padyam-hrudyam

kavitvam

Saturday, June 20, 2015

పెళ్లి చూపులు



రండి బావ గారు రంజిల్లె మా మది
మీదు రాక నేడు మేలు మాకు
మేము కన్న బిడ్డ మీ యింట కాలూన
ధన్య మౌను బ్రతుకు దాని కింక.

చదువు లోన నెపుడు మొదటనే యున్నది 
గుణ గణమ్ము లెన్న మణియె బిడ్డ
అంద చంద ములను నామె యెట్లున్నదో 
మెచ్చుకొన గలారు మీరె చూచి.

తల్లి పెంపకాన తనరెను యొద్దిక
నిల్లు చక్క దిద్దు నేర్పు గలదు
పెద్ద వార లన్న వినయము ప్రకటించు
ప్రేమ తోడ జూచు పిన్న వారి.

మాయింటి యాడు బిడ్డకు
మీ యింటను చోటునిండు మేలగు మీకున్
హాయిగ మాకును పెండ్లిని
చేయ గలము వైభవముగ చెప్పిన చొప్పున్.

*******

వేడ్క బావగారు! వియ్యము మీతోడ
మాకు కుదిరెనేని, మా తనయుడు
చదువులందు మిన్న మొదటినుండియు కూడ
చక్కనైన కొల్వు సద్గుణములు.

అంద చందములకు నంత మేమున్నది 
గుణగణముల ముందు కొద్ది గావె
మంచి వంశ మంచు మాకెరుకాయెను 
పిల్ల తీరు జూడ నుల్ల మలరె.

లక్ష్మి వంటి మంచి లక్షణముల యీమె
మెట్టి నంత మాకు మేలు కలుగు 
మాకు నచ్చె నామె మంచి ముహూర్తాన
తమ్ములమ్ము లీయ తనర గలము. 

******

ఎంత మంచిమాట నింపుగా నని నారు
ధన్యమైతి మయ్య తమరి దయను
మాదు పెద్ద వారి మాల్మిని మీదు సం-
బంధ మొనరె మాకు భాగ్య మిద్ది.




No comments: