padyam-hrudyam

kavitvam

Wednesday, March 8, 2017

ఆమెకు వందనములు.

పసిపాప లాకలై వసివాడు వేళలో
......మాతృమూర్తిగ మారు మహితశక్తి!
అనురాగమును పంచ నపురూప బంధాన
......సోదరిగా దిగు శుద్ధశక్తి!
ధర్మార్థకామాల కర్మల సగమౌచు
......బ్రతుకును పండించు ప్రబలశక్తి!
తనయయై తలిదండ్రులను రాగబంధాన
......కనిపెట్టుకొని సదా తనుపుశక్తి!

అత్త వదిన మామ్మ అమ్మమ్మ మేనత్త
పిన్ని దొడ్డ సఖియ ప్రియము గూర్చు
నీదు రూపములని నేనెంతు  శ్రీమాత!
ఈవె నరున కెన్న నేడుగడవు.

పిల్లవాం డ్రాకటిన్ తల్లడిల్లెడు వేళ
......కడుపును నింపెడు కన్నతల్లి
అన్న రారా యంచు నాప్యాయతను బంచు
......తోడబుట్టిన ప్రేమగూడు చెల్లి
కష్టసుఖాలలో కడదాక తోడుండి
......బ్రతుకును పండించు వల్లభ చెలి
ముద్దుల బిడ్డయై మురిపాల నందించి
......కన్నతీపిని పంచు కల్పవల్లి

తల్లి చెల్లియు చెలియయు పిల్ల లందు
నెవ్వరైనను లేకున్న నేది శోభ
యిలను మగవాని కెన్నగా నింతి లేక
బ్రతుకు వ్యర్థమ్ము జోహారు పడతి! నీకు.

No comments: