తలుపు నెవ్వరో తట్టిన యలికి డాయె
తెరచి చూచితి పిల్ల తెమ్మెర యొకండు
చల్లగా నన్ను తాకిన దుల్ల మలర
మలయ మారుత వీచివా మంచి దంటి.
గడప దాటితి వాకిట నడుగు బెట్ట
సన్నగా నెవ్వరో నవ్వుచున్న సడులు
గుబురు పొదవంక జూచితి గుట్టు నెరుగ
మల్లె మొగ్గల నవ్వులు తెల్లగాను!
తోచె నల్లంత దూరాన రోచు లేవొ
లేత యెర్రని డవులుతో లీలగాను
తలను పైకెత్త సిగ్గు దొంతరలు క్రమ్మ
నెర్ర బారిన చివురుల నెలమి మావి!
ఇంతలో గుప్పుమని తాకె నింపుగాను
నాసికను కాస్త వగరౌ సువాసన యది
కొమ్మ రెమ్మల తెలి మంచు క్రమ్మి నట్లు
విరగ బూసిన యొయ్యారి వేప మొక్క.
ఉల్ల మానంద డోలిక నూయ లూగ
నెవ్వరో నన్ను కోయని యింపుగాను
పిలువ పరికించి చూచితి నలు దెసలను
మావి కొమ్మల కోయిల మాటు వేసె.
హృదయ మానంద కెరటాల నెగసి పడగ
కంటి దిక్కుల క్రొంగ్రొత్త కాంతి ఝరులు
పలు సువర్ణాల మేలిమి పట్టు చీర
ప్రకృతి పడతుక ధరియించి పరవశించె.
ఏమిటి విశేష మెల్లెడ నీ దినాన
నింత హాయియు నానంద మినుమడించె
నోహొ తెలిసిన దీ సుముహూర్త వేళ
వచ్చె వాసంతు డల్లదే వసుధ వైపు.
మలయమారుతవీచియు మల్లె మావి
వేము కోయిల క్రొవ్విరుల్ వెడలె నెదురు
స్వాగతమ్మని పిలువ వాసంత సఖుని
నేను నెదురేగి రమ్మందు నిపుడె వత్తు.
No comments:
Post a Comment