padyam-hrudyam

kavitvam

Friday, June 12, 2015

ఉత్తమే క్షణ కోపస్యాత్ = ఉత్తముల కోపం క్షణకాలమే! 2

ఉత్తమే క్షణ కోపస్యాత్ = ఉత్తముల కోపం క్షణకాలమే! 2
******************************************************
రామదండు సముద్రతీరమ్ము జేరె
నందరును దాటి వార్నిధి నరుగవలెను
లంక, కత్యుగ్రరీతి భయంకరముగ
నలలు పడిలేచుచుండిన వప్పు డరయ.
విని విభీషణు సూచన నినకులశశి
రాము డుదధిని ప్రార్థించె లంక కేగు
మార్గ మీయ సముద్రుడు మాట వినక
నెగసి పడుచుండె కెరటాల సెగల తోడ.
కోపమును రాము డడచుక కూర్మితోడ
దర్భశయనము గావించె దమము పూని
మూడు దినములు గడచె సముద్రఘోష
సుంతయును తగ్గదాయెను పంతమేమొ!
కాలాగ్నిరుద్ర సముడై
లీలామానుషుడు పల్కె లిప్తను జలధిన్
హేలాగతి నింకించెద
నీ లాంగూలములు నడచి యేగగ నటకున్.
కట్టలు త్రెంచుక కోపము
బిట్టురుకగ రామమూర్తి వింటిని చేతం
బట్టెను బ్రహ్మసమాస్త్రము
గట్టిగ సంధించె సృష్టి గడగడలాడన్.
యోజనము లోపలికి నేగె నొక్కసారి
జలధి వడవడ వడకుచు కలగిపోయె
వెడలి వచ్చెను సాగరు డడలి పోయి
రామపాదాల వ్రాలె శరణము గోరి.
వననిధి గడచు నుపాయము
నినకులమణి కెరుక జేసె, నిముషము లోనన్
తను సంధించిన యస్త్రము
ననిపెను దస్యులను ద్రుంచ నంతట కరుణన్.
శాంతి వహించెను రాఘవు
డంతకసముడయ్యు లిప్త నత్తరి గనిరే!
యెంతటి మహనీయమొ కన
లింతయు దుర్గుణము కాని దేదిన తృటిలో.
— with Ram Chandran and తెలుగు సాహితీ పీఠము.


No comments: