padyam-hrudyam

kavitvam

Tuesday, June 9, 2020

పద్యాల తోరణం లో న్యస్తాక్షరిపై నా పద్యాలు

నేటి న్యస్తాక్షరి : మొదటి పాదంలో మొదటి అక్షరం తో, రెండవ పాదం లో రెండవ అక్షరం ర, మూడవ పాదంలో మూడవ అక్షరం ణ, నాలుగవ పాదం లో నాలుగవ అక్షరం ము

అభిమన్యుడు ధర్మరాజు తో..

తోరపు బాహువిక్రమముతో చెలరేగెడు కౌరవాళినిన్
మారణ హోమకుండమున మాడ్చి హవిస్సుగ మృత్యుదేవికి
న్నీ రణధీరుడౌ చిఱుత యింపుగ నిచ్చును మోహరమ్మునన్
వారణము న్సహింప నిక వద్దనబోకుడు పెద్దతండ్రి! నన్.
---------

పద్యాల తోరణంలో
2.5.2020
న్యస్తాక్షరి
1వపాదంలో10"భా"
2వపాదంలో2"ర"
3వపాదంలో11"త"
4వపాదంలో9"ము"
రామాయణార్థంఉత్పలమాల:

పారము లేని దాయెను ప్రభాకరు జూడని రాత్రి యాయె నీ
దార విచార మో ప్రభు సదా స్మరియించుచు నిన్ను దుఃఖపుం
దారణ మేదియున్ గనక ద్రాతలు లేక కృశించి యున్న దన్
మారుతి వాక్కులన్ ముఖము మ్లాన మయెన్ రఘురామ మూర్తికిన్.
--------
పద్యాలతోరణం
12.5.2020
నేటిన్యస్తాక్షరి

1వపాదంలో 1వ అక్షరం "క"
2వపాదంలో 2వ అక్షరం"మ"
3వపాదంలో. 3వ అక్షరం "ల"
4వపాదంలో 4వ అక్షరం "
ము"

అంశం సీతాస్వయంవరం
చంపకమాలపద్యంలో

కమలనిభాస్య సీత ప్రియ కన్యక నాకు మదీయసూన స
త్కమల కరమ్ములందు గల కాంచన మాలను శంభు చాప
మున్
సుమలత వోలె నెత్తగల శూరుని కంఠము నందు వైచి యా
కమలము వంటి పాణి గొని కార్కొను నంచు విదేహు డాడినన్.
--------

పద్యాల తోరణం లో నేటి న్యస్తాక్షరి : కమలము - మరొకటి

కమలము పీఠమై నలు ముఖమ్ముల వేదము లాడు బ్రహ్మయున్
కమలములన్ జయించు సుముఖమ్ముల నారిట వెల్గు స్వామియున్
కమలము వాసమైన సిరి కాంతుని పా న్పగు నాది శేషుడున్
కమలము లూఱు నీ పద యుగమ్మును బాడగ లేరు శంకరా.
---------
పద్య తోరణంలో నేటి న్యస్తాక్షరి: క చ ట త ప లు పాదాదిలో ఉంటూ తెలుగు భాష సౌందర్య వర్ణన

కలకండ సారము కలవేణు రావము
....తెలుగు తీపికి ముందు నిలువ గలవె
చతురాస్యు డైనను శారద యైనను
....తెలుగు ప్రశస్తిని దెలుప గలరె
టంకృతి యైనను భాంకృతి యైనను
....తెలుగులో వలె గాక పలుక గలమె
తలకట్టు ఠీవియు వెల లేని శైలియు
....తెలుగు గా కితరాల వెలుగ గలవె 

పద్య మన్నది తెలుగుకు స్వంత యాస్తి
యెన్న నవధాన మితరాల సున్న కాదె
దేవతల కైన బ్రియమిది తెలుగు నేల
బూర్వ సుకృతము లేనిదే పుట్ట గలడె?
-------------

1 - 4 గా
2 - 2 య
3 -  9 కు
4 - 7 డు
కుమారస్వామి - ఉత్పలమాల

మాయని గాయమై జగతి మ న్నొన రింౘగ నెంచి నట్టి యా
మాయల తారకాసురుని మట్టును బెట్ట జనించి మించె నా
గ్నేయుఁడు స్కందుఁడా హిమకుకీలసుతాత్మజుఁ డార్త కోటులం
బాయక నేలువాఁడు మన పాలి గురుండు గుహుండు మ్రొక్కరే. 



No comments: