మరుగేలరా నీకు మాధవా! యని తెర
.....................చాటున సిగ్గిలు జలజ నయన!
తెర దీయరే చెలి! తరియింప నినుజూచి
......................యెంత సేపని యెంచు కాంతు డివల!
సుముహూర్త మునకింక సుముఖమే యంతయున్
......................రవ్వంత యాగుడన్ బ్రహ్మ గారు!
చూపులు కలసెడు శుభవేళ యెప్పుడో
......................యిరువురకని చూడ నింతులచట!
నాల్గు కన్నులు ప్రేమతో నవ్వు వేళ!
రెండు హృదయాల వలపులు పండు వేళ!
క్రొత్త భావాలు మదులలో కొసరు వేళ!
పెళ్లి శుభ వేళ !ఎదలెల్ల త్రుళ్లు వేళ!
4 comments:
chaalaa baagundi
అయ్యా! శర్మగారూ! ధన్యవాదాలు.
ఇది యొకవేళ మీ పరిణయేందు శలాకలు జ్ఞప్తి వచ్చి , నె
మ్మది స్మృతివీడి పద్యముగ మారుట కాదుగదా ! తలంప నిం
పొదవెడు రామణీయకపు టూహలు మిస్సన గారి సొంతమై
మథురిమ లూరు - స్వచ్ఛతమ మానస మూర్తులు మీరు మిత్రమా !
సహజము మిత్రమా! మనసు సంగతు లట్లు తలంపు తట్టుటల్
అహమిక లేక పంచుకొన నౌను గదా హృదయాన వేడుకల్!
సహృదయతన్ గణించితిరి చక్కని దంచు మదీయ భావమున్,
ఇహమున మంచి స్నేహమున కెన్నను మించిన భాగ్యమున్నదే?
Post a Comment