సగ మేనన్ ముదమార నీ ప్రియ సతిన్ శైలేంద్రజన్ దాల్చి! ప
న్నగముల్ మేనను గ్రీడ లాడఁ దలపై నాట్యమ్ముఁ జేయన్ సురా-
పగ జాబిల్లి వెలుంగు లా జలములన్ భాసింపఁ దళ్కొత్తుచున్!
జగముల్ బాలన సేయుచుందువుగదా! సర్వజ్ఞ! శంభో! శివా!
అర్థ భాగమ్మున నమ్మను దాల్చిన
..........సాంబ సదాశివా! శరణు! శరణు!
తలపైన గంగమ్మ తైతక్క లాడెడు
..........గంగాధరా! నీకుఁ గైమొగిడ్తు!
కాటిని వసియించి కడతేరు వారికి
..........తోడుండు రుద్ర! నతుల నొనర్తు!
పాములాడగ మేన బాముల హరియించు
..........పరమ దయాళు! నీ పదము గొల్తు!
భక్తి భిక్షను గోరుచు ముక్తి నిచ్చు
శంకరా! నన్ను గావగ శంక వలదు
నీవె తల్లివి తండ్రివి నీవె గురువు
యేడుగడ నాకు నీవె సర్వేశ శరణు.
అమ్మను దూర ముంచిన భవాబ్ధిని మున్కలు వేయుచుండి ని-
త్యమ్మును వేదనల్ బడుచు తల్లి యొడిన్ శ్రమ దీర గోరు భా-
గ్యమ్మును గోలుపోదురను కారుణితో తన మేన దాల్చె మా-
యమ్మను ధాత్రికిన్ జనకు డాతని కెంతటి మాల్మి బిడ్డలన్!
ఎపుడే యాపద వచ్చునో కుపితుడై యే బిడ్డలం జూచునో
యపరాధం బొనరించె నంచు పితరుండా నిప్పు కంటన్, కటా!
అపుడీ తల్లి యెడంద తల్లడిలగా నెట్లోర్చునో యంచు తా-
నెపుడున్ వీడక యుండె మేన సగమై యీ జీవులన్ గాచుచున్.
సగము సగము కలసి సర్వలోకములకు
తల్లి దండ్రు లగుచు తరుగనట్టి
పరమ దయను జూపు పార్వతీ శివులకు
చేతును శివ రాత్రి ప్రీతి నతులు.
No comments:
Post a Comment