padyam-hrudyam

kavitvam

Tuesday, December 13, 2016

దత్త జయంతి



సర్వలోక గురుడు సంసార రోగంపు
వైద్యు డీత డన్ని విద్యల నిధి
స్మరణమాత్రముననె సంతుష్టుడై మెచ్చు
దత్త గురుని సాటి దైవ మెవరు?

శరణ మన్నవారి కరుణతో జూచును
భవభయమ్ము బాపి పరము నిడును
వ్యాధి బాధ లడచు నాయుష్య మిచ్చును
దత్తగురుని సాటి దైవ మెవరు?

వరదు డితడు భక్తవత్సలు డాపన్న
జనుల కార్తి బాపు సదయు డజుడు
సర్వమంగళముల సన్నిధి యైన శ్రీ
దత్తగురుని సాటి దైవ మెవరు?

హీనపాపపంక మింకింప జేయుచు
దీనజనుల గాచి తేజ మిడును
సర్వదుఃఖహరుడు సర్వమంగళకారి
దత్త గురుని సాటి దైవ మెవరు?

బ్రహ్మహరిభవైక  భవ్యస్వరూపుండు
నమలు డక్షరుండ నంతు డితడు
పరుడు గురుడు హరుడు పరమాత్మ సులభుడు
దత్త గురుని సాటి దైవ మెవరు? 

No comments: