padyam-hrudyam

kavitvam

Thursday, June 4, 2015

ఉత్తమే క్షణ కోపస్యాత్ = ఉత్తముల కోపం క్షణకాలమే!


వాలి గతించె రాజ్యమును వాని సహోదరు డేలుచుండె తా
నాలిని వీడి రాఘవు డనంత వ్యథాంబుధి నీదుచుండగా
కాలము భారమై గడచె కజ్జలముల్ చనె శారదాభ్రముల్
రేలను నేలుచుండె కపిరేడు సహాయము మాట నెన్నడే!
కోపము చెంది రాఘవుడు గొబ్బున తమ్ముని బిల్చి లక్ష్మణా!
నా పలుకుల్ వచింపు చని యా కపిరాజుకు 'నన్న వాలికిన్
జూపిన మార్గమే తనకు జూప గలాడ సబాంధవమ్ముగా
నా పని జూడకున్న' ననె యాతడు నేగెను కృద్ధుడై వెసన్.
చేరి కిష్కింధ సుగ్రీవు జీరి జెప్పె
లక్ష్మణుం డన్న పల్కుల లక్షణముగ
వడకె వానర రాజంత పుడమి గల్గు
కోతి భల్లూక తతులను గూడ బిలిచె.
మన్నింపుము నా తప్పును
నన్ను ననుగ్రహముతోడ నయముగ గన మీ
కన్నను దిక్కెవరని యత
డన్నను శ్రీరామమూర్తి కంజలి తోడన్.
అరగడియ క్రితము క్రోధము
తెరలగ మది రగిలినట్టి దేవుడు కని వా
నరరాజు నందె హర్షము
కరగెను మది కరుణ కురియ కౌగిట జేర్చెన్.
'వాన కురిపింప సురపతి, పూని తమము
బాప దినకరుడును మించు భాతి నీకు
పర హితార్థము సహజమౌ పరమగుణము
సఖుడ! తెలియును' నాకనె స్వామి యపుడు.

No comments: