు సక్తి మెండుగ నున్న
చేరగలవు ప్రథమ శ్రేణి నెపుడు.

పుస్తకము వీడబోకుము
పుస్తకమును మూయబోకు పొరబాటైనన్
పుస్తకము మంచి మిత్రుడు
పుస్తకములను పంచిబెట్టు పుట్టినదినమున్.

చదువనివా డజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత కలుగున్
చదువగ వలయును జనులకు
చదివించుడు పుస్తకముల చదువుడు మీరున్.

No comments: