యుద్దరంగమున మాయలమారి మేఘనాథుని చంపి నందులకు అగస్త్యాది మహర్షులు వచ్చి రామా పండ్రెండు వత్సరములు నిద్రాహారములు మాని బ్రహ్మచర్యమును పాటించిన వారి చేతనే ఇంద్రజిత్తు సంహరింప బడతాడు అందుచేతనే లక్ష్మణుని వలన మాత్రమే ఆ పని జరిగింది అని లక్ష్మణుని ప్రశంసిస్తారు.
దానికి రాముడు ఆశ్చర్య పోయి అదేమిటి లక్ష్మణుడు ఈ పండ్రెండు వత్సరాలూ మాతోపాటు ఆహారం తీసుకుంటున్నాడు కదా అతడు ఎలా చంపాడు యింద్రజిత్తుని అని తమ్ముణ్ణి పిలిచి సౌమిత్రీ నువ్వు రోజూ ఆహారం తీసుకోవడం లేదా అని అడుగుతాడు.
లక్ష్మణుడు లేదన్నా నేను భోజనం చెయ్యలేదు, నిద్ర కూడా పోలేదు అంటాడు.
మరి ప్రత్రిరోజూ నువ్వు తెచ్చిన ఫలాలను మూడు భాగాలుగా చేసి నీకొక భాగాన్ని ఇస్తున్నాను కదా వాటిని ఏం చేస్తున్నావు అన్నాడు రాముడు.
లక్ష్మణుడు అన్నయ్యా మీరిచ్చిన ఫలాలను నేను అనాదరం చేస్తానా వాటిని ఎండబెట్టి దాచాను, అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నాడు.
మంచిది అయితే అవన్నీ ఒకసారి నాకు చూపించు అన్నాడు శ్రీరాముడు.
లక్ష్మణుడు ఎండబెట్టిన ఫలాలన్నీ తెచ్చి రామునికి చూపిస్తాడు. అవన్నీ లెక్కింప జేస్తే నాలుగు రోజులవి మాత్రం తక్కువగా ఉంటాయి. రాముడు తమ్ముడూ ఎందుకు నాలుగు రోజుల పళ్ళు తక్కువగా ఉన్నాయి అని అడుగుతాడు.
దానికి లక్ష్మణుడు అన్నయ్యా మనం వనవాసానికి వచ్చిన మొదటిరోజు శృంగిబేరపురం లో ఏమీ తినలేదు కదా. అలాగే మన తండ్రిగారి మరణవార్త విన్నరోజు కూడా మనం ఆహారం ఏమీ తీసుకోలేదు. సీతాపహరణం జరిగిన రోజు మనం ఏమీ తినలేదు. నాకు రాక్షసుని శక్తి తగిలినరోజు కూడా ఏమీ తినలేదు. అందుచేత మొత్తం నాలుగురోజుల పళ్ళు వీటిలో తక్కువగా ఉన్నాయి అని చెపుతాడు.
రాముడు చాలా ఆశ్చర్యాన్ని, విచారాన్నీ ప్రకటించి ప్రేమతో ఇలా అంటాడు.
సోదరా చాలా పొరబాటు జరిగింది. పెద్దవాడవడం చాలా తప్పు. వాడు సేవకులతో సేవ చేయించుకుంటాడు కానీ సేవకులు తిన్నారో తినలేదో ఏమైనా కష్టం వచ్చిందేమో అనేవేమీ పట్టించుకోడు. ఇన్నాళ్ళూ నేను నా భార్యతో ఆనందవిహారాలు చేస్తూ గడిపాను నువ్వు మాత్రం ఆహారం కూడా తీసుకోకుండా మా సేవలు చేస్తూ గడిపావు. నా యీ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే జన్మలో నువ్వు అన్నవుగా పుడుదువు గాని నేను నీకు తమ్ముడిగా పుట్టి నీ సేవ చేసుకుంటాను .
అందుచేత ద్వాపరయుగంలో ఆదిశేాషావతారమైన సంకర్షణుడై పెద్దవాడుగా జన్మిస్తే అతనికి తమ్మునిగా శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు.
అయితే ఇతను చిన్నవాడైనా పెద్దవాడుగానే ప్రవర్తించాడు. ఎందుకంటే "పెద్దవాడైన వాడు" ఎన్నాళ్ళు చిన్నవాడుగా ఉండగలడు మరి?
( మహాభాగవతం నుంచి)
No comments:
Post a Comment