చేత వేడి కుడుము,చెన్నొందు పూమాల,
ఎలుక వాహనమ్ము, యేన్గు మొగము,
పెద్ద చెవులు, బొజ్జ, పెరికిన దంతమ్ము
విఘ్నరాజ! నీకు వేయి నతులు.
కమ్మని యుండ్రములను తిని
యిమ్ముగ తిరుగాడ భూమి, నిమ్మని చందా
గమ్మున మూగిన భక్త జ-
నమ్ముల గని జారుకొను వినాయకు దలతున్!
" ఎంత కాల మిటుల నీ వెట్టి చాకిరీ ?
మోయలేను నిన్ను పోదు స్వామి! "
అన్న ఎలుక ముందు నిన్ని యుండ్రము లుంచి
బుజ్జగించు దేవు బుద్ధి గొలుతు!
సమస్య :
అమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్థాంగిన్ ప్రమోదమ్మునన్.
" సొమ్ముల్ చాలును, నీ సమక్ష మొకటే శోభిల్ల జేయున్ సదా
కొమ్మన్, పెట్టుము క్రొత్త కాపురము నీకున్ మేల " టంచాడరే
అమ్మా నాన్నలు ? నీదు ముచ్చటలు భామా! తీరుగా! ముద్దు లే-
వమ్మా? రమ్మని పిల్చె భర్త తన య యర్థాంగిన్ ప్రమోదమ్మునన్.
కంది శంకరయ్య గారి శంకరాభరణం సౌజన్యంతో................
ఆదిజుడున్, త్రివిక్రముడు, ఆ హరుడున్, సురరాజు, దిక్పతుల్
మోదము తోడ నీ పదము మ్రోల శిరస్సులనుంచి మ్రొక్క త్వ-
త్పాద నఖోజ్జ్వలద్యుతుల వారి కనుంగవ గ్రమ్మె జీకటుల్ !
శ్రీ! దురితాంతకీ ! జనని! చిన్మయ రూపిణి ! చిద్విలాసినీ !
విరులన్ సౌరభమై, ఫలాల రుచివై, విశ్వమ్మునన్ భ్రాంతివై ,
ఝరులన్ వేగమవై , మొయిళ్ల మెరుపై , చైతన్యమై జీవులన్ ,
గిరులన్ నిబ్బరమై , యెడంద దయవై, క్రీడింతు వీ వెల్లెడన్
సిరివై! చిన్మయ రూపిణీ! స్మిత ముఖీ! శ్రీ రాజ రాజేశ్వరీ!
ఇంద్రు సురాధిపత్యమును, ఈశు పురాంతక శక్తియుక్తులున్,
చంద్రుని కాంతులున్, సవితృ సంక్రమణంబులు , చక్రి లక్ష్మియున్,
సంద్రపు లోతులున్, శ్రుతులు స్రష్టకు నీ కరుణా ప్రసాదముల్!
చంద్ర కళాధరీ ! జనని ! శాంకరి ! చిన్మయ రూపిణీ ! పరా !
లక్ష్మీస్తవం - అగస్త్య స్తుతి
మాతర్నమామి కమలే! కమలాయతాక్షి! శ్రీ విష్ణు హృత్కమలవాసిని! విశ్వ మాతః!
క్షీరోదజే కమల కోమల గర్భ గౌరి! లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే!
త్వం శ్రీరుపేంద్రసదనే మదనైక మాతః! జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే!
సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి! లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే!
త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః ! వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ !
విశ్వంభరోపి బిభృయా దఖిలం భవత్యా! లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే!
త్వం త్యక్త మేత దమలే హరతే హరోపి ! త్వం పాసి హంసి విదధాసి పరావరాసి!
ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా! లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే!
శూరః స ఏవ సగుణీ స బుధః స ధన్యో ! మాన్యః స ఏవ కులశీల కలాకలాపై!
ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే! లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే!
యస్మిన్వసేః క్షణ మహో పురుషే గజేశ్వే స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే!
రత్నే పతత్రిణి పశౌ శయనే ధరాయాం సశ్రీక మేవ సకలే తదిహాస్తి నాన్యత్!
త్వత్ స్పృష్టమేవ సకలాం శుచితాం లభేత త్వత్ త్యక్తమేవ సకలం త్వశుచీహ లక్ష్మి !
త్వన్నామ యత్రచ సుమంగళ మేవ తత్ర శ్రీ విష్ణుపత్ని కమలే కమలాలయేపి!
లక్ష్మీం శ్రియంచ కమలాం కమలాలయాంచ పద్మాం రమాం నళినయుగ్మ కరాంచ మాంచ!
క్షీరోదజా మమృత కుంభ కరా మిరాంచ విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం ?
(' ఋషిపీఠం 'వారి సౌజన్యంతో)
ముగ్ధ మనోహరాకృతిని మోహమునన్ బడద్రోసి శంభునిన్,
దగ్ధము జేయ మన్మథుని, తండ్రివి గావవె యంచు వేడవే!
దుగ్ధము లాను నాడె పలు దుర్గుణముల్ ప్రభవించె నా మదిన్
దగ్ధము జేయ వేడగదె తండ్రిని చిన్మయ రూపిణీ ! శివా!