padyam-hrudyam

kavitvam

Thursday, May 4, 2017

సీతమ్మ మాయమ్మ...


కం.
సృష్టి స్థిత్యన్తమ్ముల
నిష్టామాత్రమున జేయు నీశ్వరి వీవై
కష్టమ్ముల హరియించుచు
శిష్టుల రక్షించు సీత! చిన్మయి! ప్రణతుల్.

చం.
జనకుని కూతువై  వెలసి చక్కని రూప వయో విభూతుల
న్నినకుల సార్వభౌమునికి నీడయి యన్నిట తోడునీడవై
వనముల సంచరించి దశవక్త్రవినాశపు మూలభూతివై
ఘనయశ మంది తీవు రఘుకాంతుని కాంత! యివే ప్రణామముల్.

సీ.
నాగేటిచాలులో నవ్వులు చిందించి
..........జనకు నింటికి కీర్తి ఘనము జేసి
గుణిభంగ నెపముతో కోసలేశు వరించి
..........రఘుకులమ్మున మెట్టి రహి వహించి
కోదండపాణితో ఘోరాటవిని జేరి
..........బంగరుజింక యన్ వంక బెట్టి
ముందుగా నీవేగి ముప్పయి లంకకు
..........రాక్షసాన్వయమును శిక్ష జేసి

తే.గీ.
నిప్పులో దూకి సాధ్విగా నిగ్గు దేరి
కుశలవుల తల్లివై ముని యశము బెంచి
తల్లి యొడి జేరితమ్మ సీతమ్మ తల్లి!
ఎన్ని లీలలు! నీ కథ లెంత వింత!

సీ.
మఖరక్ష సాకుతో మౌనితో చనుదెంచి
........నీకయి వెదకుచు నిన్ను జూచి
శివచాపమును ద్రుంచి చివురంటి చెయి బట్టి
........యింతిగ నిను గొని యింట జేర్చి
నీడగా నీవుండ నిశ్చింతగా నేగి
........దనుజతతుల గూల్చి వనములందు
లంకకు నీవేగ లాంగూలి తతి గొని
........మున్నీటి తరియించి మ్రుచ్చు ద్రుంచి

తే.గీ.
హాయిగా గూడి నిన్ను సింహాసనమ్ము
నధివసించి యయోధ్యకు నయ్య యాయె
రామచంద్రుడు నినువినా భూమి తనయ!
చంద్రికలు లేని చంద్రుడే సత్య మిద్ది.

తే.గీ.
చాలుపేరింటి పూబోడి! జానకి! కుజ!
పుడమిపుట్టువు! వైదేహి! భూజ! సీత!
పంటవలతి పట్టి! మహీజ! పార్థివి! సతి!
నేలచూలు! మహీసుత! నీకు నతులు.

***

నేడు సీతానవమి (సీతాజయంతి)

No comments: