ప్రాచీదిగంగన భవ్య సీమంతపు
.....సిందూరమై యొప్పు చిన్ని చుక్క!
నీలాభ్రదేహు విశాల వక్షమ్మున
.....కౌస్తుభమై వెల్గు కాంతి ముద్ద!
శ్రీమాత నడుమున చెన్నొందు దివ్యమౌ
.....వడ్డాణ మందలి వజ్రపు రవ!
విశ్వంభరుని పాదబిసరుహ మకరంద
.....బిందుసముచ్చయ విమలదీప్తి!
సకల జీవకోటి చైతన్య సంధాత!
కర్మసాక్షి! పరమధర్మమూర్తి!
హరితహయరథమ్ము నధిరోహణము జేసి
దర్శనమ్ము నిడెడి దండ మిడుడు.
No comments:
Post a Comment