padyam-hrudyam

kavitvam

Tuesday, June 9, 2020

పద్యాల తోరణం లో నా దత్తపది పద్యాలు

విజ్ఞానము, వివేకము, విచక్షణ, పాండిత్యము

త్రాడును జేయు విధానముం దెలియుట
...విజ్ఞాన మనబడు వినుము బిడ్డ
తెచ్చిన త్రాడును తీరైన రీతిలో
...వాడ వివేకమై వరలు బాబు
చేద దండెములలో నేది ముఖ్యమొ తెల్సి
...కట్ట త్రాడును విచక్షణ యగు సుమ
రజ్జుసర్పభ్రాంతి నొజ్జయై వివరించి
...సత్యము దెల్ప పాండిత్య మదియె

కలిగి విజ్ఞాన మెంతయు కలుగ కున్న
సుంతయైన వివేకము చింత మిగులు
తనదు పాండిత్యమును దెల్పు తరుణ మెరిగి
మసలుకొను విచక్షణ యున్న మంచి దెపుడు

నన్నయ నన్నయ నన్నయ నన్నయ : పరార్థంలో

దత్తపదికి నా ప్రయత్నం:

న న్నయవారు రమ్మనిరి నాల్గు దినమ్ముల ముందె యింటి, కే
నన్నయ! యింటిదాని కిట నంతగ బాగుగ లేమి మేన, శ్రీ
నన్నయ నంపినాడ మరి యాపయి నేమయెనో యెఱుంగ నే
నన్నయ! తప్పు గాచు మని యయ్యకు జెప్పవె నీవు మంచిగా.
------
నేటి దత్తపది : మనీ, మెనీ, హనీ, వనీ

నా ప్రయత్నం:

శ్యామ నీ వారము జాలి లేదా యేమి
....నిను వీడి మనలేము నీలవర్ణ
కామె నీ కగు వార మేమి స్వామీ వేగ
....యమునా తటికి రావె యదుకుమార
ఊహ నీదే మాకు నోహ నీదే ప్రభూ
....తలపు నీదే మాదు వలపు నీదె
రావ నీ పిల్లనగ్రోవిని సవరించి
....యూపిరు లూదవె యువిద తతికి

నిన్ను గనరాక యమునయు ఖిన్న యాయె
సైకత శ్రేణి నీ పద స్పర్శ లేక
ప్రభలు మాసె బృందావని బావురు మనె
ననుచు గోపికల్ విరహాన నడలి రపుడు.
--------
ఈనాటి దత్తపది: భీమ, నకుల, కర్ణ, శల్య

రామాయణార్థం లో..

పనిగొని భీమ వేషమున పంక్తి గళుండు హరించె సీత నా
యినకుల దీపకుండు చన నిఱ్ఱిని తెచ్చుట కామె రోదనల్
వనమున మారు మ్రోగె నలు వంకల కర్ణ కఠోరమౌచు తా
కెనవి జటాయు నామ విహగేశుని డెందము నందు శల్యమై.
-------
గది గది గది గది ... అన్యార్థంలో

నేటి దత్తపదికి నా ప్రయత్నము:

గదిఁ గనినంత బాలకుడు కన్నుల బాష్పము లుప్పతిల్ల వే
గఁ దిగి తపోస్థలిన్ జరణ కంజములం బడి మ్రొక్కి దివ్యమౌ
గదితములన్ స్తుతించ తన కంజ కరమ్ముల లేపి చక్రి 'నిన్
గదిసితి మెచ్చి నీ తపము గణ్య పదం బిదె కొ'మ్మనెన్ కృపన్.
_------
నేటి దత్తపది ... రగులు పగులు దిగులు మిగులు

రగులు నాలి కొనక రమ్యమౌ భూషల
పగులు మాడు కాని పనుల జేయ
దిగులు భావి కొఱకు తగిన కొలువు లేక
మిగులు పురుషునకు సుమి తుది సున్న.
------

నేటి దత్తపది కల కల కల కల అన్యార్థంలో

కలకలలాడుచుండు ఘన కావ్య పురాణ ప్రబంధ పద్య పు
ష్కల కలకూజితమ్ములును సత్కవివల్లరులన్ సుమించు కై
తల నవపుష్పశోభలును ద్రావి సుమమ్ముల దేనె లాడు స
భ్యు లను కలానునాదులును బొల్చు వనమ్మగు పద్యతోరమే.
--------

పద్యాల తోరణంలో నేటి దత్తపది:

టుడే టుమారో నెవర్ ఎవర్

రా కిటు లేక దారా వ్రతుండను విను
....మేనెవ రనుకొంటి వీవు సుదతి
రా కిటు భామినీ నీకెవ రానరే
....బడుగు బాపడు దప్ప వలపు రేప
రా కిటు మారోగ్ర రమ్య నారాచమా
....నీమ నిష్ఠల జెడనీకు నన్ను
రా కిటు డేగవై రమణి వేటాడ నన్
....పావురమ్మును కాను పనికిరాను

పలికి యీరీతి ప్రవరుండు బాహుబంధ
మునను గొన రా వరూధిని మోము ద్రిప్పి
హరి హరీ యంచు దవ్వున కరిగె తాను
ధీర హృదయాల స్త్రీ మాయ చూరగొనునె.
----------
పద్యాలతోరణం లో నేటి దత్తపది: వంగ బీర కాకర దోస
భారతార్థంలో

సుధేష్ణ పాంచాలి తో...

వేసి లవంగ మేలకులు వేగమె యిచ్చి విడెమ్ము పోగదే
మాసినచీర మార్చుకొని మాలిని బీరము మాని యిందునే
దోసము లేదు సోదరుని తోడ వచింపుము నాదు వేదనన్
వాసిగ మాధ్వి కాకరము వాని నివాసము జాగు సేయకే.
---------
 నేటి దత్త పది: సాక్షి, ఈనాడు, జ్యోతి, ప్రభ
రామాయణార్థంలో ........   నా ప్రయత్నం:

కా డగు లంక, రాము డన కాలుడు, సంద్రమె సాక్షి, చీల్చి చెం
డాడును దైత్యకోటుల దశానన! జ్యోతిని డాయు పుర్వులై
మాడుట తథ్య మెల్లరును, మాయును నీ ప్రభ, లాయె మూర్త మీ
నా డిపుడే గ్రహింపుమ యనంగను వాలిసుతుండు రోషియై....
-------
నేటి దత్తపది: వరి,రాగి, కంది, నూగు...జాతీయ సమైక్యత.

చేతి కందిన స్వేచ్ఛను చెరుప బోకు
శార్వరికి తావు నీయకు స్వార్థ మునను
జాతి మతముల పో రాగి జన మనముల
కేళిగా నూగు స్వాతంత్ర్య డోల నిజము.
--------
 దత్తపది: కుక్క నక్క మొక్క వక్క - అన్యార్థంలో.

కుక్కరు పద్యరాశులను గుట్టగ నొక్కెడ, వేరు వేరుగా
నక్కడ శీర్షికల్ పఱగు, నందుకు కాలము నిర్ణయమ్ము, బల్
చక్కని వక్కణమ్ములకు సన్నిధి యీ మన పద్య తోరణ,
మ్మొక్కరి నైన నల్పు లన నోపని సత్కవినందన మ్మహో!
--------
నేటి దత్త పది: కలము,హలము, పొలము, జలము

జలము నొకర్తె మథించెను,
హలమునకుం గట్టె నొకతె యావుల, నాడెన్
బొలమున నొకరిత సోకగ 
కలమురళీ రవము గోపికా కర్ణములన్.
---------
దత్త పది: నగ వగ పగ మగ .. భారతార్థంలో

నగరే లోకులు పార్థ నీ చెయిదము న్నా మాట పాటించు మా
పగ యుద్ధమ్మును నీకు గాని దిచట న్బ్రాణంబుల న్నిల్పి కా
వగ నీ వెవ్వడ వోయి బంధు తతుల న్వారెల్లరు న్మున్నె నీ
లిగి నా రేలను జింత నీ మగటిమి న్ప్రేరేచవే పోరవే.
---------
నేటి దత్తపది : హరి హరి హరి హరి
శ్రీహరియేతరార్థంలో భారతపరంగా.

హరి నోట జిక్కి నలిగెడు
హరిణంబై దుస్ససేను హస్తము లందున్
హరిణాక్షి కృష్ణ చిక్కెను
హరియించెడు వేళ నాత డామె వసనమున్.

 మరో ప్రయత్నం ముందటి భావంతోనే...

హరి నోటం బడి చీలిపోవు తనువై యారణ్యమం దొంటిదౌ
హరిణంబౌ గతి రాల నశ్రువులు హాహాకారము ల్జేయు నా
హరిణాక్షిన్ ద్రుపదాత్మజన్ కుటిలమౌ హస్తంబులం బట్టి తా
హరియింపన్ సమకట్టె కౌరవుడు హేయంబౌ గతిన్ వల్వలన్.

పట్టు పట్టు పట్టు పట్టు 

పట్టుడు రండు ౘూడు డదె బంగరు జిం కని గట్టిగా నదే
పట్టును బట్ట నా పుడమిపట్టి వనమ్ములు దైత్యమాయకుం
బట్టన బోక పంక్తిరథుపట్టి ౘనెన్ వెసఁ బూని పట్టు న
ప్పట్టున బట్టి తెచ్చి ప్రియపత్నికి ముందర గట్ట‌ నేణమున్.

తక్రము నక్రము వక్రము చక్రము 

పాండవులను లొంగదీసుకోవాలంటే కృష్ణుని బంధించక తప్పదని శకుని సుయోధనునితో అన్న ట్లూహ.

తక్రముఁ గోరి క్షీరమును ద్రచ్చిన మేలొకొ తోడుపెట్టకన్
వక్రము లున్న కఱ్ఱఁ గొని వాసముఁ జేతురె వంపుఁ దీయకన్
నక్రము బాయ నీరమును నాశము కాదొకొ చిక్కి కుక్కకున్
జక్రమువాని బట్టకను సాధ్యమె పాండవులన్ బొకాల్చుటల్?

తీపి చేదు పులుపు కారము 

నాతీ పిలువకె పోవుట
రీతియె? నీ తండ్రిచే దురీషణ నొందన్
బ్రీతియె? నీ మమకారపు
సేతలు పులు పుట్ట జేయు జెల్లని చోటన్.

పులు = గడ్డి ...... (పులుపు కోసం పాట్లు)

సిరులు గిరులు విరులు కురులు 
అర్జున విషాదం

సిరులను బొంద రాజ్యమును జేఁగొనఁ గూల్తునె బంధుమిత్రులన్?
గిరులను పిండి చేయుదునె గీమును గట్టగఁ? గోరి తేనె క్రొ
వ్విరులను జింౘ మేలగునె? వేయక మందును ౙంప యూకమున్
కురులను గాల్చు టొప్పగునె? గోపకులైకవిభూషణా! కటా!

లంచి బెంచి పంచి రెంచి ..... రామాయణం

చం.
మదినిఁ గలంచి రావణుని మానసమందున భూమిజాతపై 
మదిఁ గడుఁ బెంచి శూర్పణఖ మాయలు వల్కిన దూషణాదులన్ 
గదన విపంచి మీట రఘుకాంతునిపై పురిగొల్పె నాతఁడున్ 
మది నెడ రెంచి రామునకు మాసిరి దైత్యులు సర్వు లీ గతిన్
.
అంటి వింటి కంటి చంటి ....బాలకృష్ణుడు 

అంటిన వెన్నను నాకును  
కంటివె నను దొంగ యండ్రు కాంతలు సూవే 
వింటివె అమ్మా యను తన  
చంటితనము సూపు గృష్ణు సన్నుతి సేతున్.

బింకు చింకు లింకు మింకు .... రామాయణం 

హనుమ సీతతో: 

చింకు వోలె నాయె సింధువు నే దాట   
శరధు లింకు రామచంద్రు డలుగ  
బింకు రావణుండు బృధ్వినిఁ గూలును
నీదు శోక మింకు నిజము తల్లి.   

మదన సదన వదన రదన 

సర్వలఘు కందములు  

కలుములమ్మ:   
మదన జనని హరి హృదయపు  
సదన కలుము లిడెడి సుతిని సరసిజ నిభ స  
ద్వదన సిత కుటజ ముకుళ సు 
రదన నను నొకపరి దయ నరయుము కనుగడన్. 

గౌరమ్మ:
మదన హర సతి పతి యజిర
సదన తుహిన గిరి తనుభవ శరవణ జననీ 
చదిర వదన సుసిత కుసుమ 
రదన కరుణ నను గనవె శరణము తనయుడన్.

పలుకులమ్మ: 
సదనము సిత వనజము సుమ 
రదనము చదువులకు నెలవు రమణి నలువకున్ 
వదనము చదువుల నిలయము  
మదనము కదె పలుకు గనిన మనకు బ్రదుకునన్ 

రాగి.  కంది.  వరి.  తిల - అన్యార్థంలో శివస్తుతి

బైరాగి భిక్షువు వల్లకాటి నివాసి 
...బూది పూతల సామి భుజగధారి 
పునుకం దినెడు వాఁడు బుర్రె పేరుల వాఁడు  
...తలపైన గంగమ్మ జెలఁగు విభుఁడు
బెట్టుసరిం జూపి గట్టుకూతు వరించి
...సామేను నొసగిన చక్కనయ్య 
చిత్తజు తిలకించి చిఱ్ఱెత్తి కాలిచి  
...ఆనక బ్రతుకిచ్చి నట్టి జేజె 

మంచు కొండను దానుండు మంచి జేయు 
విషము భుజియించు శరణన్న వెతలఁ దీర్చు
పశులఁ బోలిన మూర్ఖుల పాలి మిత్తి 
నమ్మి భజియించు వారల సొమ్ము శివుఁడు.

జయప్రద,  జయసుధ, జయచిత్ర, జయలతా .. ధనుర్మాస వైశిష్ట్యం 

నెల యెల్ల నీపూజ నిష్ఠతో శ్రీహరీ! 
...యగు గాక భువిని జయప్రదముగ 
సరి లేని నీ కథా జయసుధామృతమును  
...బాడుచు హరిదాసు లాడు గాక 
ముంగిళ్ళు నెలతల రంగవల్లీ రమ్య   
...జయచిత్రములతో మెఱయును గాక 
శ్రీ గోద జయలతా చిన్మయ పుష్పమా! 
...మీ గాథ లవని మార్మ్రోగు గాక

ఈ ధనుర్మాస ప్రత్యూష లిల నరులకు 
నీ పరమపదమును జేర నియతి తోడ 
సాధనలు జేయ మార్గమై సంతతమ్ము 
తనరు న ట్లభయము నిమ్ము తనుపు మమ్ము.

సారము లేని దీ భవము జాలు వినోదము లింక మోహమన్
దారముఁ బట్టి వ్రేలెదవు దారయు బిడ్డలు నిన్నుఁ గాతురే?
భారము గాదె నీ బ్రదుకు? పాటున గూలక మున్నె మిత్తి హుం
కారము వీనులం బడకె కామహరున్ శరణంచుఁ జేరవే.

నుదురు / పెదవి  / కన్ను  / రెప్ప -    అన్యార్థంలో మహాభారత పరంగా

పూనుదు రుగ్ర మూర్తులయి పోరునఁ జెండగ మిమ్ము పాండురా
ట్సూనులు వాజిదౌ పెద విసూచినిఁ బొందిన నిన్ను సుర్నదీ 
సూనునకైనఁ గా దరిది సూడుము గాచుట, కన్నుగప్పుటల్ 
గానిది యుద్ధ మన్న విను కౌరవ నాశము  నీకు రెప్పమౌ.

వరము  వరము వరము వరము -
భగవద్విషయము:

వరములు గోరెద రిల తీ
వరమునఁ బలు సిరుల కొఱకు భగవంతునిఁ గా 
వరమునఁ గాదే ముక్తిని 
వరముగ యాచించ జన్మ బాధ లుడుఁగవే!

దైవేతరము:

వరమునకు శ్రేష్ఠ మని కా 
వరమునకును బీచ మనియు వనితామణి! తీ 
వరమునకుఁ ద్వరిత మని కల 
వరమున కిలఁ జింత యనియు వర భావనలౌ.

అన్నము/ సున్నము/ ఖిన్నము/ భిన్నము

భారతీయ సంస్కృతిపై 

ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడం, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడం భారతీయ సంస్కృతి. రంతిదేవుడు ఆకలి అని వచ్చిన వాడితో అంటున్న మాటలుగా....

అన్నము లేదు ద్రావ మధురాంబువు లున్నవి నేను నీవునున్
భిన్నము కాదు దేహములె వేరగు నాత్మ యొకండె డెందమౌ 
ఖిన్నము సాటి జీవులకు కీ డొనగూరిన నాకు, నాకుతో  
సున్నము రీతి సఖ్యతను జూపుట నా విధి రమ్ము పుల్కసా!
 

1 comment:

cbs said...

Sir it's better to add search this blog gadget in your blog for search posts